Followers

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహారవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః
తుష్టువుస్తుష్టమనసస్తద్వాగమృతసేవయా

ముని చేత ప్రేరేపించబడిన గాయకులు రాజు మాట్లాడిన మాటలతో సంతోషించారు. 

నాలం వయం తే మహిమానువర్ణనే యో దేవవర్యోऽవతతార మాయయా
వేనాఙ్గజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముర్ధియః

మాయతో ఈ రూపముగా అవతరించావు. నీ మహిమ వర్ణించుటకు మేము సరిపోము. వేనుని వలన పుట్టిన నీ పురుష కార్యములు వర్ణించాలంటే వాక్పతుల బుద్ధులు కూడా భ్రమిస్తాయి 

అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కలావతారస్య కథామృతాదృతాః
యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి

అలా అని నీ స్తోత్రం చేయకుండా ఉండలేము. అమృతం మొత్తం ప్రవహిస్తోంది అమృతం మొత్తం తాగలేమని చూస్తూ ఊరుకుంటామా. ఎంతో కొంతైనా నోట్లో వేసుకుందామని చూస్తాము. అలాగే నీ గుణాలు మొత్తం చెప్పాలన్న నియమం లేదు. నీవు ఔదార్యము కలిగిన చరిత్ర కల వాడివి
మాకు మా మునులు చెప్పినట్లుగా నీ ఉత్తమ కర్మలను మేము వివరిస్తాము.నీవు ముందు ఏమి చేయబోతున్నావో చెబుతాము. నీవు పరమాత్మ అని తెలుసు కాబట్టి నీవు చేసే పనులు పెద్దల వలన విని ఉన్నాము కాబట్టి వాటినే కీర్తన చేస్తాము

ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేऽనువర్తయన్
గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపన్థినామ్

ధర్మము ఆచరించే వారిలో ఉత్తముడు ఈ మహానుభావుడు. లోకాన్ని ధర్మములో అనువర్తింపచేస్తాడు. ఎవరు ధర్మాన్ని తప్పకుండా కాపాడతాడు. ధర్మాన్ని అతిక్రమించే వారిని శాసిస్తాడు

ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః
కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితమ్

అటు రాజుగా ఉన్న వాడే సకల లోకపాలకుల అంశలను తనలో నిలుపుకుంటాడు. ఇహ పర లోకముల హితమును (ఏ ఏ కాలములో ఏ ఏ లోకాలకి ఎలాంటి హితమును కావాలో దానిని) కూరుస్తాడు. లోకపాలురకు కూడా శక్తినీ సామర్ధ్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇహ పర లోకముల ధర్మాన్ని కాపాడతాడు. 

వసు కాల ఉపాదత్తే కాలే చాయం విముఞ్చతి
సమః సర్వేషు భూతేషు ప్రతపన్సూర్యవద్విభుః

సమయమొచ్చినప్పుడు పన్ను రూపములో ద్రవ్యాన్ని తీసుకోవడం. ఈతి బాధలతో బాధపడుతున్నప్పుడు ఇవ్వడం, వరద వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతములో ప్రజలను క్షేమముగా ఉంచి, వారికి ఆహారం అందించి, వరద తగ్గాక దింపి, కొన్ని రోజులు పోషించి, నష్టపరిహారం ఇవ్వాలి. సుర్ర్య కిరణాలకు వలె అందరి యందూ సమత్వాన్ని ప్రకటించాలి

తితిక్షత్యక్రమం వైన్య ఉపర్యాక్రమతామపి
భూతానాం కరుణః శశ్వదార్తానాం క్షితివృత్తిమాన్

ఆక్రమించే వారి స్వభావన్ని కొంతకాలం క్షమించాలి. భూతముల మీద కరుణ చూపుతాడు. రోగ గ్రస్తులూ ఆర్తులు ఉండటానికి భూమి ఇస్తాడు

దేవేऽవర్షత్యసౌ దేవో నరదేవవపుర్హరిః
కృచ్ఛ్రప్రాణాః ప్రజా హ్యేష రక్షిష్యత్యఞ్జసేన్ద్రవత్

ఈయన బలపరాక్రములను పరీక్షించడానికి వరుణ ఇంద్రాదులు వర్షించడం మానేస్తే పృధువు తన శక్తితో వర్షాన్ని కురిపిస్తాడు. తన దివ్య ముఖ శోభతో లోకాన్ని ఆనందింపచేస్తాడు. 

ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా
సానురాగావలోకేన విశదస్మితచారుణా

స్వచ్చమైన నవ్వుతో ప్రకాశించే ముఖమండలములో ప్రేమను చూపడముతో 

అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో గమ్భీరవేధా ఉపగుప్తవిత్తః
అనన్తమాహాత్మ్యగుణైకధామా పృథుః ప్రచేతా ఇవ సంవృతాత్మా

ఈయన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ప్రజలకు అవి ఫలితమిచ్చినప్పుడు అర్థమవుతుంది (చేసే ముందు చాటింపు ఉండదు). ఏమి చేస్తున్నాడో అది అతి రహస్యముగా ఉంచుతాడు. గంభీరమైన బుద్ధి కలవాడు. తానేరీతిలో ప్రవర్తిస్తాడో కూడా రహస్యముగా ఉంచుతాడు. ఇతను అనేకమైన గొప్ప గుణాలకు ఒకే నివాసమైన వాడు. వరుణుడి లాగ తన స్వరూపాన్ని తాను దాచుకొని ఉంటాడు

దురాసదో దుర్విషహ ఆసన్నోऽపి విదూరవత్
నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితోऽనలః

అందరికీ దగ్గరలో ఉంటాడు. ఇతన్ని ఎవరూ చేరలేరూ, సహించలేరు. దగ్గరలో ఉన్నా దూరముగా ఉన్నవాడిలా ప్రవర్తిస్తాడు. వేనుడనే అరణిలో పుట్టిన అగ్నిహోత్రము ఇతడు. 

అన్తర్బహిశ్చ భూతానాం పశ్యన్కర్మాణి చారణైః
ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినామ్

ఇతను పరమాత్మ కాబట్టి అన్ని చోట్లా ఉంటాడు. అయినా ఉదాసీనుడిలా ఉంటాడు. ఈయన అధ్యక్షుడు. గూఢచారులను నియమిచి రాజ్యములో విషయాలను కనుక్కుంటూ ఉంటాడు. శరీర ధారులకు వాయువు ఎలా ఐతే లోపలా బయటా ఉంటుందో ఈయన కూడా అలాగే ఉంటాడు. 

నాదణ్డ్యం దణ్డయత్యేష సుతమాత్మద్విషామపి
దణ్డయత్యాత్మజమపి దణ్డ్యం ధర్మపథే స్థితః

తనను ద్వేషించేవాడైనా సరే దండించడానికి కావలసిన తప్పు చేయనప్పుడు వాడిని దండించడు

అస్యాప్రతిహతం చక్రం పృథోరామానసాచలాత్
వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణైః

మానస సరోవరమునుంచీ సూర్యభగవానుడు తన కిరణములను ఎంతవర్కూ ప్రసరింపచేస్తున్నాడో ఆ ప్రాంతమంతా ఈయన రాజ్యమే 

రఞ్జయిష్యతి యల్లోకమయమాత్మవిచేష్టితైః
అథాముమాహూ రాజానం మనోరఞ్జనకైః ప్రజాః

ఈ లోకాన్ని రంజింపచేస్తాడు. ప్రజలు ఇతన్ని స్తోత్రం చేస్తారు

దృఢవ్రతః సత్యసన్ధో బ్రహ్మణ్యో వృద్ధసేవకః
శరణ్యః సర్వభూతానాం మానదో దీనవత్సలః

ఈయన దృఢవ్రతుడు (చెప్పిన పని చేసేవాడు), అసత్యమనేది పలకని వాడు. బ్రాహ్మణుల భక్తుడు వృద్ధ సేవకుడు. అన్ని ప్రాణులకూ అభయమిచ్చిన మహనుభావుడు. అందరి గౌరవాన్నీ కాపాడే వాడు (మానద) 

మాతృభక్తిః పరస్త్రీషు పత్న్యామర్ధ ఇవాత్మనః
ప్రజాసు పితృవత్స్నిగ్ధః కిఙ్కరో బ్రహ్మవాదినామ్

పరస్త్రీలను తల్లిలాగ, తన భార్యను తనలో సగముగా, ప్రజలకు తండ్రిలాగా, బ్రాహ్మణోత్తములకు దాసునిలాగ, 

దేహినామాత్మవత్ప్రేష్ఠః సుహృదాం నన్దివర్ధనః
ముక్తసఙ్గప్రసఙ్గోऽయం దణ్డపాణిరసాధుషు

మామూలు మానవులకు ఆత్మ అంటే ఎంత ఇష్టమో ఈ రాజంటే అంతే ఇష్టమూ, మిత్రులలో ఆనందము పెంచేవాడు. సంసారములో బద్ధులైన వారి విషయాలు గానీ సంసారములో విషయాలు కానీ పూర్తిగా విడిచీపెట్టినవాడు. అసాధువులను దండించేవాడు

అయం తు సాక్షాద్భగవాంస్త్ర్యధీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః
యస్మిన్నవిద్యారచితం నిరర్థకం పశ్యన్తి నానాత్వమపి ప్రతీతమ్

ఈయనే మూడులోకాలకు అధిపతి. రక్షకుడు. ఈయన పరమాత్మ. కూటస్థుడు (కదలిక లేనివాడు). పరమాత్మ కల (అంశ)తో అవతరించాడు. చాలా మంది అజ్ఞ్యాన ప్రభావముతో ఈ ప్రపంచమంతా నానాత్వం వహించి ఉంటారు. 

అయం భువో మణ్డలమోదయాద్రేర్గోప్తైకవీరో నరదేవనాథః
ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః

కానీ ఈయన ఉదయ పర్వతం నుండి అస్థా చలం వరకూ ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తాడు. ఈయన రథం పేరు జైత్రం. ఆ రథానికి జయించడం మాత్రమే తెలుసు. ధనువును ధరించి భూమండలమంతా తిరుగుతాడు సూర్యభగవానునిలాగ. 

అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యన్తి సలోకపాలాః
మంస్యన్త ఏషాం స్త్రియ ఆదిరాజం చక్రాయుధం తద్యశ ఉద్ధరన్త్యః

ఈయన కోసం ఆయా రాజులు (సామంతులు), లోకపాలకులూ ఎదురుగా వచ్చి కానుకలు ఇచ్చి ఆరాధిస్తారు. మహారాణులు కూడా ఈయనని ఆదిరాజుగా స్తోత్రం చేస్తారు. 

అయం మహీం గాం దుదుహేऽధిరాజః ప్రజాపతిర్వృత్తికరః ప్రజానామ్
యో లీలయాద్రీన్స్వశరాసకోట్యా భిన్దన్సమాం గామకరోద్యథేన్ద్రః

భూమి గోరూపముగా ఉన్నప్పుడు ఆమెయందు అన్ని ఔషధులనూ పాలలా పితుకుతాడు. ప్రజలకు వృత్తి కలిగిస్తాడు. తన ధనువు యొక్క కొనతో భూమిని సమానము చేస్తాడు (ఎలా ఐతే ఇంద్రుడు పర్వతాలను వజ్రాయుధముతో నరికాడో)

విస్ఫూర్జయన్నాజగవం ధనుః స్వయం యదాచరత్క్ష్మామవిషహ్యమాజౌ
తదా నిలిల్యుర్దిశి దిశ్యసన్తో లాఙ్గూలముద్యమ్య యథా మృగేన్ద్రః

ధనువు ఎక్కుపెట్టి ఈయన బయలుదేరితే సింహాన్ని చూచి ఎలా మిగతా మృగాలు దాక్కుంటాయో అలా మిగిలిన రాజులు దాక్కుంటారు 

ఏషోऽశ్వమేధాఞ్శతమాజహార సరస్వతీ ప్రాదురభావి యత్ర
అహార్షీద్యస్య హయం పురన్దరః శతక్రతుశ్చరమే వర్తమానే

ఈయన నూరు అశ్వమేధ యాగాలు చేస్తాడు. ఈయన దగ్గరే సరస్వతి కూడా ఆవిర్భవించింది. నూరవ అశ్వమేధం వచ్చేసరికి ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తాడు

ఏష స్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవన్తమేకమ్
ఆరాధ్య భక్త్యాలభతామలం తజ్జ్ఞానం యతో బ్రహ్మ పరం విదన్తి

తన రాజ్యములో సభామంటపములోకి వేంచేసిన సనత్కుమారున్ని భక్తితో ఆరాధించి పరమాత్మ స్వరూపాన్ని చెప్పే ఉత్తమ జ్ఞ్యానన్ని పొందుతాడు. 

తత్ర తత్ర గిరస్తాస్తా ఇతి విశ్రుతవిక్రమః
శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః పృథుః పృథుపరాక్రమః

ఈయన తన యొక్క, తన పనుల యొక్కా, కీర్తిని గానము చేసే వాక్యములను ఆయా ప్రాంతములలో వింటూ ఉంటాడు. 

దిశో విజిత్యాప్రతిరుద్ధచక్రః స్వతేజసోత్పాటితలోకశల్యః
సురాసురేన్ద్రైరుపగీయమాన మహానుభావో భవితా పతిర్భువః

తన రథమునకు అడ్డు లేకుండా అన్ని ప్రాంతములనూ గెలిచి తన దివ్యమైన తేజస్సుతో లోకుల బాధలు తొలగించీ, దేవదానవులందరిచేత గానము చేయబడతాడు. భూపతి అవుతాడు, మహానుభావుడు అవుతాడు. అందరినీ కాపాడుతాడు 

Popular Posts