మైత్రేయ ఉవాచ
పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమిఙ్గితకోవిదా
నిత్యం పర్యచరత్ప్రీత్యా భవానీవ భవం ప్రభుమ్
విశ్రమ్భేణాత్మశౌచేన గౌరవేణ దమేన చ
శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోః
విసృజ్య కామం దమ్భం చ ద్వేషం లోభమఘం మదమ్
అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాంసమతోషయత్
స వై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతామ్
దైవాద్గరీయసః పత్యురాశాసానాం మహాశిషః
కాలేన భూయసా క్షామాం కర్శితాం వ్రతచర్యయా
ప్రేమగద్గదయా వాచా పీడితః కృపయాబ్రవీత్
కర్దమ ఉవాచ
తుష్టోऽహమద్య తవ మానవి మానదాయాః
శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా
యో దేహినామయమతీవ సుహృత్స దేహో
నావేక్షితః సముచితః క్షపితుం మదర్థే
ప్రాణులన్నిటికీ ఇష్టమైన దేహమును కూడ కృశింపచేసుకున్నావు
యే మే స్వధర్మనిరతస్య తపఃసమాధి
విద్యాత్మయోగవిజితా భగవత్ప్రసాదాః
తానేవ తే మదనుసేవనయావరుద్ధాన్
దృష్టిం ప్రపశ్య వితరామ్యభయానశోకాన్
అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృమ్భ
విభ్రంశితార్థరచనాః కిమురుక్రమస్య
సిద్ధాసి భుఙ్క్ష్వ విభవాన్నిజధర్మదోహాన్
దివ్యాన్నరైర్దురధిగాన్నృపవిక్రియాభిః
నీవు సిద్ధిని పొందావు. నీవు ఆచరించిన ధర్మము ఆకరము దాల్చగా వచ్చిన భోగాలను అనుభవించు. సామాన్య మానవులు పొందలేని దివ్యమైనవి అయిన భోగాలనూ, ఎంతో మంది చక్రవర్తులు కూడా పొందగోరే భోగాలను అనుభవించు. నీవు ఆచరించిన ధర్మము ప్రసాదించినవి.
ఏవం బ్రువాణమబలాఖిలయోగమాయా
విద్యావిచక్షణమవేక్ష్య గతాధిరాసీత్
సమ్ప్రశ్రయప్రణయవిహ్వలయా గిరేషద్
వ్రీడావలోకవిలసద్ధసితాననాహ
అప్పుడు దేవహూతి మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. ఇంత వరకూ తపస్సులో ఉండి నూరేళ్ళు కాగానే ఇంత బాగా మాట్లాడినందుకు. "నేనా చరించిన తపసుతో వచ్చిన లోకాలు నీకు ఇస్తున్నాను" అని చెప్పడముతో అతనికున్న యోగ సిద్ధిని అర్థము చేసుకుంది. ఆమె దేనిని కోరి ఇంతకాలం భర్త శుశ్రూష చేసిందో అది అర్థం చేసుకున్నాడని తెలుసుకుంది. వినయమూ ప్రేమాతో తడపడిన వాక్కుతో, నును సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ
దేవహూతిరువాచ
రాద్ధం బత ద్విజవృషైతదమోఘయోగ
మాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః
యస్తేऽభ్యధాయి సమయః సకృదఙ్గసఙ్గో
భూయాద్గరీయసి గుణః ప్రసవః సతీనామ్
స్వామీఇ, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటతో, నీ విషయములో ఇది అంతా సిద్ధించినదే అని అర్థమయ్యింది. వివాహం చేసుకునే ముందే చెప్పారు, "సంతానం కలిగించే వరకే నేను ఉంటాను" అని. అంటే మనకు ప్రేమ పూర్వకమైన సంగమం జరగాలి కదా. దాని వలన భర్త కన్నా భార్యకే ఎక్కువ మన్ననా, గౌరవం లభిస్తాయి, సంతాన రూపములో. సంతానమే భర్త కంటే భార్యకు లభించిన అధికయోగం.
తత్రేతికృత్యముపశిక్ష యథోపదేశం
యేనైష మే కర్శితోऽతిరిరంసయాత్మా
సిద్ధ్యేత తే కృతమనోభవధర్షితాయా
దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ
మీ సమాగమం కోసమే, ఈ దేహం యొక్క సుఖాన్ని భోగాని ఆశించే ఇన్ని సేవలూ చేసాను కాబట్టి, కృశించిన నా శరీరానికి మీరనుకున్న భోగాన్ని ప్రసాదించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చేయండి. మన్మధుని చేత పీడించబడుతున్న నాకూ, మీకు, యోగ్యమైన భవనాన్ని ఏర్పాటు చేయండి.
మైత్రేయ ఉవాచ
ప్రియాయాః ప్రియమన్విచ్ఛన్కర్దమో యోగమాస్థితః
విమానం కామగం క్షత్తస్తర్హ్యేవావిరచీకరత్
దేహము కన్నా ధర్మాచరణా, భోగము కన్నా తపస్సిద్ధీ ఎంతో ముఖ్యము.నూరు సంవత్సరాలు పరిశుద్ధితో శరీరన్ని మనసుని నిగ్రహించుకుని ఎదురుగా ఉన్న ప్రియుడైన భర్తను చూస్తూ సేవించింది దేవహూతి. ఉత్తమ సంతానం కలగాలంటే దంపతులు కఠోరమైన నియమాన్ని ఆచరించాలి.
ఆమె యొక్క ప్రీతిని కలిగించాలన్న కోరిక ఉన్నవాడు కాబట్టి, ఆమెకు కావలసినవి కల్పించడానికి కాసేపు యోగ సమాధికి వెళ్ళాడు. విమానాన్ని తన యోగమాయతో ఏర్పరచాడు. తాను ఎటు వెళ్ళాలని అనుకుంటే అటు వెళ్ళే విమానం.
సర్వకామదుఘం దివ్యం సర్వరత్నసమన్వితమ్
సర్వర్ద్ధ్యుపచయోదర్కం మణిస్తమ్భైరుపస్కృతమ్
ఏమి కావాలన్నా ఇచ్చే విమానం, దివ్యమైన ప్రకృతి సంబంధము లేనిది, రత్నాలతో చేయబడి, అన్ని భోగాలు కలిగి ఉన్న, మణులు కలిగిన స్తంభముతో చేయబడి
దివ్యోపకరణోపేతం సర్వకాలసుఖావహమ్
పట్టికాభిః పతాకాభిర్విచిత్రాభిరలఙ్కృతమ్
ఏ కాలములో ఏ స్పర్శ కావాలో ఆ స్పర్శనిచ్చేది. రక రకాల జండాలు పట్టీలు కట్టబడి, చూచే వారికి ఆశ్చర్యం కలిగించేట్లు ఉండి
స్రగ్భిర్విచిత్రమాల్యాభిర్మఞ్జుశిఞ్జత్షడఙ్ఘ్రిభిః
దుకూలక్షౌమకౌశేయైర్నానావస్త్రైర్విరాజితమ్
దండలూ మాలలు హారాలు, మాలలలో ఉన్న పూలను ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చి మెల్లగా ధ్వని చేస్తున్నాయి. నానా రకాల వస్త్రాలతో
ఉపర్యుపరి విన్యస్త నిలయేషు పృథక్పృథక్
క్షిప్తైః కశిపుభిః కాన్తం పర్యఙ్కవ్యజనాసనైః
విమానములో అంతస్థులు ఉన్నాయి, ఒక్కొక్క అంతస్థులో ఒక్కొక్క రకములైన వస్త్రములతో ఆచ్చాదన చేయబడి ఉన్నాయి. ప్రతీ అంతస్తులోనూ అన్ని గదులలోనూ పరుపులు అమర్చబడి ఉన్నాయి. పరుపుల మీద వస్త్రాలు అమర్చబడి ఉన్నాయి. విసన కర్రలు , విసన కర్రలు నిలబడడానికి ఆసనాలు కూడా ఉన్నాయి.
తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితమ్
మహామరకతస్థల్యా జుష్టం విద్రుమవేదిభిః
ప్రతీ భవనములోనూ ప్రతీ గోడ మీదా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మరకతములూ, పగడములూ వజ్రములతో వేదికలు ఏర్పరచబడి ఉన్నాయి, (ఎంతటి భోగాన్ని అనుభవించే శక్తి ఉండి కూడా కేవలం విరత్కి చేత అనుభవించలేదు. అన్నీ వేదాలలో ఉన్నా, కోరిక లేక వారు అలా అనుభవించలేదు.)
ద్వాఃసు విద్రుమదేహల్యా భాతం వజ్రకపాటవత్
శిఖరేష్విన్ద్రనీలేషు హేమకుమ్భైరధిశ్రితమ్
ఆ విమానములో గదులకు వజ్రములతో చేయబడిన తలుపులూ, పగడాల గడపలు ఉన్నాయి. భవనం యొక్క పైభాగాలలో ఇంద్ర నీలమణులతో పొదగబడిన బంగారు కలశాలు.
చక్షుష్మత్పద్మరాగాగ్ర్యైర్వజ్రభిత్తిషు నిర్మితైః
జుష్టం విచిత్రవైతానైర్మహార్హైర్హేమతోరణైః
ఆయా గోడలలో రకరకాల పక్షులు చిత్రించి, అవి పక్షులని గుర్తించడానికి నేత్రముల స్థానములలో పద్మరాగ మణులు అమర్చారు. పైన చాందినీ లాగ వైతానములు అమర్చారు
హంసపారావతవ్రాతైస్తత్ర తత్ర నికూజితమ్
కృత్రిమాన్మన్యమానైః స్వానధిరుహ్యాధిరుహ్య చ
విమానములో పావురాలు హంసలు చిలకలు కోకిలలూ ధ్వని చేస్తున్నాయి. ఇన్ని బొమ్మలను చూసిన వారు తమని చూచి బొమ్మలని అనుకుంటారని ఆ పక్షులు ధ్వని చేస్తున్నాయి
విహారస్థానవిశ్రామ సంవేశప్రాఙ్గణాజిరైః
యథోపజోషం రచితైర్విస్మాపనమివాత్మనః
భవనం యొక్క ముందు లోపలి భాగములూ, ప్రాకారం యొక్క వెలుపల లోపల భాగాలు, విహరించడానికి యోగ్యమైన అన్ని విశ్రాంతి ఆవాసాలు ఏర్పరచి ఉన్నాయి. చూచే వారు విస్మయానికి గురయ్యేట్లు ఉన్నాయి
ఈదృగ్గృహం తత్పశ్యన్తీం నాతిప్రీతేన చేతసా
సర్వభూతాశయాభిజ్ఞః ప్రావోచత్కర్దమః స్వయమ్
ఇంత పెద్ద విమానాన్ని సృష్టిస్తే దాన్ని చూచిన దేవహూతి పెద్దగా సంతోషించలేదు.
నిమజ్జ్యాస్మిన్హ్రదే భీరు విమానమిదమారుహ
ఇదం శుక్లకృతం తీర్థమాశిషాం యాపకం నృణామ్
శుబ్రముగా మంగళ స్నానం చేసి విమానాన్ని అధిరోహించు అని దేవహూతికి చెప్పాడు. ఆ సరస్సు పరమాత్మ కన్నీటితో ఏర్పడిన జలముతో ఉన్న సరస్సు. (పరమాత్మకు శుక్ల అని పేరు. నిత్య శుద్ధుడు అని అర్థం). మానవుల అన్ని కోరికలూ తీర్చేది (ఆమాశిషాం యాపకం నృణామ్). అంటే అనురత్కి ఉన్న వారికి విరక్తి కలిగిస్తుంది, విరక్తి ఉన్న వారికి అనురక్తి కలిగిస్తుంది. అందుకే దీనికి కోరికలు తీర్చేదీ, కోరికలు తొలగించేదీ అని అర్థం.
సా తద్భర్తుః సమాదాయ వచః కువలయేక్షణా
సరజం బిభ్రతీ వాసో వేణీభూతాంశ్చ మూర్ధజాన్
నల్లని కన్నులు గల దేవహూతి, దుమ్ము పట్టిన వస్త్రం కట్టుకొని ఉంది, జటలు కట్టిన జడ, దుమ్ము పట్టిన శరీరమూ
అఙ్గం చ మలపఙ్కేన సఞ్ఛన్నం శబలస్తనమ్
ఆవివేశ సరస్వత్యాః సరః శివజలాశయమ్
అలా పరమ మంగళ నీరు ఉన్న నదిలో ప్రవేశించింది. అలా మునగగానే,
సాన్తః సరసి వేశ్మస్థాః శతాని దశ కన్యకాః
సర్వాః కిశోరవయసో దదర్శోత్పలగన్ధయః
వేయి మంది చిన్న పిల్లలైన అప్సరసలు వచ్చారు.
తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచుః ప్రాఞ్జలయః స్త్రియః
వయం కర్మకరీస్తుభ్యం శాధి నః కరవామ కిమ్
చేతులు జోడించి "అమ్మా మేము మీకు సేవకురాళ్ళము. ఏమి చేయాలో చెప్పు " అని చెప్పి ఆమెకు స్నానము చేయించి,
స్నానేన తాం మహార్హేణ స్నాపయిత్వా మనస్వినీమ్
దుకూలే నిర్మలే నూత్నే దదురస్యై చ మానదాః
మురికి లేనీ దుమ్ము లేని కొత్త వస్త్రాలు ఇచ్చారు
భూషణాని పరార్ధ్యాని వరీయాంసి ద్యుమన్తి చ
అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవమ్
గొప్ప విలువ గల కాంతి మంతమైన ఆభరణాలను అమృతం లాంటి పానమునూ అన్నమునూ ఇచ్చీ
అథాదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజామ్బరమ్
విరజం కృతస్వస్త్యయనం కన్యాభిర్బహుమానితమ్
స్నాతం కృతశిరఃస్నానం సర్వాభరణభూషితమ్
నిష్కగ్రీవం వలయినం కూజత్కాఞ్చననూపురమ్
ఇంత అలంకరించి అద్దం ఇచ్చారు, ఆ అద్దములో ఆమె "పూల మాలలతో అలంకరించబడి, దుమ్ము లేని వస్త్రాలతో అలంకరించబడి, పుణ్యాహవాచనం చేయబడి హారాలతో బంగారు నూపురాలతో "
శ్రోణ్యోరధ్యస్తయా కాఞ్చ్యా కాఞ్చన్యా బహురత్నయా
హారేణ చ మహార్హేణ రుచకేన చ భూషితమ్
కొన్ని వందల వేల రత్నాలు పొదిగిన మొలత్రాడు,
సుదతా సుభ్రువా శ్లక్ష్ణ స్నిగ్ధాపాఙ్గేన చక్షుషా
పద్మకోశస్పృధా నీలైరలకైశ్చ లసన్ముఖమ్
దంతములు ధావనం చేయబడి, చక్కని కనుబొమ్మలు కలిగి, ప్రేమ నిండిన చూపు కలిగి, నల్లని విడదీయబడిన చక్కని ముంగురులతో సౌందర్యముగా
యదా సస్మార ఋషభమృషీణాం దయితం పతిమ్
తత్ర చాస్తే సహ స్త్రీభిర్యత్రాస్తే స ప్రజాపతిః
ఇలా తన అలంకారాన్ని తాను చూచుకుంది. చూచి భర్తను స్మరించింది. అలా తలచిన క్షణములో భర్త వేయిమంది పరిచారికలతో పక్కన నిలిచాడు
భర్తుః పురస్తాదాత్మానం స్త్రీసహస్రవృతం తదా
నిశామ్య తద్యోగగతిం సంశయం ప్రత్యపద్యత
స తాం కృతమలస్నానాం విభ్రాజన్తీమపూర్వవత్
ఆత్మనో బిభ్రతీం రూపం సంవీతరుచిరస్తనీమ్
భర్త తపో శక్తిని చూచి ఆశ్చర్యమునకు లోనయ్యింది. ఇంత తపశ్శక్తి ఉండి ఇంతవరకూ ఈయనకి కోరిక కలగలేదు. ఇపుడు కలిగిన ఎంత కాలం నిలుస్తుందో అని సంశయించింది
విద్యాధరీసహస్రేణ సేవ్యమానాం సువాససమ్
జాతభావో విమానం తదారోహయదమిత్రహన్
వేయిమంది విద్యాధర స్త్రీలు ఆమెను పరిచర్య చేస్తున్నారు. ఆమె యందు అనురాగం కలిగి ఆ విమానాన్ని అధిరోహింపచేసాడు
తస్మిన్నలుప్తమహిమా ప్రియయానురక్తో
విద్యాధరీభిరుపచీర్ణవపుర్విమానే
బభ్రాజ ఉత్కచకుముద్గణవానపీచ్యస్
తారాభిరావృత ఇవోడుపతిర్నభఃస్థః
విమానములో ఎంతో మంది పరిచారికలు ఉన్నారు. సిద్ధ సాద్య గరుడ గంధర్వ కిన్నెరలతో కలిసి, చుక్కలతో కూడి ఉన్న చంద్రునిలాగ ఉన్నాడు. ఆకాశం విమానం. తారకలు సేవికలు, రోహిణి దేవహూతి.
తేనాష్టలోకపవిహారకులాచలేన్ద్ర
ద్రోణీష్వనఙ్గసఖమారుతసౌభగాసు
సిద్ధైర్నుతో ద్యుధునిపాతశివస్వనాసు
రేమే చిరం ధనదవల్లలనావరూథీ
అష్ట్దిక్పాలకుల అన్ని లోకాలలో విహరించాడు. ఎనిమిది లోకపాలకుల లోకములూ, సప్త కుల పర్వతాల ద్రోణులలో (ఒక్కొక్క పర్వతములో ఒక్కో దివ్య లోకాముంటుంది. మేరు పర్వతం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు). సుగంధ ప్రాంతాలలో గాలితో వచ్చే సుగంధము, మన్మధుని మిత్రుడైన మలయమారుతుని చేత సుగంధము చేయబడిన అష్టదిక్పాలకుల సప్త కుల పర్వతాలలో విహరించాడు.అక్కడ సిద్ధులు స్తోత్రం చేస్తున్నారు. ద్యుధుని - ద్యు+ ధుని - ఆకాం + నది శమ్నాకాశ గంగ జలపాతాల నుండి వచ్చే సుగంధాలు గల. ఈ భోగమంతా యోగముతో సంపాదించినది. ఇలాంటి భోగం ఉత్తమ పుత్రున్నే ప్రసాదిస్తుంది. గీత్లో ఉన్నట్లుగా "ధర్మానికి విరుద్ధమైన కామము" పరమాత్మ స్వరూపమే.
కుబేరునిలాగ వైరాగ్యముతో అనుభవించాడు. కుబేరుడు ధనాధిపతి అయినా ఆ ధనమును అనుభవించడు. అంటే కర్దముడు కూడా పరమాత్మ సేవ కొరకే అనుభవించాడు. ప్రియురాలనే సైన్యముగల కర్దముడు కుబేరునిలా అనుభవించాడు
వైశ్రమ్భకే సురసనే నన్దనే పుష్పభద్రకే
మానసే చైత్రరథ్యే చ స రేమే రామయా రతః
ఇవన్నీ అష్ట దిక్పాలకుల తోటలు
భ్రాజిష్ణునా విమానేన కామగేన మహీయసా
వైమానికానత్యశేత చరల్లోకాన్యథానిలః
కోరిన చోటుకు వెళ్ళే విమానముతో అన్ని లోకాలనూ వాయువు సంచరిస్తున్నట్లు సంచరించాడు. ఆయా లోకాలలో సంచరించే విమానాలను దాటి వెళ్ళాడు.
కిం దురాపాదనం తేషాం పుంసాముద్దామచేతసామ్
యైరాశ్రితస్తీర్థపదశ్చరణో వ్యసనాత్యయః
ఇంత మహానుభావుడెలా అయ్యాడు? ఉజ్జ్వలమైన పరిశుద్ధమైన చిత్తము కలవారు, గంగకు నెలవైన పాదములను ఆశ్రయించ వారు, అలాంటి మహానుభావులు పొందలేనిది పొందరానిది ఏమైనా ఉందా? ఆ పరమాత్మ పాదములు అన్ని కష్టములూ తొలగించేవి.
ప్రేక్షయిత్వా భువో గోలం పత్న్యై యావాన్స్వసంస్థయా
బహ్వాశ్చర్యం మహాయోగీ స్వాశ్రమాయ న్యవర్తత
తన దివ్య యోగ బలముతో తన ప్రియురాలికి మొత్తం భూగోలాన్ని చూపించి మరలా ఆశ్రమానికి వచ్చాడు. బహు ఆశ్చర్యాలు కలిగించే భూగోలాన్ని చూపించి, ఆ మహాయోగి (వాటి యందు మనసు లగ్నం కాని వాడు) ,
విభజ్య నవధాత్మానం మానవీం సురతోత్సుకామ్
రామాం నిరమయన్రేమే వర్షపూగాన్ముహూర్తవత్
ఈ విమానములో నూరేళ్ళు విహరించాడు. తొమ్మిది మంది అమ్మాయిలను కన్నాడు. ఒక వంద సంవత్సరములు ఆ ప్రియురాలని ఆనందింపచేస్తు తనను తాను తొమ్మిదిగా విభజించుకున్నాడు. వంద సంవత్సరాలూ ఒక ముహూర్తములా గడిపాడు.
తస్మిన్విమాన ఉత్కృష్టాం శయ్యాం రతికరీం శ్రితా
న చాబుధ్యత తం కాలం పత్యాపీచ్యేన సఙ్గతా
రతికి అనుకూలించే శయ్యను ఏర్పరిచి విహరించారు. సుందరుడైన భర్తతో ఉన్న దేవహూతి, ఎంత కాలం గడిచిందో తెలియలేకపోయింది
ఏవం యోగానుభావేన దమ్పత్యో రమమాణయోః
శతం వ్యతీయుః శరదః కామలాలసయోర్మనాక్
యోగబలంతో ఏర్పరచిన సుఖాలలో రమిస్తూ ఉండగా నూరు సంవత్సరాలు గడిచాయి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సులో ఉన్నవాడు ప్రియురాలి కోరిక తీర్చడానికి కామాసక్తుడిలా కనిపించాడు
తస్యామాధత్త రేతస్తాం భావయన్నాత్మనాత్మవిత్
నోధా విధాయ రూపం స్వం సర్వసఙ్కల్పవిద్విభుః
పరమాత్మ సంకల్పాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి తనను తాను తొమ్మిదిగా విభజించి ఆమె యందు తొమ్మిది మంది సంతానం కలిగేట్టుగా చేసాడు
అతః సా సుషువే సద్యో దేవహూతిః స్త్రియః ప్రజాః
సర్వాస్తాశ్చారుసర్వాఙ్గ్యో లోహితోత్పలగన్ధయః
దేవహూతి తొమ్మిది మంది స్త్రీలను ప్రసవించింది. వారు సౌందర్యవంతులు, జ్ఞ్యానము కలవారు. శరీరమంతా సుగంధం కలవారు
పతిం సా ప్రవ్రజిష్యన్తం తదాలక్ష్యోశతీ బహిః
స్మయమానా విక్లవేన హృదయేన విదూయతా
ఇలా తొమ్మిది మంది సంతానం కలిగిన నాడు కర్దముడు "ఇక నేను వెళ్ళబోతున్నాను" అన్న భర్తను చూచి హృదయములో వేదన కలిగింది, విస్మయాన్ని కూడా పొందింది (ఇంత భోగం అనుభవించి ఒక్కసారి విడిచి వెళ్ళిపోతాడా అని ఆశ్చర్యం. భార్యను ఆనందింపచేయడం భర్తృ ధర్మం. ఆమె కోరికను తీర్చడం తన ధర్మం కాబట్టి ఆమె "ఇంక చాలు"అని అనేంత భోగాన్ని కల్పించి భోగాలలో తేలి ఆడాడు. అలాంటి స్వామి వెళ్ళిపోవాలనుకుంటే ఆశ్చర్యపడింది)
లిఖన్త్యధోముఖీ భూమిం పదా నఖమణిశ్రియా
ఉవాచ లలితాం వాచం నిరుధ్యాశ్రుకలాం శనైః
తన కాలి గోటితో భూమిని రాస్తూ వస్తున్న కన్నీటిని బలవంతముగా ఆపుకుంటూ మెల్లిగా మాట్లాడింది
దేవహూతిరువాచ
సర్వం తద్భగవాన్మహ్యముపోవాహ ప్రతిశ్రుతమ్
అథాపి మే ప్రపన్నాయా అభయం దాతుమర్హసి
స్వామీ మీరు వివాహానికి ముందు ఏమి ప్రతిజ్ఞ్య చేసారో అదంతా నెరవేర్చారు. అయినా నిన్నే ఆశ్రయించి ఉన్న నాకు అభయాన్ని ప్రసాదించండి
బ్రహ్మన్దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః
కశ్చిత్స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనమ్
భర్తృ ధర్మం పూర్తి చేసారు గానీ పితృ ధర్మం పూర్తి చేయలేదు. వారికి తగిన పతులను కూర్చవలసిన బాధ్యత మీదే కదా. అందరూ అమ్మాయిలే కలిగారు, పెళ్ళి చేసుకుని అందరూ వెళ్ళిపోయే వారే. మీరు కూడా వెళ్ళిపోయే వారే. మరి నాతో ఎవరు ఉంటారు? నాకు ఒక కొడుకు కలిగితే బాగుంటుంది
ఏతావతాలం కాలేన వ్యతిక్రాన్తేన మే ప్రభో
ఇన్ద్రియార్థప్రసఙ్గేన పరిత్యక్తపరాత్మనః
ఇంతవరకూ మీ సాహచర్యములో పరమార్ధాన్ని జ్ఞ్యానమునూ పరమాత్మ తత్వమునూ విడిచిపెట్టాను. అది చాలు. నాకు ఇహం సరిపోయింది. ఇంతవరకూ పరార్ధాన్ని విడిచిపెట్టాను. పారమార్ధికమైన జ్ఞ్యానాన్ని కూడా మీరే ప్రసాదించవలసినది. భార్యను జ్ఞ్యాన మార్గములో తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత కూడా భర్తదే.
ఇన్ద్రియార్థేషు సజ్జన్త్యా ప్రసఙ్గస్త్వయి మే కృతః
అజానన్త్యా పరం భావం తథాప్యస్త్వభయాయ మే
కేవలం ఇంద్రియ చాపల్యముతోనే విహరించాము. పరమార్ధాన్ని పూర్తిగా మరచిపోయాము. మిమ్ములను నా భర్తగానే చూసాను తప్ప, ఒక ప్రజాపతిగా ఒక మహర్షిగా ఒక తత్వవేత్తగా ఒక జ్ఞ్యాన ప్రదునిగా చూడలేదు. ఆ పొరబాటుని మన్నించి నాకు అభయం ఇవ్వాలి. (మనకు భయం లేకుండా ఉండాలంటే పరతత్వాన్ని ధ్యానం చేయాలి. సంసారములో ఉన్నంత వరకూ భయమే ఉంటుంది)
సఙ్గో యః సంసృతేర్హేతురసత్సు విహితోऽధియా
స ఏవ సాధుషు కృతో నిఃసఙ్గత్వాయ కల్పతే
ధర్మ శాస్త్రం "బుద్ధి జ్ఞ్యానమూ లేని వారు దుర్జనులతో సావాసం చేస్తారు." అంటుంది. అలాంటి సావాసం సంసారానికి కారణమవుతుంది. అదే సంగం సజ్జనులతో చెస్తే మోక్షం వస్తుంది. సజ్జనులతో సావాసం ఏ విధముగా చేసినా మోక్షమే. కృష్ణుడు చెప్పినట్లు "నా యందు మనసు ఎలా వుంచినా ఆ కోరిక కోరికను పెంచేదిగా ఉండదు. బాగా వేయించిన ధాన్యాన్ని భూమిలో వేసినా మొలవదు. " పరమాత్మ మీద కోరిక బాగా వేపబడినది. అది మళ్ళీ మొలకెత్తదు
మీతో నా సావాసం జ్ఞ్యానాన్నే ప్రసాదిస్తుంది
నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే
న తీర్థపదసేవాయై జీవన్నపి మృతో హి సః
పని అంటే ఏమిటి, కర్మ అని దేన్ని అంటారు. ఏ పని ధర్మాన్ని గానీ వైరాగ్యాన్ని గానీ, ఉత్తముల పాదసేవకు ఉపయోగించకుండా ఉండదో అలాంటి వాడు బ్రతికి ఉన్నా మరణించినవాడే. ఏ పని చేసినా ధర్మం కలగాలి విరక్తి కలగాలి, మనమాచరించే కర్మ వలన మహాత్ములు మన ఇంటికి రావాలి. కర్మకు మూడు ఫలితాలు 1. ధర్మము 2. విరక్తి 3. మహాత్ముల పాద సేవ.
సాహం భగవతో నూనం వఞ్చితా మాయయా దృఢమ్
యత్త్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బన్ధనాత్
కాబట్టి ఏదో సంసారమని సౌందర్యమనీ విహారమనీ సంతానమనే మాటలతో నామనసుతోనే మోసగించబడ్డాను. మీవంటి వారి సాంగత్యం పొంది కూడా జ్ఞ్యానముని గూర్చి అడగనీయకుండా చేసింది మీ మాయ. నేను వంచించబడ్డాను. మోక్షమునిచ్చే మీలాంటి మహానుభావుని భర్తగా పొంది కూడా మోక్షము పొందబోతే వ్యర్ధము.