చదువు సంస్కారాన్ని నేర్పేదై ఉండాలి. ఇంతకు ముందు విద్యలో సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. ప్రస్తుతం చదువు సరుకు గా మారి , పెట్టుబడి రాబట్టుకుని లాభాల వేటగా మారింది. చదువుకు సంస్కారానికి సంబంధం లేకుండా పోతోంది.
ప్రయివేట్ పాఠశాలల హడావిడి ఎక్కువయింది. పాఠ్యాంశాలలో విలువలు నేర్పేవాటికి విలువలేదు. విలువను (డబ్బు) పెంచేవాటికే విలువ. అంటే డాక్టర్ - ఇంజనీర్లయితేనే గొప్ప చదువులన్నమాట.
శ్రావణకుమారుడు తల్లిదండ్రులను కావడిలో మోశాడు అనే పాఠం పిల్లలలో నైతిక విలువలను , మానవతా వాదాన్ని పెంచుతుంది. అలాంటి పాఠాలు నేడు పాత చింతకాయ పచ్చడిగా మారాయి. తల్లిదండ్రులలోనూ విద్య పట్ల - నైతిక విలువల పట్ల ఆశక్తి ఉండడం లేదు.
అదే భవిష్యత్తులో వారిపాలిట శాపంగా మారుతున్నదనే విషయం వారు గమనించడం లేదు.
ఉదాహరణకు ఇటీవల జరిగిన ఓ సంఘటన చెపుతాను.
ఓ మనవడు , మనవరాలు నాయనమ్మ కలసి పిల్లల చదువుల కొరకు పట్నంలో ఉంటున్నారు. పండుగకు ఇంటికి బయలుదేరినప్పుడు నాయనమ్మ మంచి చీరె కట్టుకోలేదని మనవడు తనకు నామోషీగా ఉందని అలా అయితే ఆమెతో కలసి ప్రయాణం చేయనని అలిగాడు. తండ్రి ఫోన్ చేసి మందలిస్తే బలవంతంగా - అయిష్టంగా బయలుదేరి వచ్చాడు.
నేటి సినిమాలు , సొసైటీలో తోటి విద్యార్ధులలో గొప్పదనమనేది వస్త్రధారణ వంటి విషయాలతో పోల్చుకోవడంతో ఈ ధోరణి పిల్లలలో కనిపిస్తుంది.
అదే పాఠ్యాంశాలలో మంచిని పెంచే , మానవ సహజ స్వభావాన్ని , మానవతా విలువలను పెంచే అంశాల బోధన ఉంటే ఈ ధోరణి రాదనే చెప్పొచ్చు.