ఇది పరమాత్మావతారాధ్యాయం.
బ్రహ్మోవాచ
యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్
క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనన్తః
అన్తర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం
తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదార
బ్రహ్మ తనను తాను రెండుగా చేసుకున్నాడు సృష్టి చేయడానికి (మనువు శతరూప). సృష్టించినవారికి ఆధారం ఏది అని బ్రహ్మగారిని ప్రశించాడు మనువు. అప్పుడు బ్రహ్మగారికి వచ్చిన తుమ్ములోంచి బయట్పడిన అవతారం వరాహ అవతారం. నీళ్ళలోకి వెళ్తూ దులిపిన శరీరం నుంచి బయటపడినవి దర్భలు. రెండు కోరలనీ సంఘర్షణ చేస్తే అగ్ని పుట్టింది. దంతములతో భూమిని కొంచెం పైకి అనగా మట్టి పైకి వచ్చింది. ఆ మట్టిని యజ్ఞ్య కుండంగా చేసి ఈ అగ్ని అందులో వేసి దర్భలను అందులో వేసి, పరమాత్మ యొక్క వాలము యొక్క చాలనం వలన కలిగిన నేతిని పరమాత్మ యొక్క నాసికా రంధ్రాలతో వేశారు. ఇలా నీటిలో దాగి ఉన్న భూమిని పైకి తెచ్చి ఆధారం కల్పించిన రోజు కాబట్టి అది వరాహం (వర+అహం - మంచి రోజు)
భూమిని ఉద్దరించడానికి సకల యజ్ఞ్యమయీ అయిన వరాహ (క్రౌడీం ) శరీరాన్ని ధరించాడు. ఇంద్రుడు తన వజ్రంతో పర్వతాన్ని చేధించినట్లుగా హిరణ్యాక్షున్ని వధించాడు, (హిరణ్యాక్షుడు మొదట హిమవంతున్ని అడిగాడు యుద్ధం చేయమని, ఆయన సముద్రుడి వద్దకు పమపాడు, ఆయన వరుణుడి వద్దకు, ఆయన విష్ణువు వద్దకూ పంపారు. నారదుడు చెప్పగా భూమిని వెదుకుతున్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు ).
జాతో రుచేరజనయత్సుయమాన్సుయజ్ఞ
ఆకూతిసూనురమరానథ దక్షిణాయామ్
లోకత్రయస్య మహతీమహరద్యదార్తిం
స్వాయమ్భువేన మనునా హరిరిత్యనూక్తః
ఆకూతికి రుచికి (ప్రజాపతి) పుట్టిన అవతారం యజ్ఞ్యపురుషుడు. దక్షిణ భార్య, మూడులోకాలు పడుతున్న బాధలను యజ్ఞ్యముతో తొలగించాడు. పరమాత్మ ఆరాధనే యజ్ఞ్యం, అందువల్ల పంట పడుతుంది. దాని వల్ల ద్రవ్యం వస్తుంది. దానితో మళ్ళీ యజ్ఞ్యం చేస్తారు. స్వాయంభువ మనువు ఈయనని హరిగా ఆరాధించాడు
జజ్ఞే చ కర్దమగృహే ద్విజ దేవహూత్యాం
స్త్రీభిః సమం నవభిరాత్మగతిం స్వమాత్రే
ఊచే యయాత్మశమలం గుణసఙ్గపఙ్కమ్
అస్మిన్విధూయ కపిలస్య గతిం ప్రపేదే
కర్దమ దేవహూతులకు తొమ్మిది మంది సహోదరిణుల తరువాత ( ఈ తొమ్మిది మందే నవ ప్రజాపతులకు భార్యలు) కపిలుడు పుట్టాడు. తల్లి దేవహూతికి సాంఖ్య శాస్త్రాన్ని భక్తి తత్వాన్ని యోగ శాస్త్రాన్ని భౌతిక తత్వాన్ని (గర్భస్థ శిశువు పొందే దశలు). ఆత్మస్వరూపాన్ని తన తల్లికి బోధించాడు. దాని వలన ఆవిడ గుణ సంబంధం వలన తనకంటిన మలమును తొలగించి పరమాత్మ సన్నిధికే చేరుకుంది.
అత్రేరపత్యమభికాఙ్క్షత ఆహ తుష్టో
దత్తో మయాహమితి యద్భగవాన్స దత్తః
యత్పాదపఙ్కజపరాగపవిత్రదేహా
యోగర్ద్ధిమాపురుభయీం యదుహైహయాద్యాః
అత్రి అనసూయులకు (వారు తపసు చేయగా త్రిమూర్తులు ప్రత్యక్షమయి దత్తులయ్యారు. యదు, హైహయులకు (కార్తవీర్యార్జనుడు) అలర్కుడు పరశురాముడు ప్రహ్లాదుడు, వీరికి యోగాన్ని ఉపదేశించాడు. నిజమైన యోగి భోగులను దూరంగా ఉంచుతాడు. తానే ఎక్కువ భోగి అని చూపుతాడు. మద్యము నల్ల్మందు మగువలు, చొట్టూ నాలుగు కుక్కలు, వికృత వేషం పెట్టుకుని ఉంటాడు. ఈ నాలుగు కుక్కలూ నాలుగు వేదాలు. మద్యముగా ఉన్నది మోక్ష అమృత రసం. అమ్మాయిలు ముక్తి, భక్తి శ్రద్ధ బుద్ధి. నల్లమందు పరమాత్మ నామ కీర్తన. ఇవి యోగులకి మాత్రమే కనపడతాయి. కృతయుగ శక్తి అయిన రేణుకా దేవి వలన పరశురాముడు దత్తుని వద్దకు వెళ్ళినపుడు కూడా దత్తుడు అలాగే కనపడ్డారు. పై వేషాలని బట్టి వ్యక్తిని అపార్థం చేసుకోవడం, మనసులో వేరే భావన చేయడం సరి కాదు. బాగా పాండిత్యమున్నవాడు చిన్న పిల్లవాడిలాగ ఉంటాడని శాస్త్రం.
తప్తం తపో వివిధలోకసిసృక్షయా మే
ఆదౌ సనాత్స్వతపసః స చతుఃసనోऽభూత్
ప్రాక్కల్పసమ్ప్లవవినష్టమిహాత్మతత్త్వం
సమ్యగ్జగాద మునయో యదచక్షతాత్మన్
అనేక లోకాలను సృష్టిచేయాలనే తపనతో తపస్సు చేసాడు. మే ఆదౌ సనాత్స్వతపసః- మనసులో (సనం అంటే మనసు) కలిగిన అంతరార్థ ప్రభోధంతో సనము వలన (శబ్దము వలన) తపసు చేస్తే (ఆదౌ సనాత్ ) సనా అనే పదమును ఆదిలో పెట్టుకుని నలుగురు ఋషులు పుట్టారు. మనసు బుద్ధి సంకల్పం జ్ఞ్యానం అనే దానికి సన అనేది వర్తిస్తుంది సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. శరీర సంబంధం వలన వచ్చిన పుత్రులు కారు వీరు - మానస పుత్రులు. చూళీ అనే ఋషి తపసు చేస్తుంటే ఒక దేవ కన్య ఆయనను 100 ఏళ్ళు సేవించింది. వందేళ్ళ తరువాత ఆయన చూచాడు. ఆయన వరం కోరుకోమంటే నాకు ఉత్తమ సంతానాన్ని ప్రసాదించమని కోరింది. ఆయన సంకల్పంతో మాన్స పుత్రున్ని ఇచ్చాడు. అతనికి కుశనాభుని 100 మంది పుత్రికలను ఇచ్చాడు. (ఈ వందమంది కన్యలను వాయువు అంతకు ముందు ప్రేమిస్తాడు అపుడు ఆ కన్యలు ఆయనతో మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం | అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే |బాలకాండ 32 సర్గ 21 ౧-౩౨-౨౧| అన్నారు. దీనికి రెండు అన్వయాలు ఉన్నాయి. తండ్రిని అవమానించి వరున్ని మేమే ఎన్నుకునే అలాంటి పాడు కాలం రాకుండు గాక. దుర్మేధః స మమ పితరం తే కాలో మా భూత్ - ఇలాంటి పనులు చేసే మా నన్న నిన్ను చంపేస్తాడు. మా తండ్రిగారు చూపించినవాడినే పెళ్ళాడుతాము - పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః | యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి |౧-౩౨-౨౨| వీరిని బ్రహ్మదత్తుడికి (చూళి పుత్రునికి) ఇచ్చి వివాహం చేసారు. పాణి గ్రహణం కాగానే వారి శరీరనికి వైకల్యం సృష్టించిన వాయువు వారి శరీరంలోంచి వెళ్ళిపోయింది. వాయువు శాపంతో కోల్పోయిన పూర్వ రూపాన్ని వారు పొందారు).
ధర్మాన్ని ఆచరించడానికి సంకల్పమే ప్రధానం. ఆ సంకల్పం పుట్టేది మనసు నుంచి. వీరు సకల ప్రపంచానికి యోగ మార్గాన్ని బోధించారు. ఒక సనం నుండి నలుగురు సనాలు వచ్చారు. ఇంతకు ముందు ఉన్న కల్పంలో నశించిన యోగమార్గాన్ని ప్రచారం చేసారు. దేన్ని ఆత్మ తత్వం అంటారో (అచక్షతా) అంటారో దాన్ని ఏర్పరచారు.
ధర్మస్య దక్షదుహితర్యజనిష్ట మూర్త్యాం
నారాయణో నర ఇతి స్వతపఃప్రభావః
దృష్ట్వాత్మనో భగవతో నియమావలోపం
దేవ్యస్త్వనఙ్గపృతనా ఘటితుం న శేకుః
నర నారాయణులు తరువాత అవతారం. దక్షుని అరవై కుమార్తెలలో మూర్తి అనే అమ్మాయిని ధర్ముడనే ఆయనకు ఇచ్చి వివాహం చేసారు. వీరికి ఉన్న ఆరుగురు సంతానంలో నర నారాయణులు కూడా ఉన్నారు. యోగమును తత్వమునూ తపస్సు యొక్క ప్రభావమును లోకానికి చెప్పడానికి వచ్చారు. వీరి తపస్సుని లొబరుచుకోడానికి వచ్చిన మన్మధ సైన్యానికి (అనఙ్గపృతనా) అవకాశం లేకుండా చేశారు
కామం దహన్తి కృతినో నను రోషదృష్ట్యా
రోషం దహన్తముత తే న దహన్త్యసహ్యమ్
సోऽయం యదన్తరమలం ప్రవిశన్బిభేతి
కామః కథం ను పునరస్య మనః శ్రయేత
కామాన్ని దహించిన వారు ఉన్నారు గానీ కోపాన్ని కాల్చలేరు. ఎవరైతే కోపాన్ని దహించారో, వారి మనసులో కామం ఉండదు. తపస్సికీ యోగానికీ ప్రధాన ఫలం కోపాన్ని జయించడం, ఈ అవతారాల ప్రధాన ప్రత్యేకతలు 1. కామ క్రోధాలను జయించడం 2. తపస్సు యొక్క మహత్యాన్ని చాటడం (సహస్రకవచుని వధించడం) 3. గురు శిష్య లక్షణాలు లోకానికి చెప్పడం. ఆచార్య శిష్య, కామ క్రోధ, తపస్సు యొక్క తత్వాన్ని చెప్పడం ఈ అవతార ముఖ్య ఉద్దేశ్యం.
విద్ధః సపత్న్యుదితపత్రిభిరన్తి రాజ్ఞో
బాలోऽపి సన్నుపగతస్తపసే వనాని
తస్మా అదాద్ధ్రువగతిం గృణతే ప్రసన్నో
దివ్యాః స్తువన్తి మునయో యదుపర్యధస్తాత్
తరువాతి అవతారం దౄవుడు. తల్లి సురుచి అన్న మాటకు అవేశంతో తపస్సుకు వెళ్ళాడు. విష్ణువు ప్రత్యక్షమైనపుడు మోక్షం అడిగాడు. "నీవు నన్ను మొదట ఏ ఆవేశంతో తపస్సుకు వచ్చావో ముందు దానికి సంబందించిన వాసనలు పోవాలి. అంతవరకూ నాలుగు వేల సంవత్సరాలు రాజ్యం చేయమని, దృవుని భక్తికి మెచ్చి శ్రేష్టమైన దృవ పదవిని ఇచ్చాడు."
యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర
నిష్ప్లుష్టపౌరుషభగం నిరయే పతన్తమ్
త్రాత్వార్థితో జగతి పుత్రపదం చ లేభే
దుగ్ధా వసూని వసుధా సకలాని యేన
అంగుని కొడుకు వేనుని కుమారుడు పృధు. అంగుడు మృత్యువు పుత్రిక అయిన సునీధను పెళ్ళి చేసుకున్నాడు. ఋషులు తపస్సు చేసుకుంటున్నప్పుడు వారిని రాళ్ళతో కొట్టి వేధించబోయిన ఈ సునీధకు ఋషుల శాపం వలన పరమ నాస్తికుడైన వేనుడు జన్మించాడు. వేనుడి శరీరాన్ని మర్దించినప్పుడు మొదట నిశాధ జాతి వచ్చింది, తరువాత ఒక కవలల జంట వచ్చింది. అందులో ఒకరు పృధువు. ఆయన భూమిని దున్ని పంట పండిచే వ్యవస్థ ఏర్పాటు చేసాడు. నగర పట్టణాలు, వర్షాలు పడకపోయినా పంట పండించడానికి నీటిని నిల్వ చేసే పద్దతి ఈయనే ప్రవేశపెట్టాడు. అన్ని ఔషధులూ భూమినుంచి పిండాడు
నాభేరసావృషభ ఆస సుదేవిసూనుర్
యో వై చచార సమదృగ్జడయోగచర్యామ్
యత్పారమహంస్యమృషయః పదమామనన్తి
స్వస్థః ప్రశాన్తకరణః పరిముక్తసఙ్గః
నాభికి మేరు దేవికీ వృషభుడు పుట్టాడు. భరతునికి పట్టాభిషేకం చేసి యోగ గతిలో ఆజగర మార్గం అవలంబించాడు. ఈయన పాటించిన పదహారు రకాల మార్గాలు (మీసాలు తీసేసి గడ్డాలు పెంచుకోవడం, తెల్ల వస్త్రాలు ఒకసరి, నల్ల వస్త్రాలు ఒకసరి, ఇలా ఎప్పుడేది దొరికితే అదే వేసుకున్నాడు, ) దీన్ని చూచిన వారు "ఇది ఇంకో మతం అనుకుని అదే అవలంబించారు".
ఆయన చేతులు చాచుకొని పడుకొనే వారు. ఆ చేతిలో ఏమైనా పడితే అదే తినేవాడు. కొన్నాళ్ళకు అది మానేసి, నోరు తెరిచి ఉండేవాడు. నోటిలో ఏమైనా పడితే తినేవాడు - సమదృగ్జడయోగచర్యామ్
దీన్నే పరమహంస పదం అంటారు. స్వస్థః - తనలో తాను ఉన్నాడు (ఎలాంటి జబ్బూ లేదు). అందరిలో ఉన్నవాడూ ఒక్కడే అని చూచుట వలన ప్రశాంతమైన ఇంద్రియములు కలవాడు. అన్ని సంగాలను వదిలిన వాడు
సత్రే మమాస భగవాన్హయశీరషాథో
సాక్షాత్స యజ్ఞపురుషస్తపనీయవర్ణః
ఛన్దోమయో మఖమయోऽఖిలదేవతాత్మా
వాచో బభూవురుశతీః శ్వసతోऽస్య నస్తః
సత్రే మమాస - నేను (బ్రహ్మదేవుడు) సత్రం చేస్తుండగా హయగ్రీవుడు ఉద్భవించాడు. (హయగ్రీవ రూపంలో పరమాత్మ ఆవరిభవించి నాలుగు సార్లు హేషారావం (నిశ్వాస) చేస్తే నాలుగు వేదాలూ పుట్టాయి అని శంకరుడు స్కాంధంలో పార్వతీ అమ్మవారితో చెబుతారు.) భాగవతంలో విష్ణుపురాణంలో పాద్మంలో బ్రహ్మవైవర్తంలో బ్రహ్మాండ పురాణములో హయగ్రీవ స్వామి గాధను మూడు రకాలుగా వివరించారు. ఒక రాక్షసుడు (సోమకుడని పేరు) ఇతరుల ప్రోత్బలం వలన బ్రహ్మగారి నుండి హయశీర్షముండేట్లు వరము కోరుకున్నాడు. అతను బ్రహ్మగారిని "నాలాంటి ఆకారంతో ఉన్నవాడిచేతనే నాకు మరణం కావాలి" అని అడిగాడు. పరమాత్మ నారదున్ని శంకరుని వద్దకు పంపించి ఇలా జరిపించాడు.
నారద మహర్షి ఒకనాడు శంకరుని వద్దకు వెళ్ళి "నీవు హాలాహలాన్ని మింగుటవలననే కదా అమృతం వచ్చింది, అదీ గాక వాసుకి నీ హస్తాభరణం, మందర పర్వతాన్ని గూడా నీవే పంపావు. అయినా అందరు శ్రీమహావిష్ణువువలనే అమృతం ఉద్భవించిందంటారు. అలాగే త్రిపురాసున్ని నీవు సంహరిస్తే నారాయణుడు సంహరించాడంటున్నారు. నీవు విష్ణువుతో యుద్ధం చేయవలసింది " అని చెప్పి, మళ్ళీ విష్ణుమూర్తిదగ్గరకు వెళ్ళి దీనికి విపర్యయంగా చెప్పి "చేసినదంతా నీవైతే అందరూ శంకరునిదే గొప్ప అంటున్నరని " శంకరునితో యుద్ధం చేయవలసిందని చెప్పారు. ఇరువురూ అందులకంగీకరించి యుద్ధము సల్పగా శ్రీమహావిష్ణువు శంకరునితో "కాసేపు విశ్రమించెదనని" చెప్పి నిల్చున్న భంగిమలోనే ధనస్సు కొసమీద తలపెట్టుకుని నిదురపోగా, ఒక భ్రమరం వచ్చి వింటినారిని కొరికింది, దానితో తల తెగిన విష్ణుమూర్తికి గుఱ్ఱం తలను అమర్చారు. అలా ఆవిర్భవించారు హయగ్రీవ మూర్తి
బ్రహ్మగారు నోటితో వేదముని వల్లె వేస్తుంటే ఆయన నోటినుండి వచ్చే వర్ణములన్నిటినీ ఒక రాక్షసుడు వచ్చి తీసుకున్నాడు (ఆకర్షించాడు). అందుకే కొన్ని విశిష్ట్మైన వర్ణాలని బహిరంగంగా వల్లించకూడదని శాస్త్రం. ఎదుటివాడికి కూడా మంత్ర శక్తి ఉంటే వాటిని మొత్తాన్ని ఆకర్షించగలడు. మంత్రాలే కాదు మేధస్సునీ బుద్ధినీ కూడా ఆకర్షించగలడు. ఆ అక్షరం బీజం తత్వం ఆ ప్రభావం బహిరంగం కాకూడదు. అలా ఆ రాక్షసుడు బ్రహ్మ యొక్క మేధస్సుతో హరించాడు.
ఛన్దోమయో మఖమయోऽఖిలదేవతాత్మా: హయగ్రీవుడూ వరహామూ హంస అవతారం, ఈ మూడు యజ్ఞ్యపురుషుని అవతారం. ఈయనే వేద పురుషుడు. మఖ మయ: పంచకర్తృకం యజ్ఞ్యం ఐతే ఏకకర్తృకం మఖం. బహువార్షికం సత్రం. అంతకంటే లోపల యాగం. ఒక్క రోజులో చేస్తే హోమం.
అఖిలదేవతాత్మా - పరమాత్మ ఆత్మ అయితే దేవతలంతా శరీరాలు.
ఆయన ఒక్క సారి నిట్టుర్పువిడిచినపుడు ఆ నాసిక నుండి సకలవేద వాక్కులూ ఆవిర్భవించాయి.
ఉశతీః స్తోత్రం చేయబడేవి (స్తుతి పరా:)
మత్స్యో యుగాన్తసమయే మనునోపలబ్ధః
క్షోణీమయో నిఖిలజీవనికాయకేతః
విస్రంసితానురుభయే సలిలే ముఖాన్మే
ఆదాయ తత్ర విజహార హ వేదమార్గాన్
సత్యవ్రతుడు సముద్రంలో అర్ఘ్యం విడుస్తున్నప్పుడు ఒక అంగుష్ట మాత్ర చేపపిల్ల పడింది. చూస్తుండగా అతి పెద్దదైంది. ఆయన ప్రార్థిచగా ఆ మత్స్యమూర్తి ఆయనను అనుగ్రహించి యుగాంతమవుతోందనీ, నాటికి ఏడవరోజున ప్రళయం జగత్తుని ముంచుతుందని చెప్పి, భయపడవలసినది ఏదీ లేదనీ, సప్తఋషులున్న ఒక పడవ వస్తుంది, అందులో వాసుకీ సర్పం ఉంటుంది, నా కొమ్మునీ ఆ వాసుకితో కట్టు. కొత్త కల్పం ఆరంభమయ్యే వరకూ నేను కాపాడుతూ ఉంటాను అని చెప్పాడు. కల్పాంతములో వారు అలా సముద్రంలో తిరుగుతున్నప్పుడు సత్యవ్రతుడు తత్వాన్ని గురించి అడుగుతాడు. అదే మత్స్య పురాణం. అందులో శివ మహిమను విశేషంగా వర్ణిస్తాడు. ప్రళయకాలం అయి బ్రహ్మగారు నిద్రూ లేవగానే సోమకుడనే రాక్షసుడు వచ్చి బ్రహ్మగారి దగ్గర నుంచి వేద ప్రతిపాదనలన్నీ దొంగిలిస్తాడు. అప్పుడు మత్స్యముగానే స్వామి వచ్చి వాటిని రక్షిస్తాడు. ఆవాస క్షేమార్ధం మత్స్య యంత్ర స్థాపన అని శాస్త్రం. ఆసనక్షేమార్థం కూర్మ యంత్రం. అంతటి ప్రళయంలో కూడా ఆ పడవను క్షేమంగా ఉంచింది.
క్షోణీమయో మత్స్యము భూమి స్వరూపుడే. అందుకే భూమి బాగుండాలంటే మత్స్యయంత్రాన్ని పెడతారు.
విస్రంసితానురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ - మొత్తం జలమయి ఆ సముర్ద్రములో ఉన్నపుడు నా నోటినుండి జారిపోయిన వేదములను రక్షించి వాటిని పట్టుకునే సముద్రమంతా విహరించాడు. (ఆదాయ తత్ర విజహార హ వేదమార్గాన్)
క్షీరోదధావమరదానవయూథపానామ్
ఉన్మథ్నతామమృతలబ్ధయ ఆదిదేవః
పృష్ఠేన కచ్ఛపవపుర్విదధార గోత్రం
నిద్రాక్షణోऽద్రిపరివర్తకషాణకణ్డూః
అమృతాన్ని దేవతలు క్షీరసాగరాన్ని చిలికారు. అసలు క్షీరసాగరమధనానికి ముఖ్య ఉద్దేశ్యం లక్ష్మీ అమ్మవారికోసం. మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా కూర్మ రూపంలో పర్వతం కింద ఉన్నాడు. మందరపర్వతం కింద ఉండి స్వామికి ఎప్పటినుండో వీపుకు ఉన్న దురద తొలగి క్షణకాలం నిద్రుఇంచాడు. పరమాత్మ నిద్ర అంటే యోగ నిద్ర. అమ్మవారి కనుబొమల కదలిక ప్రకారమే స్వామి సృష్టిచేస్తాడని శ్రీ గుణరత్నకోసంలో చెబుతారు. అలాంటి అమ్మవారు ఆయంకు దొరికిందీ ఈ అవతారంలో. అంతే కాకుండా ఆత్మ పరమాత్మ తత్వాన్ని చెబుతుంది ఈ కూర్మావతారం
త్రైపిష్టపోరుభయహా స నృసింహరూపం
కృత్వా భ్రమద్భ్రుకుటిదంష్ట్రకరాలవక్త్రమ్
దైత్యేన్ద్రమాశు గదయాభిపతన్తమారాద్
ఊరౌ నిపాత్య విదదార నఖైః స్ఫురన్తమ్
నారసిమ్హస్వామి దేవతలయొక్క మహాభయాన్ని తొలగించడానికి వచ్చాడు. సుడులు తిరుగుతున్న కనుబొమ్మలతో, దంతములతో ఉన్న నోరు బాగ తెరుచుకుని, నిజబృత్యుడైన ప్రహ్లాదుని మాటను కాపాడటానికీ, ఆయన సర్వ వ్యాపకత్వాన్ని నిరూపించడానికి. గద పట్టుకుని వచ్చిన హిరణ్యకశిపున్ని గోళ్ళతో చీల్చి చంపాడు.
అన్తఃసరస్యురుబలేన పదే గృహీతో
గ్రాహేణ యూథపతిరమ్బుజహస్త ఆర్తః
ఆహేదమాదిపురుషాఖిలలోకనాథ
తీర్థశ్రవః శ్రవణమఙ్గలనామధేయ
ఇది హరి అవతారం (తామస మన్వంతరం). గజేంద్రున్ని రక్షించడానికి హరి రూపంలో వచ్చాడు. తొండముతో పద్మముని పట్టుకుని ఉన్న ఏనుగుని రక్షించాడు. శ్రవణమఙ్గలనామధేయ (చెవులకు శుభమును కలిగించే పేరు గలవాడా) అని గజేంద్రుడు పిలిచాడు.
శ్రుత్వా హరిస్తమరణార్థినమప్రమేయశ్
చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః
చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాద్
ధస్తే ప్రగృహ్య భగవాన్కృపయోజ్జహార
గరుత్మంతుని భుజాలనధిరోహించి వచ్చి, ముసలిని లాగి చేత్తో పట్టుకుని చక్రంతో దాని మెడ కోసి, ఏనుగుని సరస్సునుంచి చేత్తో పట్టుకుని తీసాడు.
జ్యాయాన్గుణైరవరజోऽప్యదితేః సుతానాం
లోకాన్విచక్రమ ఇమాన్యదథాధియజ్ఞః
క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్ఛలేన
యాచ్ఞామృతే పథి చరన్ప్రభుభిర్న చాల్యః
పయోద్వాదశీ వ్రతాన్ని అదితికి కశ్యపుడు ఉపదేశించాడు. భాద్రపద శుద్ద పాడ్యమినాడు మొదలు పెట్టి ద్వాదశినాడు ముగించి, అలా ఏడాది పాటు చేయాలి. పుట్టుకతో వామనుడు చిన్న (అవరజ - తరవాత పుట్టినవాడు) వాడైనా గుణాలతో అందరికన్నా పెద్దవాడు. బలి చక్రవర్తి చేస్తున్న యజ్ఞ్యానికి వామనుడు రాగా బ్రహ్మస్థానంలో ఉన్న శుక్రాచార్యులు కూడా ఆ తేజస్సు చూసి లేచి నిలబడ్డారు. అన్నీ ఉన్నవాడై ఉండి కూడా యాచించడానికి వచ్చాడు. యజ్ఞ్యంలో వెళ్ళి తాను బిక్షగా మూడు అడుగులు నేలను అడిగాడు. చిన్నవారు పెద్దవారిని యాచించి లేదనిపించుకున్నా పర్వాలేదు గానీ పెద్దవారు చిన్నవారిని అడిగితే, వారు ఇచ్చినా సరే అది పెద్దవారికి చిన్నతనమే అని లోకోక్తి. స్వామి అది కూడా లెక్క చేయక యాచించాడు.
నార్థో బలేరయమురుక్రమపాదశౌచమ్
ఆపః శిఖాధృతవతో విబుధాధిపత్యమ్
యో వై ప్రతిశ్రుతమృతే న చికీర్షదన్యద్
ఆత్మానమఙ్గ మనసా హరయేऽభిమేనే
శుక్రాచార్యులవారు వారించినా "దేవతల ఆధిపత్యం నాకెందుకు, పరమాత్మ పాదజలం లభించాక అని" తన శిరస్సు మీద మొదలు పాద జలాన్ని, తరువాత పాదాన్నే వహించాడు. బలిచక్రవర్తికి రసాతల ఆధిపత్యం ఇచ్చి స్వామే కాపలాగా ఉన్నాడు (రావణుడికీ వృత్తాంతం శుక్రాచార్యుల వలన తెలిసి ఆగ్రహంతో విష్ణువుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు, వెళ్ళగానే స్వామి కుడికాలి బొటనవేలితో తన్నాడు, ఈ సారి వెనక దారినుంచి వచ్చి బలి చక్రవర్తిని కలిసాడు. 64 (16*4) యుగాలవెనక వాడు బలి. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడు "శిరసు వంచి నమస్కరిస్తే ఆయన నీ ఆధీనంలో ఉంటాడు. ఆయనను ఎదిరిస్తే కిందకు తొక్కుతాడు" అని రావణునికి చెప్పాడు. )
తుభ్యం చ నారద భృశం భగవాన్వివృద్ధ
భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగమ్
జ్ఞానం చ భాగవతమాత్మసతత్త్వదీపం
యద్వాసుదేవశరణా విదురఞ్జసైవ
పరమాత్మ నీకు కూడా (నారదునికి) యోగిగా ఆత్మతత్వాన్ని బోధించాడు. భాగవతాన్ని శ్రీమన్నారాయణుడే నారదునికి బోధించాడు. పరమాత్మ భక్తులు మాత్రమే ఈ ఆత్మ తత్వాన్ని సులభంగా తెలుసుకుంటారు.
చక్రం చ దిక్ష్వవిహతం దశసు స్వతేజో
మన్వన్తరేషు మనువంశధరో బిభర్తి
దుష్టేషు రాజసు దమం వ్యదధాత్స్వకీర్తిం
సత్యే త్రిపృష్ఠ ఉశతీం ప్రథయంశ్చరిత్రైః
రాజులందరూ పరమ దుష్టులైతే అలాంటి వారిని స్వామి సంహరించడానికి పరశురామునిగా అవతరించాడు. తన దివ్యమైన తేజస్సు ఏ ఏ దిక్కులలో అంతర్ధానంగా ఉండి సకల దుష్టులైన రాజుల యొక్క వంశములను ధ్వంసం చేసి నిగ్రహాన్ని కలిగించాడు. తన దివ్యమైన చరిత్రలతో అన్ని దిక్కులకూ కీర్తిని వ్యాపింపచేస్తూ దుష్టులైన రాజులని సంహరింపజేస్తూ ఎవరు గర్వించారో మదించారో అహంకరించారో వారి మదాన్ని అహంకారాన్ని గర్వాన్ని స్వయంగా సంచరించి, తొలగించి తన దివ్యమైన చరిత్రనూ కీర్తినీ అంతటా వ్యాపింపచేసిన వాడు పరశురాముడు
ధన్వన్తరిశ్చ భగవాన్స్వయమేవ కీర్తిర్
నామ్నా నృణాం పురురుజాం రుజ ఆశు హన్తి
యజ్ఞే చ భాగమమృతాయురవావరున్ధ
ఆయుష్యవేదమనుశాస్త్యవతీర్య లోకే
అమృత మధన సమయంలో అమృతం కన్నా ముందు అవతరించినవాడు ధన్వంతరి. పెద్దరోగం ఉన్నవారికి (పురురుజాం ) ధన్వంతరి నామముతో తొలగించే అవతారం. వేదం ఎంత ఆయుష్యాన్ని ప్రసాదించిందో అంతకాలం మనం జీవించడాని కావలసిన ఔషధాన్ని అందించి వేదోక్త పరిపూర్ణ ఆయుష్యాన్ని ప్రసాదించిన అవతారం ధన్వంతరి.
క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా
బ్రహ్మధ్రుగుజ్ఝితపథం నరకార్తిలిప్సు
ఉద్ధన్త్యసావవనికణ్టకముగ్రవీర్యస్
త్రిఃసప్తకృత్వ ఉరుధారపరశ్వధేన
సృష్టి క్రమానికనుగుణంగా బాగా వృద్ధి చెందిన బ్రాహ్మణులకూ బ్రహ్మజ్ఞ్యానులకూ ద్రోహం చేయపూనుకున్నా, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టిన క్షత్రియులయొక్క క్షయంకోసం, వారి నరక బాధ తప్పించాలన్న దయతో (నరకార్తిలిప్సు). తీక్షణమైన గొడ్డలితో 21 సార్లు క్షత్రియులని లేకుండా చేసాడు.
అస్మత్ప్రసాదసుముఖః కలయా కలేశ
ఇక్ష్వాకువంశ అవతీర్య గురోర్నిదేశే
తిష్ఠన్వనం సదయితానుజ ఆవివేశ
యస్మిన్విరుధ్య దశకన్ధర ఆర్తిమార్చ్ఛత్
గురోర్నిదేశే తిష్ఠన్:
రామావతార సారం మొత్తం పెద్దల మాట వినుట. దేవతలు కోరితే అవతరించాడు. విశ్వామిత్రుడి మాట మేరకే ఆయనతో వెళ్ళాడు. విస్వామిత్రుని మాటమేరకే తాటకిని సంహరించాడు. ఆయన మాట మేరకే యజ్ఞ్యాన్ని కాపాడాడు, ఆయన ఆజ్ఞ్యను అనుసరించి మిథిలా నగరానికి బలయలు దేరి, అహల్యను శాపవిమోచనం గావించి, ఆయన మాటమేరకే శివ ధనుర్భంగం చేసాడు, దశరధుడు చెప్తే సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. తండ్రి మరియు కైక ఆజ్ఞ్యతో అరణ్యానికి బయలుదేరాడు. భరద్వాజుని ఆజ్ఞ్యతో చిత్రకూటంలో నివాసం ఏర్పరుచుకున్నాడు, చిత్రకూటంలో కులపతి ఆజ్ఞ్యతో అక్కడినుంచి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు . దండకారణ్యంలో సుతీక్షుని ఆజ్ఞ్యతో అక్కడ ఋషుల ఆశ్రమాలు దర్శించాడు, అగస్త్య ముని ఆజ్ఞ్యతో పంచవటికి బయలుదేరాడు, పంచవటిలో జటాయువు నిర్దేశంతో ఆశ్రమం నిర్మించుకున్నాడు. కబంధ్ని, శబరి ఆజ్ఞ్యతో సుగ్రీవుడితో స్నేహం చేసి. సుగ్రీవుని మాటతో వాలిని చంపాడు, సుగ్రీవుని మాటతోనే హనుమంతాదులను సర్వదిక్కులకూ పంపాడు. హనుమంతుడు చెప్పినదాన్ని బట్టి, సుగ్రీవుని సలహామేరకూ యుద్ధానికీ బయలుదేరాడు, విభీషణుని సలహా మేరకూ సముద్రున్ని శరణు వేడాడు, సముద్రుని మాటమేరకూ సముద్రానికి వారధి కట్టాడు. రామ రావణ యుద్ధంలో కూడా మాతలి చెబితే రావణున్ని చంపాడు. అగ్నిహోత్రుడు చెబితే సీతమ్మవారిని స్వీకరించాడు, భరద్వాజుడు చెబితే అయోధ్యకు మళ్ళీ వెళ్ళాడు, భరతుడు చెబితే పట్టభిషేకం చేసుకున్నాడు. యమధర్మరాజు చెబితే అవతారాన్ని చాలించుకున్నాడు.
రావణుడు ఈయనతో విరోధం పెంచుకుని దుఖాన్ని పొందాడో (దశకన్ధర ఆర్తిమార్చ్ఛత్). దశకన్ధర ఆర్తిమార్చ్ఛత్ అన్నదానికి దుఖాని తొలగించుకున్నాడు అని కూడా అర్థం.
యస్మా అదాదుదధిరూఢభయాఙ్గవేపో
మార్గం సపద్యరిపురం హరవద్దిధక్షోః
దూరే సుహృన్మథితరోషసుశోణదృష్ట్యా
తాతప్యమానమకరోరగనక్రచక్రః
సముద్రాన్ని తన నిప్పులు కురిసే చూపుతో ఇంకింపచేయబోయాడు. ఆయన కన్నెర్రకి సముద్రంలో ఉన్న ముసళ్ళు మిగతా జంతువులూ ఉడికిపోయాయి (తాతప్యమానమకరోరగనక్రచక్రః). హరవద్దిధక్షోః శంకరునిలాగ మూడోకన్ను తెరిచి సముద్రాన్ని ఇంకించబోయేసరికి, జలంలో ఎక్కడో ఉన్న సకల జర చరాలు ఉడికిపోయాయి.
వక్షఃస్థలస్పర్శరుగ్నమహేన్ద్రవాహ
దన్తైర్విడమ్బితకకుబ్జుష ఊఢహాసమ్
సద్యోऽసుభిః సహ వినేష్యతి దారహర్తుర్
విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోऽధిసైన్యే
స్వర్గలోకంలోకి వెళ్ళిన రావణుడి మీదకు ఐరావత జాతికి చెందిన ఏనుగుల గుంపు దాడి చేస్తే ఆయన వక్షస్థలం గాయపడింది. రావణుని వక్షస్థలాన్ని స్పృశించుటవలన ఇంద్రుని వాహనమైన ఐరావతానికే బాధకలిగింది. మొత్తం దిక్కులలో ప్రతిధ్వనించేట్టుగా నవ్వుతూ ఐరావతాన్ని పరిహసించాడు రావణుడు. అటువంటివాడి కీర్తినీ సైన్యాన్ని పరాక్రమాన్ని గర్వాన్నీ బలాన్నీ ప్రాణాన్ని తీసుకున్నాడు శ్రీరాముడు.
భూమేః సురేతరవరూథవిమర్దితాయాః
క్లేశవ్యయాయ కలయా సితకృష్ణకేశః
జాతః కరిష్యతి జనానుపలక్ష్యమార్గః
కర్మాణి చాత్మమహిమోపనిబన్ధనాని
కృష్ణావతార లీలలన్నీ ఈ సంవాదం జరిగేప్పుడు ఇంకా జరగలేదు. జరగబోయే దాన్ని బ్రహ్మగారు నారదునికి చెబుతున్నారు. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు
సౌలభ్యపరాకాష్టకు శ్రీకృష్ణావతారం సంకేతం. దైవత్వం మానుషత్వం అర్భకత్వం సౌలభ్యం అన్నీ ఉన్న అవతారం కృష్ణావతారం. పెద్దలు (ఇంద్రాదులూ బ్రహమ వంటివారు) వచ్చి స్తోత్రం చేసారు, పిల్లలు ఆయనతో ఆడుకున్నారు. పరత్వ సౌల్భ్యాన్ని ఒకే సారి చూపించిన అవతారం అది.
సితకృష్ణకేశః - దేవతలందరూ వెళ్తే తన రెండు కేశాలను పంపించాడు అంశావతారాలుగా. శంకరుడు తెల్లగా ఉంటాడు స్వామి నల్లగా ఉంటాడు. ఈ రెండు తత్వాలు కలిపి పరతత్వాన్ని మనకు అందించడానికి దిగి వచ్చారు.బ్రహ్మ రుద్రాది సకల విభూతులతో ఆవిర్భవించాడు.
భూమికి రాక్షసులచేత బాధింపబడినందువలన కలిగిన కష్టం తొలగించడానికి (సురేతరవరూథవిమర్దితాయాః) తన తెలుపు నలుపు అవతారంతో వచ్చాడు. తన ప్రభావాన్ని సూచించడానికి తగిన మహిమలనే ఆయన చేసాడు
తోకేన జీవహరణం యదులూకికాయాస్
త్రైమాసికస్య చ పదా శకటోऽపవృత్తః
యద్రిఙ్గతాన్తరగతేన దివిస్పృశోర్వా
ఉన్మూలనం త్వితరథార్జునయోర్న భావ్యమ్
ఉలూకికా అంటే బకీ అని అర్థం (ఈవిడ బకాసురునికి సోదరి) . కృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడే (తోకేన ) పూతనని సంహరించాడు. మూడోనెల వచ్చేసరికి శకటాసుర వధ జరిగింది. బండి మీద శకటాసురుడు ఆవహించాడు, స్వామి పాదం తగిలి శకటాసురుడు వధింపబడ్డాడు. (పరమాత్మ పాదం మనకే కాదు, ఆయనకు కూడా రక్షణ అని అంటారు ఆండాళ్)
తరువాత తృనావర్తుని సంహారం. తరువాత నలకూబర మణిగ్రీవుల పేరుతో (కుబేరుని పుత్రులు నారదుని శాపముతో మద్దిచెట్లగా మారారు) మద్దిచెట్ల రూపంలో ఉన్నవారికి ఉలూకల బంధన లీలలో ముక్తిని కలిగించాడు. రోలుపెట్టి లాగినపుడు ఆ చెట్లు స్వామి మీద పడకుండా పైకి లేచి, కొంథ పైకి ఎగిరి పడ్డాయి (ఉన్మూలనం). స్వామి స్పర్శ కలగగానే ఆ చెట్లలోంచి ఆ ఇద్దరూ లేచారు, వారు పైకి ఎగరడంతో చెట్లుకూడా ఎగిరిపడ్డాయి.
యద్వై వ్రజే వ్రజపశూన్విషతోయపీతాన్
పాలాంస్త్వజీవయదనుగ్రహదృష్టివృష్ట్యా
తచ్ఛుద్ధయేऽతివిషవీర్యవిలోలజిహ్వమ్
ఉచ్చాటయిష్యదురగం విహరన్హ్రదిన్యామ్
కాళీయమర్దన ఘట్టం: దూడలు ఆవులూ కొందరు గోపబాలులతో కలిసి స్వామి వెళ్తుండగా, కొందరు ఆ నదిలో నీరు త్రాగారు. ఆ నీరు త్రాగి మరణించిన వారిని పరమాత్మ తన అనుగ్రహ దృష్టితో బ్రతికించాడు. మరునాడు పొద్దున్న కొందరు పిల్లలను తీసుకొని బలరాముడి కూడా చెప్పకుండా వచ్చాడు. వచ్చి చెట్టు ఎక్కి దూకాడు. ఈ కాళీయ హ్రదమంటే మన సంసారమే. మనలో విషాలను తొలగించడానికే స్వామి వస్తాడు. కాళీయుడు గరుడునితో విరోధం పెట్టుకుని వచ్చాడు. గరుడుడు అంటే పక్షి, అంటే ఆచర్యుడు. భాగవతులతో విరోధం పెట్టుకుంటే విషమయమైన సంసారంలో పడతాము. మళ్ళీ స్వామి కరుణించి ఆ భవతోత్తముల ఆగ్రహాన్ని శమింపచేసి, సంసారం నుంచి విడుదల చేసి నిత్య విభూతికి పంపుతాడు. అలాగే కాళీయ్డుఇని హ్రదం నుండి సముద్రానికి పంపాడు. జీవున్ని పరమాత్మ వైకుంఠానికి ఎలా పంపుతాడో చెప్పే అధ్యాయం. అలాగే పూతన స్తనంలో విషము పెట్టుకుంది. ఈ విషము అంటే విషయములు. అహంకార మమకారాలు స్తనములైతే , అందులో ఉండే శబ్దాది విషయాలు విషములు. విషము తాగితే ప్రమాదం. విషయం ఆలోచిస్తేనే ప్రమాదం. అందుకే కృష్ణుడి లీలల్లో దావాగ్నీ విషమూ పెక్కు సార్లు వస్తాయి. ఆ రాత్రి గోపాలురందరూ అక్కడ విశ్రమించగా దావాగ్ని వచ్చింది. ఆ అగ్నిని కృష్ణుడు తాగేసాడు. మన కామములే అగ్ని. అంతకు ముందు ఆ మడుగులో ఉన్నది అహంకారం అనే విషము. కాళీయుడు ఏ విధంగా ప్రాణ రక్షణ కోసం ఆ హ్రదంలోకి వచ్చి మిగతా జీవులు జేరకుండా హింసించాడో, మనం కూడా సంసారములో కర్మ అనుభవించడానికి వచ్చాము. అది అనుభవించడం చాలక, మరి కాస్త కర్మను మూటగట్టుకుని పోతున్నాము. బృహధారణ్యక ఉపనిషత్సారం ఈ కాళీయ మధన వృత్తాంతం.
ఆ కాళీయ హ్రదంలో స్వామి విహరించాడు. ఆ కాళీయున్ని బయటకు వెళ్ళగొట్టాడు (ఉచ్చాటయిష్యదురగం )
తత్కర్మ దివ్యమివ యన్నిశి నిఃశయానం
దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే
ఉన్నేష్యతి వ్రజమతోऽవసితాన్తకాలం
నేత్రే పిధాప్య సబలోऽనధిగమ్యవీర్యః
అందరూ ఆనందముతో ఆ రోజు అక్కడ పడుకుంటే దావాగ్ని వచ్చింది. అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, తాను కూడా మూసుకున్నాడు. అందరినీ తెరవమన్నప్పుడు చూచేసరికి అగ్నిలేదు. (నొట్లోకి ఏ పదార్థం పోతున్నా చూడకూడదని శాస్త్రం. లోపటికి వేడి వెళ్తున్నప్పుడు, కళ్ళలో జ్యోతికూడా మూసుకోవాలని శాస్త్రం). ఒక్క బలరాముడు మాత్రం మూసుకోలేదు. నైవేద్యం పెట్టేప్పుడు అర్చకునికి మాత్రమే మినహాయింపు చూడటానికి. అర్చకుడు కూడా స్వామికి నైవేద్యం పెట్టేప్పుడు ప్రసాదం చూడకూడదు.
గృహ్ణీత యద్యదుపబన్ధమముష్య మాతా
శుల్బం సుతస్య న తు తత్తదముష్య మాతి
యజ్జృమ్భతోऽస్య వదనే భువనాని గోపీ
సంవీక్ష్య శఙ్కితమనాః ప్రతిబోధితాసీత్
స్వామిని కట్టివేయడానికి తీసుకొచ్చిన తాడు ఆయన ఉదరానికి సరిపోలేదు. ఆయన మట్టి ముద్ద తిన్నాడని అనుకున్న తల్లి యశోద నోరు తెరవమనగా పదునాల్గు భువన భాండములని చూపాడు. అంతకు ముందు స్వామి ఆవలించినపుడు ఆయన నోటిలో అన్ని లోకాలు చూపించాడు. అది భ్రమ అనుకుంది యశోదమ్మ. అప్పుడు చూడనందుకే మళ్ళీ మట్టి తిని ఈ సారి చూచేలాగ చేసాడు.
నన్దం చ మోక్ష్యతి భయాద్వరుణస్య పాశాద్
గోపాన్బిలేషు పిహితాన్మయసూనునా చ
అహ్న్యాపృతం నిశి శయానమతిశ్రమేణ
లోకం వికుణ్ఠముపనేష్యతి గోకులం స్మ
నందుడు, మిగతా గొల్లలు ఏకాదశీ ఉపస్వాసముండి ఆ సాయంత్రం నీట స్నానం చేయడానికి నదిలో దిగాడు. (సంధ్యాకాలంలో నీటిలో మునగకూడదు). వరుణుని దూత వరుణ పాశంతో ఆయనను కట్టి వరుణ లోకానికి తీసుకెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు వరుణలోకానికి వెళ్ళాడు. వరుణుడు శ్రీకృష్ణుణ్ణి క్షమాపణ కోరాడు. అది చూచి నందునికి అనుమానం వచ్చింది స్వామి అవతారమే అని. రేపల్లెలో అందరికీ ఈ విషయం చెప్పాడు. అపుడు అందరూ శ్రీకృష్ణుణ్ణి వైకుంఠం చూపమని అడగాలని అనుకుంటే, కృష్ణుడు అందరికీ త్వరగా నిద్ర వచ్చేట్లు చేసి మొత్తం అందరికీ, గోవులతో సహా వైకుంఠాన్ని దర్శింపచేసాడు. మయాసురుని కుమార్డైన వ్యోమాసురుడు, శరత్ కాలంలో పిల్లలందరూ దాగుడు మూతలాడుతుంటే కృష్ణుడితో ఆడుకుంటున్న గోపాలకులనూ గోపికలనూ దాచివేసాడు. అప్పుడు ఆ అసురున్ని ఒక ముస్ఠి ఘాతంతో వధించాడు. మొత్తం గోకులానికి వైకుంఠ దర్శనం
గోపైర్మఖే ప్రతిహతే వ్రజవిప్లవాయ
దేవేऽభివర్షతి పశూన్కృపయా రిరక్షుః
ధర్తోచ్ఛిలీన్ధ్రమివ సప్తదినాని సప్త
వర్షో మహీధ్రమనఘైకకరే సలీలమ్
గోవిందపట్టాభిషేక ఘట్టం. నందాదులు చేయబోతున్న ఇంద్రయాగాన్ని మాంపించి నాలుగు యోజనాలున్న గోవర్ధనపర్వాతాన్ని పూజించుకుందామని , దానితో బాటు బ్రాహ్మణోత్తములకూ, గోవులకూ చేద్దామని చెప్పాడు. అలా ఇంద్రయాగాన్ని భంగం చేసి, గోవర్ధానికి పూజ చేయించి, దానికి ఇంద్రుడు ఆగ్రహించగా గోవర్ధనాన్ని ఎత్తి ఏడేళ్ళ వాడు, ఏడు రోజులు మోసి గోవిందుడని పేరు తెచ్చుకున్నాడు.
క్రీడన్వనే నిశి నిశాకరరశ్మిగౌర్యాం
రాసోన్ముఖః కలపదాయతమూర్చ్ఛితేన
ఉద్దీపితస్మరరుజాం వ్రజభృద్వధూనాం
హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య
శరత్ కాలంలో బాగా విచ్చుకున్న మల్లెపూలను చూచి అంతకు ముందే వరమించ్చినట్లుగా మురళీ నాదంతో ఒక్కక్కరినీ పేరు పేరు గా పిలిచాడు. వారు వచ్చిన తరువాత "అందరినీ వదిలి రావడం తప్పు కదా" అన్నాడు. అపుడు వారు "నిన్ను ఒక్కడినీ సేవిస్తే సర్వాత్మకుడవైన నిన్ను ఆరాధిస్తే అందరినీ సేవించిన ఫలితం వస్తుంది." ఇలా విహరిస్తుంటే శంఖచూడుడనే కుబేరుని భృత్యుడు గోపికలను అపహరించయత్నించాడు. వాడిని సంహరించి వాడికున్న సుదర్శనమనే మణిని రాధమ్మకు కానుకగ ఇస్తాడు.
యే చ ప్రలమ్బఖరదర్దురకేశ్యరిష్ట
మల్లేభకంసయవనాః కపిపౌణ్డ్రకాద్యాః
అన్యే చ శాల్వకుజబల్వలదన్తవక్ర
సప్తోక్షశమ్బరవిదూరథరుక్మిముఖ్యాః
యే వా మృధే సమితిశాలిన ఆత్తచాపాః
కామ్బోజమత్స్యకురుసృఞ్జయకైకయాద్యాః
యాస్యన్త్యదర్శనమలం బలపార్థభీమ
వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయమ్
చాణూరముష్టికులు, కువలయాపీడమనే ఏనుగు, దంతవక్తృడు, శాల్వుడు, కపి (ద్వివిదుడు) మొదలైన వారిని వధించాడు. చేత్తో ధనువు పట్టుకోవడం వచ్చిన ప్రతీ వాడు కృష్ణుడి మీదకు రావడానికి యత్నిచాడు. ఇలాంటివారందరినీ కొందరిని తాను సంహరించి, కొందరిని బలరాముడితో సంహరింపజేసాడు. పాండవులతో చంపించాడు కొందరినీ
కాలేన మీలితధియామవమృశ్య న్ణాం
స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః
ఆవిర్హితస్త్వనుయుగం స హి సత్యవత్యాం
వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ
కాలవశంతో మరుగైన బుద్ధి కలవారు, అల్పాయుష్షు కలవారు (మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా అన్నట్లుగా ప్రజలు కూడా వీరు ఎపుడు వధించబడతారో అని ఎదురుచూచారు)
దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం
పూర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః
లోకాన్ఘ్నతాం మతివిమోహమతిప్రలోభం
వేషం విధాయ బహు భాష్యత ఔపధర్మ్యమ్
కృష్ణావతారంలో ఉండి భూభారాన్ని తొలగించాడు. తానే వేద వ్యాస రూపంలో అవతరించాడు. కలియుగంలోని మానవులకూ వేద విభాగం చేసి, భాగవతాన్నీ, మిగతా పురాణాలనీ అందించాడు. వేదాన్ని శాఖలుగా విభాగం చేస్తాడు.
కలియుగం వచ్చిన తరువాత స్మృతులనూ శ్రుతులనూ అధ్యాయం చేస్తూ ధర్మం ఆచరిస్తూ అధ్యయనం చేస్తూ, రాత్రి అయ్యిందంటే అందరినీ బాధిస్తూ శిక్షిస్తూ ఉంటే, అలనాంటి వారిని దండించడానికి బుద్ధరూపంలో వచ్చి అధర్మం ఆచరిస్తూ ధర్మాన్ని బోధిస్తున్న వారి బుద్ధిని మోహింపచేయడానికి బుద్ధుడుగ వచ్చి యజ్ఞ్య యాగాదులు చేయకుండా చేసి, పరమాత్మ నిరాకర, నిరజంజనా అని చెప్పాడు, అలా అధర్మాత్ములని మోహింప్చేయడానికి వచ్చిన అవతారం బుద్ధావతారం. ధర్మాలు లాంటివాటిని ప్రచారం చేసాడు, వీటిని ఉపధర్మములూ అంటారు. అతి చిన్న వయసులో ఆయన సన్యాసం స్వీకరించాడు. యజ్ఞ్య యాగాదులనుండి వారు విముఖులయ్యేట్లు చేసాడు
యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథాః స్యుః
పాషణ్డినో ద్విజజనా వృషలా నృదేవాః
స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర
శాస్తా భవిష్యతి కలేర్భగవాన్యుగాన్తే
దేవాలయాల్లో కూడా హరికథలు జరగవు. బ్రాహ్మణులంతా పాప చిహ్నములను (పాష్ణ్డిన) ధరిస్తారు. రాజులంతా శూద్రులవుతారు. శూద్రులు పరిపాలిస్తారు. మొత్తం వెతికి చూచినా స్వాహా స్వధా అనే మాటలు వినరావు (యజ్ఞ్యమూ చేయరూ తద్దినమూ పెట్టరని అర్థం). అప్పుడు కల్కి రూపంలో వచ్చి ఈ అధర్మాన్ని నిర్మూలిస్తాడు
కలియుగంలో ఐదువేల యేండ్లు అయ్యేసరికీ వర్ణసంకరం పదివేల యేండ్లు గడిచేసరికి వేద శబ్దము లేకుండా పోతుందని, కలియుగంలో ఆలయాలలో కూడా హరి కథలు చెప్పబడవు. కృత త్రేతా ద్వాపర యుగాలలో ప్రతీ ఇంటిలో హరికథలు చెప్పబడేవి. పిల్లలు కూడా పరమాత్మ లీలలే క్రీడలుగా ఆడుకొనేవారు. పరమాత్మను స్మరిచకపోతే అంతకన్నా నష్టం మనకు లేదు అని వేదం చెబుతుంది. కలియుగంలో ఆ కాలానికి సజ్జనులు అనిపించుకునేవారి ఇంటిలో కూడా హరికథలు ఉండవు. బ్రాహ్మణులు కూడా పాఖండులు అవుతారు (పాప చిహ్నాలు ధరిస్తారు, మీసాలు పెట్ట్కోవడం),రాజులంటే శూద్రులే వుంటారు. స్వాహా స్వధా వషట్ అనే పేర్లు కూడా వినపడవు. ఇవన్న్నీ కలిప్రభావం వలన వస్తాయి. అలాంటి కలిని యుగాంతంలో పరమాత్మ వచ్చి శాసితాడు
సర్గే తపోऽహమృషయో నవ యే ప్రజేశాః
స్థానేऽథ ధర్మమఖమన్వమరావనీశాః
అన్తే త్వధర్మహరమన్యువశాసురాద్యా
మాయావిభూతయ ఇమాః పురుశక్తిభాజః
పరమాత్మ మనకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కానీ పెరుగన్నం కలిపి పెట్టబోవుతున్న అమ్మను విడిచి పిల్లవాడు తనకు అది వద్దని వెళ్ళిపోయినట్లుగా మనం కూడా పరమాత్మ నుండి వేరుపడతాము.
సృష్టి స్థ్తి లయములలో, సృష్టిలో తపసు, నేను, సనకాది ఋషులు నవ ప్రజాపతులు నియమించబడ్డారు. రక్షణలో ధర్ముడు యజ్ఞ్యములు మనువు దేవతలూ రాజులు నియమించబడ్డారు, ప్రళయానికి అధర్మం, హరుడు, మన్యువశములు (కోపంబాగా ఉండేవి, పాములు) అసురులు నియమించబడ్డారు. ఇవన్నీ పరమాత్మ మాయా విభూతులు, చాలా గొప్ప శక్తి గలవి. మాయ విభూతులకే ఇంత శక్తి ఉంటే పరమాత్మ శక్తి ఎంతటిది.
విష్ణోర్ను వీర్యగణనాం కతమోऽర్హతీహ
యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి
చస్కమ్భ యః స్వరహసాస్ఖలతా త్రిపృష్ఠం
యస్మాత్త్రిసామ్యసదనాదురుకమ్పయానమ్
ఈ ప్రపంచంలో శ్రీమహావిష్ణువు యొక్క పరాక్రం చరిత్రములను ఎవరు లెక్కపెట్టగలరు. భూమిలో ఉన్న ధూళికణములను లెక్కపెట్టగలిగినవాడు లెక్కపెట్టగలడు. పరమాత్మ వామనావతారంగా వెళ్ళి బలి చక్రవర్తిని మూడు పాదములు అడిగి,అవి ఇచ్చాక త్రివిక్రముడయ్యాడు. ఆయన పైకి పాదం లేపినపుడు ఆయన పాదవేగానికి బ్రహ్మలోకం కదిలింది. తన దివ్య శక్తితో బ్రహ్మలోకాన్ని కదలకుండా ఆపాడు, స్తంభింపజేసాడు (చస్కమ్భ అంటే ప్రత్యక్షంగా చూడని దానిని చెప్పేప్పుడు అంటారు )
నాన్తం విదామ్యహమమీ మునయోऽగ్రజాస్తే
మాయాబలస్య పురుషస్య కుతోऽవరా యే
గాయన్గుణాన్దశశతానన ఆదిదేవః
శేషోऽధునాపి సమవస్యతి నాస్య పారమ్
పరమాత్మ యొక్క మాయా బలం ఇంత అని ఎవరైనా చెప్పగలరా. నేను గానీ, ఇక్కడున్న మునులుగానీ, సనకాదులు గనీ, పరమాత్మ బలాన్ని తెలియలేరు. కొంత ఊహిద్దామనుకుంటే వేయి శిరస్సులు గలవాడైన ఆదిశేషుడు రెండువేల నాలుకలతో కూడా (పరమాత్మకు ఏ సమయంలో ఎలాంటి సేవ కావాలో అలాంటి శరీరం ధరించి చేస్తాడు, పరుపుగా కుర్చీగా పాదుకగా, గొడుగుగా, రగ్గుగా, అనీ ఆయనే చేస్తాడు) నిరంతరమూ గానం చేస్తూ కీర్తిస్తూ కూడా ఇప్పటికీ, ఇన్ని కల్పాల కాలం గడిచినా ఆ గుణాల గానం పూర్తి కాలేదు. ఆయనకు అన్ని గుణాలు భక్తుల సౌలభ్యం కోసమే అని భగవత్ రామానుజులు శ్రీ బాష్యంలో చెబుతారు.
యేషాం స ఏష భగవాన్దయయేదనన్తః
సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకమ్
తే దుస్తరామతితరన్తి చ దేవమాయాం
నైషాం మమాహమితి ధీః శ్వశృగాలభక్ష్యే
కపటములేకుండా (నిర్వ్యలీకమ్, వ్యలీకం అంటే అబద్దం, వి+అలీకం అంటే విశేషమైన అబద్దం) ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తారో (ప్రతిఫలం ఆశించకుండా ఎవరు ఆరాధిస్తారో) వారిని భగవంతుడు దయ చూస్తాడు. అప్పుడు దుస్తరమైన (దాటరాని) పరమాత్మ మాయను దాటగలరు. భక్తి ఒక్కటుంటే ఆయన మాయను దాటగలము. ఇలాంటి వారికి నక్కలూ కుక్కలచేత తినదగిన శరీరం మీద, నేను నాది అనే అహంకార మమకారాలు ఉండవు
వేదాహమఙ్గ పరమస్య హి యోగమాయాం
యూయం భవశ్చ భగవానథ దైత్యవర్యః
పత్నీ మనోః స చ మనుశ్చ తదాత్మజాశ్చ
ప్రాచీనబర్హిరృభురఙ్గ ఉత ధ్రువశ్చ
ఇక్ష్వాకురైలముచుకున్దవిదేహగాధి
రఘ్వమ్బరీషసగరా గయనాహుషాద్యాః
మాన్ధాత్రలర్కశతధన్వనురన్తిదేవా
దేవవ్రతో బలిరమూర్త్తరయో దిలీపః
సౌభర్యుతఙ్కశిబిదేవలపిప్పలాద
సారస్వతోద్ధవపరాశరభూరిషేణాః
యేऽన్యే విభీషణహనూమదుపేన్ద్రదత్త
పార్థార్ష్టిషేణవిదురశ్రుతదేవవర్యాః
పరమాత్మ మాయను స్వామి దయ ఉంటేనే తరిస్తారు. పరమాత్మ యోగమాయ తెలిసినవారిలో నేను, నీవు, భవుడు (శంకరుడు),ప్రహ్లాదుడు, శతరూప, మనువు, వారి కుమారుడు, ప్రాచీనబర్హి, ఇక్ష్వాకు, రైల, ముచుకుంద నాబుషుడు (యయాతి) రంతిదేవ, దేవవ్రతుడు (బీష్ముడు) దిలీపుడు విభీసణుడు, హనుమ మొదలైన వారు పరమాత్మ తెలియగలరు, దాటగలరు కూడా
తే వై విదన్త్యతితరన్తి చ దేవమాయాం
స్త్రీశూద్రహూణశబరా అపి పాపజీవాః
యద్యద్భుతక్రమపరాయణశీలశిక్షాస్
తిర్యగ్జనా అపి కిము శ్రుతధారణా యే
ఇందులో స్త్రీలు శూద్రులు ఆటవికులు శబరులు వానరులు ఏనుగులూ వృషభములూ మొదలైన తిర్యక్ జనాలు కూడా ఉన్నాయి. ఒక్క సారి తెలుసుకున్న పశు పక్షాదులు కూడా పరమాత్మ మాయను దాటగలిగినపుడు గురువుల చేత విన్నదాన్ని ధారణ చేసే మానవులెందుకు తరించలేరు దేవ మాయను.
శశ్వత్ప్రశాన్తమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్
శబ్దో న యత్ర పురుకారకవాన్క్రియార్థో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా
పరమాత్మ తత్వాన్ని నూటికి నూరుపాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా చేస్తే మనకు సందేహాలే కలగవు. సర్వదా, అన్నిసమయాలలో (శశ్వత్) ప్రశాంతంగా ఉండి (గుణాలన్నీ అణగారిపోయి), ప్రకృతికంటే అతీతుడైనవాడు అయిన పరమాత్మకు గుణాలు ఎలా ఉంటాయి? అందుకే ఆయన ప్రశాంతాత్మ. ఆయనకెప్పుడు భయం ఉండదు (భయం అంటే ప్రమాదం కలుగుతుందేమో అని ఉండే శంక), సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా పరమాత్మ జ్ఞ్యాన స్వరూపుడు, ఆయన శుద్దుడు (నిర్వికారుడు), సమం (ద్వేషం అసూయ లాంటివి లేని వాడు,) ఆయన సత్ అసత్ రెండిటికీ సమం (ఉన్నవాళ్ళకి ఉన్నట్లుగా కనపడతాడు, దేవుడు లేడు అనే వారికి లేనట్లుగా కనపడతాడు)
పరమాత్మ విషయంలో వేదం కూడా చేసే పని ఏమీ ఉండదు ( పురుకారకవాన్). వేద వాక్కు కూడా అక్కడిదాకా వెళ్ళి వెనక్కు వస్తాయి. వేదము కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేదు. అది కూడా పనికి రాదు (నక్రియార్థో). మాయ కూడా పరమాత్మ ఎదురుగా వస్తే సిగ్గుపడి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది.
ఈ శ్లోకానికి అపవర్గప్రదం అని పేరు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ సన్నిధి కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. పంచభూతాలు గాని,కాలము గానీ దేశం కానీ, వ్యక్తి కానీ, అవస్థలు కానీ, నిరంతరం మన ప్రయత్నం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసలు తీసుకుంటామో మనం ఈ శ్లోకాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి
తద్వై పదం భగవతః పరమస్య పుంసో
బ్రహ్మేతి యద్విదురజస్రసుఖం విశోకమ్
సధ్ర్యఙ్నియమ్య యతయో యమకర్తహేతిం
జహ్యుః స్వరాడివ నిపానఖనిత్రమిన్ద్రః
భగవంతుడు షాడ్గుణ్య పరిపూర్ణుడైన ఈయనను పరబ్రహ్మ అంటారు. నిరంతరమూ ఆనందమునిచ్చేవాడు పరమాత్మ. సంసారంలో మనకు అప్పుడప్పుడు సుఖము లాంటిది కలుగుంతుంది, ఈ సుఖం ఎలాంటిదంటే ముందు ముందు వచ్చే కష్టాలను భరించేందుకు సిద్ధంగా ఉంచడానికి సుఖాలు వస్తాయి. సంసారంలోని మానవులందరూ ఉడుము లాంటివారు. ఆకడి సుఖం సుఖము కాదు. పరమాత్మ సన్నిధిలో ఉన్నదే నిజమైన సుఖం. అక్కడ దుఖం అనేది ఉండదు. యతులు (మనసును బుద్ధిని నిగ్రహించినవాడు) మనని మోహింపచేయడానికి పరమాత్మ ప్రయోగించిన ప్రకృతి అనే మాయను ఖండించగలరు. తవ్వుతున్న కొద్ది నీరు వచ్చే దాన్ని చెలిమ అంటారు. పరమయందలి భక్తి పరమాత్మ యందలి స్వరూప జ్ఞ్యానం మనకు నిపానఖనిత్రమిన్ద్రః లాంటిది (చెలిమెను త్రవ్వడానికి సాధనం) సన్నిధి. అలాంటివాడే సకలదేవదానవులకు అధిపతి అవుతాడు.
స శ్రేయసామపి విభుర్భగవాన్యతోऽస్య
భావస్వభావవిహితస్య సతః ప్రసిద్ధిః
దేహే స్వధాతువిగమేऽనువిశీర్యమాణే
వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతే ఞ్జః
అలాంటి పరమాత్మ అన్ని రకాల శ్రేయస్సుకు అధిపతి. పరమాత్మను మనం ఎలా గుర్తుపట్టాలి? ఒకటి భావం (ఉనికి) రెండు స్వభావం (మన ఉనికి). నేను ఉన్నాను అనే సంగతి మనం దేనివలన గుర్తుపడతాం. దేని బట్టి మనుషులని గుర్తుపడతాము. హిరణ్యకశిపుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నప్పుడు శచీదేవి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిచాడు. ఇంద్రుని రూపంలో వెళ్ళాడు. శచీదేవి అతను వచ్చిన సమయాన్ని చూచి "ఇలాంటి వేళలో ఇంద్రుడు సంగమానికి రాడు" అని తలచి, "రండి పరమాత్మ ఆరాధన చేద్దాం " అని శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్దాం అని. దాంతో కామరూపంలో వచ్చిన హిర్ణ్యకశిపుడు పాలయనం చిత్తగించాడు. అలాగే ఎన్ని వేషాలు, రూపాలూ మార్చిన తన ఉనికి చాటుకునేది గుణమే. మన ఉనికి చాటుకోవాలంటే మన సహజ గుణం పరమాత్మ దాసత్వం ప్రకటించుకోవాలి. అలా చేస్తే మనం అవుతాం. దాసత్వం కాకుండా స్వామిత్వాన్ని ప్రక్టించుకుంటే స్వరూప హాని.
ఈ శరీరం ఉన్నంత వరకూ మనం "చాలా సౌందర్యంగా ఉంది" అని చెప్పుకుంటాం. చాలా కాలం బ్రతుకుతాము అని అనుకున్నా ఆ కాలం దాటిన తరువాత ఉండము అని అందులోనే ఉంది. కనుకూ క్షీర్యతే ఇతి శరీరం, క్షీణించే దాన్ని శరీరం అంటాం, వృద్ధి చెందే దాన్ని దేహం అంటాం. 38 ఏళ్ళ దాక ఇది దేహం, అది దాటగానే అది శరీరం అవుతుంది.
దేహంలో ఉన్న ధాతువులన్నీ పోతూ ఉంటే శరీరం కూడా అశీర్యం అవుతూ ఉన్నా (చీలిపోతూ ఉంటే) కూడా, అందులో ఉన్న పురుషుడు ఆకాశంలా ఎప్పటిలాగే ఉంటాడు ఎందుకంటే ఆత్మకి (పురుషుడికి) పుట్టుక ఉండదు కాబట్టి. ఆత్మ సర్వదా నిత్యం.
సోऽయం తేऽభిహితస్తాత భగవాన్విశ్వభావనః
సమాసేన హరేర్నాన్యదన్యస్మాత్సదసచ్చ యత్
నీవడిగిన ప్రశ్నకు సమాధానం "పరమాత్మ సకల ప్రపంచాన్ని సృష్టించేవాడు, పరమాత్మ కన్నా భిన్నమైనది ఏదీ లేదు, ఇతరమైన దానికంటే ఉన్నదీ వాడే, లేనిదీ వాడే. సత్, అసత్ రెండూ ఆయనే.
ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితమ్
సఙ్గ్రహోऽయం విభూతీనాం త్వమేతద్విపులీ కురు
ఇదంతా కలిపి భాగవతం అంటారు. దీన్ని నాకు నా గురువైన శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఇదంతా నేను నీకు సంగ్రహంగా చెప్పాను. దీన్ని విపులీకరించి ప్రపంచానికి చాటి చెప్పు.
యథా హరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి
సర్వాత్మన్యఖిలాధారే ఇతి సఙ్కల్ప్య వర్ణయ
నీవు వ్యాఖ్యానం చేయడం వలన పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని మీద భక్తి కలగాలి. పరమాత్మ యందు భక్తి కలిగించేదే భాగవతం.
సకల జగత్తుకూ ఆధారభూతుడైన పరమాత్మ యందు అందరికీ భక్తి కలగాలి అని సంకల్పించి భాగవతం చెప్పడానికి ఉపక్రమించు
మాయాం వర్ణయతోऽముష్య ఈశ్వరస్యానుమోదతః
శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మా న ముహ్యతి
ఇలాంటి పరమాత్మ యొక్క లోక సమ్మోహనమైన మాయను చెబుతున్నపుడు దాన్ని విని ఆమోదించేవాడికి శ్రద్ధగా వినేవాడికి పరమాత్మ మాయతో అతని మనసు మోహం చెందదు. అటువంటి వారిని పరమాత్మ మాయ మోహింపచేయదు. ఇది బ్రహ్మగారు నారదునికి చెప్పాడు. ఇంచుమించుగా ఇదే మాటను వేదవ్యాసుడు శుకబ్రహ్మకు చెప్పాడు.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు