Followers

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం మూడవ అధ్యాయం


ఓం నమో భగవతే వాసుదేవాయ 

మైత్రేయ ఉవాచ
సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః
జామాతుః శ్వశురస్యాపి సుమహానతిచక్రమే

యజ్ఞ్యము పూర్తయి ఇలా చాలా కాలం గడిచిపోయింది. 

యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా
ప్రజాపతీనాం సర్వేషామాధిపత్యే స్మయోऽభవత్

ఈ సమయములోనే దక్షుని సామర్ధ్యాన్ని గుర్తించి బ్రహ్మగారు ప్రజాపతులందరికీ అధినాయకుడిని చేసాడు. దానితో గర్వం పెరిగింది (స్మయోऽభవత్)

ఇష్ట్వా స వాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ
బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమమ్

అధికారముతో ఏమి చేసినా చెల్లుతుంది కాబట్టి, వాజపేయ యాగం చేయ తలపెట్టాడు. అందులో భాగం ఇవ్వకుండా బ్రహ్మజ్ఞ్యానం కలవారందరినీ (శివున్ని ఆమోదించేవారందరినీ అవమానించాడు). వాజపేయం చేయగానే బార్హస్పత్యం చేయాలి. 

తస్మిన్బ్రహ్మర్షయః సర్వే దేవర్షిపితృదేవతాః
ఆసన్కృతస్వస్త్యయనాస్తత్పత్న్యశ్చ సభర్తృకాః

శంకరునికి సంబంధించిన వారు తప్ప, తక్కిన వారందరూ వెళ్ళారు. వారందరినీ ఆహ్వానించారు. భార్యలను తీసుకుని వారు అక్కడికి వెళ్ళారు. 

తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతామ్
సతీ దాక్షాయణీ దేవీ పితృయజ్ఞమహోత్సవమ్

ఇలా అందరూ మాట్లాడుకుంటూ వారి భర్తలతో కలిసి విమానాలలో వెళుతుంటే తన తండ్రి గొప్ప యజ్ఞ్యాన్ని తలపెట్టాడని విని 

వ్రజన్తీః సర్వతో దిగ్భ్య ఉపదేవవరస్త్రియః
విమానయానాః సప్రేష్ఠా నిష్కకణ్ఠీః సువాససః

మంచి బట్టలు వేసుకుని ఆభరణాలను వేసుకుని ఆడవాళ్ళందరూ భర్తలతో కలిసి విమానాలలో వెడుతున్నారు. 

దృష్ట్వా స్వనిలయాభ్యాశే లోలాక్షీర్మృష్టకుణ్డలాః
పతిం భూతపతిం దేవమౌత్సుక్యాదభ్యభాషత

చక్కని కుండలములూ ఆభరణములతో చక్కని కనురెప్పలు కలవారు వెడుతూ ఉంటే, సతీ దేవి భూతపతి అయిన శంకరునితో ఇలా అంది

సత్యువాచ
ప్రజాపతేస్తే శ్వశురస్య సామ్ప్రతం నిర్యాపితో యజ్ఞమహోత్సవః కిల
వయం చ తత్రాభిసరామ వామ తే యద్యర్థితామీ విబుధా వ్రజన్తి హి

స్వామీ! మీ మామగారైన ప్రజాపతి ఇప్పుడు ఒక మహా యజ్ఞ్యాన్ని తలపెడుతున్నారట. దేవతలందరూ వేడుతున్నారు, పిలిస్తే మనం కూడా వెళదాము. 

తస్మిన్భగిన్యో మమ భర్తృభిః స్వకైర్ధ్రువం గమిష్యన్తి సుహృద్దిదృక్షవః
అహం చ తస్మిన్భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితుమ్

అక్కడకి నా అక్క చెల్లేళ్ళు వస్తారు, వారి భర్తలు కూడా వస్తారు. అందరు తమతమ బంధువులను చూచుటకు వస్తారు. మా చెళ్ళెల్లందరు తమ బంధువులని చూడటానికి భర్తలతో వస్తున్నట్లు మనం కూడా వెళ్ళాలి. మా తండ్రిచే సమ్మానాన్ని పొందాలి. 

తత్ర స్వసౄర్మే నను భర్తృసమ్మితా మాతృష్వసౄః క్లిన్నధియం చ మాతరమ్
ద్రక్ష్యే చిరోత్కణ్ఠమనా మహర్షిభిరున్నీయమానం చ మృడాధ్వరధ్వజమ్

అక్క్డ మా అక్కలూ వారి భతలూ, చెల్లెలు వారి భర్తలు, మాతృష్వసౄః - తల్లి చెల్లెలు, ఎంతో కాలముగా చూడని మా తల్లిని చూడవచ్చు. ఎందరో మహానుభావులూ జ్ఞ్యానులూ యజ్ఞ్యాన్ని చూడటానికి వస్తారు.

త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకమ్
తథాప్యహం యోషిదతత్త్వవిచ్చ తే దీనా దిదృక్షే భవ మే భవక్షితిమ్

పరమాత్మ యొక్క తన మాయతో త్రిగుణాత్మకముగా ఉన్న సంసారం త్రిగుణాతీతులైననీకు ఆశ్చర్యం కల్పించకపోవచ్చు. మీరు మహానుభావులూ జ్ఞ్యానులు. కానీ నేను స్త్రీని, తత్వము తెలియని దాన్ని, తల్లి తండ్రులను చూద్దామని దీనముగా ఉన్నా. నా దుఃఖాన్ని తొలగించి నాకు ఈ అవకాశాన్ని కల్పించవలసింది.. 

పశ్య ప్రయాన్తీరభవాన్యయోషితోऽప్యలఙ్కృతాః కాన్తసఖా వరూథశః
యాసాం వ్రజద్భిః శితికణ్ఠ మణ్డితం నభో విమానైః కలహంసపాణ్డుభిః

కాబట్టి శంకరా! చూడు. అందరూ వారి ప్రియులను వెంట తీసుకుని బయలు దేరుతున్నారు. గుంపులు గుంపులుగా వెళుతున్నారు. ఇలా ఒక్క సారి ఆకాశములో కలహంసల ఆకారములో ఉన్న తెల్లని విమానాలతో ఆకాశం అలంకరించబడి ఉన్నది. 

కథం సుతాయాః పితృగేహకౌతుకం నిశమ్య దేహః సురవర్య నేఙ్గతే
అనాహుతా అప్యభియన్తి సౌహృదం భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనమ్

ప్రపంచములో ఏ కూతురైనా, తండ్రి ఉత్సవం చేస్తున్నాడంటే శరీరం ఉప్పొంగి వెళ్ళాలని అనిపించదా.  పిలిస్తేనే వెళ్ళాలి అన్న నియమం ముగ్గురి దగ్గర ఉండదు. ఒకరు భర్త, రెండవ వారు గురువులూ లేదా మామ గారు, మూడవ వారు తండ్రి. ఎందుకంటే ఈ దేహమే తండ్రి యొక్క దయ.అక్కడికి వెళ్ళడానికి ఆహవానం రాలేదనడం సమంజసం కాదు

తన్మే ప్రసీదేదమమర్త్య వాఞ్ఛితం కర్తుం భవాన్కారుణికో బతార్హతి
త్వయాత్మనోऽర్ధేऽహమదభ్రచక్షుషా నిరూపితా మానుగృహాణ యాచితః

మీరు ప్రసన్నులు కండి. నీ కోరిక తీర్చుటకు సహజముగా దయ కలిగిన మీరు సమర్ధులు. నేను యాచిస్తున్నాను, మీరు పరిపూర్ణమైన దయా కటాక్షముతో అనుగ్రహించండి

ఋషిరువాచ
ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ప్రత్యభ్యధత్త ప్రహసన్సుహృత్ప్రియః
సంస్మారితో మర్మభిదః కువాగిషూన్యానాహ కో విశ్వసృజాం సమక్షతః

ఇలా సతీ దేవి మాట్లాడితే ఒక చిరునవ్వు నవ్వుతూ, ప్రియురాలి యందు ఎక్కువ ప్రీతి కలవాడు కాబట్టి ఇలా అన్నాడు. ఆమెతో మాట్లాడదామనుకునేసరికి ఆనాడు సభలో ప్రజాపతి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. మర్మమును భేదించే మాటలని గుర్తుచేస్తుకుని

శ్రీభగవానువాచ
త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుతా అప్యభియన్తి బన్ధుషు
తే యద్యనుత్పాదితదోషదృష్టయో బలీయసానాత్మ్యమదేన మన్యునా

సుందరీ! నీవు చెప్పిన మాటలు వాస్తవమే. బంధువుల ఇళ్ళకు పిలవకున్నా వెళ్ళాలి. కాని ఎటువంటి బంధువుల ఇంటికి? మనమాచరించిన పనులలో దోషము కనిపించని వారి ఇంటికి కంపించకున్నా వెళ్ళాలి. మనం మంచి చేసినా అందులో చెడును కల్పించి చూసేవారికి ఈ నియమం వర్తించదు. అలా ఎందుకు కల్పిస్తారు? వారికి హృదయం కంటే జ్ఞ్యానం కంటే బుద్ధి కంటే వివేకం కంటే శరీర మదం (శరీరమే ఆత్మ అనే మదం) ఉంటుంది. వారు మనం ఆచరించే మంచి పనులలో దోషాన్నే చూస్తారు. దేహాత్మాన మత్సరగ్రస్థులై చెడును మాత్రమే చూసేవారి ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. 

విద్యాతపోవిత్తవపుర్వయఃకులైః సతాం గుణైః షడ్భిరసత్తమేతరైః
స్మృతౌ హతాయాం భృతమానదుర్దృశః స్తబ్ధా న పశ్యన్తి హి ధామ భూయసామ్

విద్యా గానీ, తపస్సు గానీ, వ్రతము గానీ,కులము గానీ, జ్ఞ్యానం గానీ,మతం కానీ , సంపద గానీ, ఇవన్నీ అహంకారమూ అసూయ కలగనంత వరకే మంచివి. ఒక్క సారి అవి కలిగితే, అప్పటి దాకా ఎంతో మంచిగా ఉన్నవి, తమకూ ఎదుటివారికీ చెడునే కలిగిస్తాయి. విద్య తపసు ధనం శరీరం వయసు కులమూ - ఈ ఆరు మంచి గుణాలు. ఇవి మంచి వారికుంటే జ్ఞ్యాంబం సంస్కారం పెరుగుతునంది. లోకహితం కలుగుతుంది. ఇవి దుర్మార్గులకు ఉంటే స్మృతి కాస్తా పోతుంది. భృతమానదుర్దృశః  - వీరిలో బుద్ధి పోయి అహంకారం పెరుతుంది. దీని వలన చెడు చూపు, చెడు ఆలోచన పెరుగుతుంది. అలాంటి వారు జడులవుతారు. అలాంటి వారు పరమ ధామమును చూడలేరు. 

నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ప్రతీయాదనవస్థితాత్మనామ్
యేऽభ్యాగతాన్వక్రధియాభిచక్షతే ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభిః

మదమూ అహంకారమూ గర్వమూ అభిమానమూ ఇవన్నీ పెరిగిన వారు, పొరబాటున వారికి సంపద ఆధిపత్యం అధికారం తపస్సు, చేరితే వాటి వలన కలిగే అనర్థాలు ఇవి: ఇలాంటి వారిని తనవారనుకొని ఆలోచించి వారి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకంటే వారికి మనో నిగ్రహం లేదు. స్వస్థ చిత్తులు కాదు. మనవారనుకొని వీరి ఇంటికి వెళ్ళకూడదు. తమ ఇంటికి బంధువులుగా వచ్చిన వారిని వంకర బుద్ధితో మట్లాడతారు. కనుబొమ్మలు ముడివేస్తూ కనుపాపలను తిప్పుతూ అసహనమంతా కనుపాపలలోనే చూపుతు మాట్లాడతారు. 

తథారిభిర్న వ్యథతే శిలీముఖైః శేతేऽర్దితాఙ్గో హృదయేన దూయతా
స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిర్దివానిశం తప్యతి మర్మతాడితః

యుద్ధములో శత్రువుల బాణముల దెబ్బలు తిని కూడా సహించవచ్చు(కొన్ని రోజులలో అవి మానుతాయి) గానీ, తన వారనుకున్న వారి వక్రబుద్ధితో మాట్లాడిన చెడుమాటలతో మర్మముల మీద కొట్టబడి రాత్రింబవళ్ళూ బాధపడుతూనే ఉంటాడు. 

వ్యక్తం త్వముత్కృష్టగతేః ప్రజాపతేః ప్రియాత్మజానామసి సుభ్రు మే మతా
తథాపి మానం న పితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్కః పరితప్యతే యతః

ఒక మాట మాత్రం నిజం. మీ తండ్రికున్న అందరి అమ్మాయిలలో నీవంటేనే ఎక్కువ ప్రేమ. అది తెలుసు. కానీ ఇప్పుడు నీవు వెళితే మీ తండ్రిగారితో ఆదరాన్ని పొందలేవు. నువ్వు నువ్వుగా ఉంటే ఇష్టపడతాడు గానీ, ఇప్పుడు నీవు నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు ఆదరం లభించదు. అతను నేనటేనే మండిపడుతున్నాడు. నా పేరు పలకడు కాబట్టి నిన్ను "శంకరుని భార్య " అని అనలేడు. 

పాపచ్యమానేన హృదాతురేన్ద్రియః సమృద్ధిభిః పూరుషబుద్ధిసాక్షిణామ్
అకల్ప ఏషామధిరోఢుమఞ్జసా పరం పదం ద్వేష్టి యథాసురా హరిమ్

రోజు రోజుకూ అతని హృదయం ఉద్వేగముతో ఉడుకుతోంది. శంకరున్ని ఏమీ చేయలేకపోతున్నాను అని ఉడికిపోతోంది. అతని ఇంద్రియములన్నీ జబ్బు పడ్డాయి. మన బుద్ధిని చెప్పేవి సంపదలు. సంపదలు బాగా పెరుగుతున్న కొద్దీ మన బుద్ధి బయటపడుతుంది. మన మనసును ఉన్నదున్నట్లు బయట పెట్టేవి సంపదలు. బాగా సంపద వస్తేనే మన అసలు రంగు బయట పడుతుంది. అలాంటి వారు ఉన్నత స్థానం పొందుటకు అర్హులు కారు. అలాంటి వారు ఒక్కొక్క స్థానం పైకెక్కుతున్నకొద్దీ, రాక్షసులు శ్రీమహావిష్ణువును ద్వేషించినట్లుగా , వీరు లోకాన్నీ సజ్జనులనూ ద్వేషిస్తారు. 
దక్ష ప్రజాపతి గాధా పృధు చక్రవర్తి గాధ (వేనుడి కథ) లేని పురాణమే లేదు. దేహాత్మాభిమానం అహంకారం ఎంతటి జ్ఞ్యానినయినా ఎలా పతనం గావిస్తుందో చెబుతాయి. అవమానాన్ని అమృతం తాగినట్లు ఆస్వాదించాలి. విషాన్నం తిన్నట్లు సమ్మానాన్ని ద్వేషించాలి. దక్షుడి వంటి వాడే అనర్థాన్ని గొని తెచ్చుకున్నాడు.

ప్రత్యుద్గమప్రశ్రయణాభివాదనం విధీయతే సాధు మిథః సుమధ్యమే
ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ న దేహమానినే

లేచుటా వంగుటా అభివాదం చేయుటా, ఇవి పరస్పరం చేసుకునే పనులు. జ్ఞ్యానం ఉన్న ప్రతీ వారు, మనలో దాగి ఉన్న అంతర్యామి అయిన పరమాత్మకు మనసుతో (చేతసా) చేయాలి. ఆత్మలో అంతర్యామిగా ఉన్నవాడికే చేయాలి గానీ, దేహాత్మాభిమానం ఉన్నవాడికి కాదు. శరీరాన్ని చూచి చేయకూడదు. మనసుతో చేయాలి. 

సత్త్వం విశుద్ధం వసుదేవశబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః
సత్త్వే చ తస్మిన్భగవాన్వాసుదేవో హ్యధోక్షజో మే నమసా విధీయతే

ఆ ఆత్మలో అంతర్యామిగా ఉండే సత్వం విశుద్ధం. అదే వాసుదేవుడూ నారాయణుడు. ఆయనే  ఆ హృదయములో ప్రతీ దినమూ వృద్ధి పొందుతూ ఉంటాడు, తెలియబడుతూ ఉంటాడు, తెలియజేయబడుతూ ఉంటాడు. నేను కూడా శుద్ధ సత్వగుణముతో దక్షుడిలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడికి నమస్కరించాను. అది ఆయన గుర్తించాడు గానీ, ఆయన దాగి ఉన్న ఈయన గుర్తించలేదు. సకల ఇంద్రియ వ్యాపారాలను ధిక్కరించేవాడైన స్వామి అధోక్షజుడు. మన ఇంద్రియములతో జరిగే వ్యాపారాలను కిందపడేసేవాడు. అన్ని ఇంద్రియ వ్యాపారాలను మానుకొని స్వామికి నమస్కరించాలి. ఆపని నేను (శంకరుడు) చేసాను. 

తత్తే నిరీక్ష్యో న పితాపి దేహకృద్దక్షో మమ ద్విట్తదనువ్రతాశ్చ యే
యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరు మామనాగసం దుర్వచసాకరోత్తిరః

కాబట్టి నీవు ఆ విషయాన్ని గమనించాలి. నేను ఆదరించలేదని చూడకూడదు. ఇప్పుడు మీ తండ్రి చేసే యజ్ఞ్యానికి వెళుతున్న నీ వారినీ వారి ఆబరణాలనీ కాదు నీవు చూడవల్సినది. ఇపుడు నీ తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు. నన్ను అనుసరించిన వారినీ ద్వేషిస్తున్నాడు. నీవు వెళ్ళినా అదే జరుగుతుంది. అందరం వెళ్ళింది ప్రజాపతులు చేసే యజ్ఞ్యానికి వెళ్ళాము. అక్కడ యజ్ఞ్యాన్ని చూసే బదులు "నాకు నమస్కరించలేదు" అంటూ కోపించాడు. అక్కడకి వెళ్ళిన నిర్దోషిని అయిన నన్ను దుష్ట వాక్యాలతో నన్ను దూషించాడు

యది వ్రజిష్యస్యతిహాయ మద్వచో భద్రం భవత్యా న తతో భవిష్యతి
సమ్భావితస్య స్వజనాత్పరాభవో యదా స సద్యో మరణాయ కల్పతే

నా మాట కాదని వెళితే అక్కడ నీకు శుభం జరుగదు. ఎందుకంటే అప్పటిదాకా ఎంతగానో గౌరవించిన తన వారు అవమానిస్తే వెంటనే మరణమే మేలనే భావన కలిగే దాకా వెళుతుంది. 

                                                            సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Popular Posts