Followers

Friday, 18 October 2013

నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది




వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. ఒక శిశువుకు తన కుటుంబము నుండి, పరిసరాల నుండి తన అంతః చేతన ద్వారా అందిన నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది.

ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. ఆ రోజే ఇంటి బాధ్యతల విభజన జరుగుతుంది. జీవనోపాధి సంపాదనకు భర్త బాధ్యత వహిస్తే, గృహనిర్వహణను భార్య నిర్వహిస్తుంది. ఇద్దరూ శ్రధగా తెలివిగా తమ భాధ్యతలను నిర్వహించినప్పుడే వివాహ జీవితం సఫలమౌతుంది. పవిత్రమైన హిందూ వివాహంతో జీవితంలో పరీక్ష మొదలౌతుంది. కనుక చేసిన ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నప్పుడే వైవాహిక జీవితం అర్ధమవుతుంది.

త్యాగం, నిష్టల నిర్వహణయే నిజమైన జీవితానికి మార్గదర్శకమౌతుంది. వివామాహోత్సవంలో చేసిన ప్రమాణాన్ని పూర్తిగా పాటించినట్లయితే, వైవాహిక జీవితంలో స్వర్గ సుఖాన్నిచ్చే వాతావరణాన్ని వ్యక్తి సృష్టించుకోగలుగుతాడు. నిజానికి భార్య భాగ్యాధి దేవతయైన లక్ష్మి అవతారమే. ఈ సంపద లేకపోతే మానవజీవితం సారవిహీనం, అనాకర్షణీయం అవుతుంది. పెండ్లికుమారుని ఈ ప్రకటనలో ఎంతో నిజం ఉంది. నీవు లక్ష్మివి. నీవులేని నేను ధనహీనుడను. నీవులేకపోతే నా జీవితంలో ఆనందమేలేదు. ఓ అందాలరాశీ! మన కలయిక సామవేదం, దానిలోని మంత్రం; అది భూమి, ఆకాశాల కలయిక వంటిది. పై వైదిక మంత్రంలో ఋషి వివాహానికి ఒక మంచి వివరణ ఇచ్చారు. వివాహ వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు. పూర్తి సంఘానికి సంబంధించినది. వివాహాలు ప్రమాణాలకు కట్టుబడే, పవిత్రత ముద్రను పొందలేవు. అందువల్ల ప్రతి జంటా తమ సాంఘికబాధ్యతలను గుర్తెరగాలి.

తరతరాల శక్తినీ, సార్వభౌమాధికారాన్నీ, గౌరవాన్నీ యధాతధంగా నిలుపుతామనే ప్రమాణమే వివాహం. పురాణాలలో చెప్పబడిన శ్లోక సారంశం ఇది -

వివాహ ముఖ్యోద్దేశం - పరస్పర ప్రేమమయ జీవితం గడుపుతూ, దేశానికి నీతివంతులైన, శ్రేష్ట సంతానాన్ని అందించడం. పిల్లలకు జన్మనిచ్చి వంశవృక్షాన్ని నిలపడమే వివాహానికి ముఖ్య ఉద్దేశం. ప్రేమలోని ఘాడతను గుర్తిస్తూ కుటుంబాన్ని ఆనందంతో, ఐక్యంగా ఉంచడం కోసమే వివాహం. ఇతరుల మంచికోసం ఆత్మసమర్పణా భావాన్ని కలిగి ఉండి, నిజమైన జీవిత గమ్యాన్ని చివరికి గుర్తించగలగడమే. యదార్ధానికి వివాహం యొక్క పవిత్రోద్దేశం. స్త్రీ పురుష వివక్షత అనే అసాంఘిక ద్రుష్టిని విడనాడాలి. పరిపూర్ణ మైన ఆనందమయ జీవితాన్ని పొందడానికి ఆధారాన్ని వివరించిన మంత్రసారం ఇది -

పరిపూర్ణమైన ప్రేమ, అభిమానాలతో కూడిన ఉత్తమమైన జీవితాన్ని మనం గడప గలగాలి. మన భావాలు పవిత్రంగా ఉండాలి. శత సంవత్సరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని చూస్తూ, వసంతఋతు సంగీతాన్ని వింటూ, జీవించగలగాలి. భార్యాభర్తల ఐక్యత, ప్రేమ, సాన్నిహిత్యాలే వారి ఆనందమయ వివాహ జీవితానికి ఆధారాలు. కనుక వివాహాన్ని శారీరక ఆనందాన్ని ఇచ్చేదిగా కాక, జీవితాంతం వుండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. జీవిత భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులకు ఆత్మ భాగస్వాములుగా ఎదిగే అవకాశం కల్పించేదే వైవాహిక జీవితం.

వధూవరుల మంగళవచనములు

వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు

వధువు: లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.

బాసికము: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుఘమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమ వైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.

అడ్డుతెర: దీనికి మరోపేరు తెరశెల్ల తెల్లని వస్త్రంపై శ్రీ (స్వస్తిక్) అని వ్రాయబడి ఉంటుంది. వధూవరులను తూర్పు, పడమరలకు అభిముఖముగా కూర్చోబెట్టి, మంగళ వాయిధ్యాల మధ్య, ముత్తయిదువులు మంగళగీతాలు మరొకవైపు ఆలపిస్తుండగా, వధూవరులచే మహా సంకల్పం చెప్పిస్తారు.

కన్యాదానం: కన్యాదాన సమయంలో విష్ణు స్వరూపుడైన నీకు (వరునకు) బంగారు ఆభరణముల చేత అలంకరించబడిన నా కూతురు (వధువు)ను సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఈ శ్లోకం చేబుతాడు కన్యాదాత.

కన్యాంకనక సంపన్నాం కనకా భరణైర్యుతామ్

దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా

జీలకర్ర - బెల్లం: ఈ జీలకర్ర బెల్లం అనేది ఒక పాసిటిమ్ ఎలక్ట్రిక్ చార్టర్. వధూవరుల పరస్పర ఆకర్షణకు లోనుకావడానికి వేద ఋషులు దీనిని నిర్ణయించారు. సహజీవనానికి నాందిగా నిలపడానికి మేధస్సును చైతన్యపరిచే ఈ జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు.

మాంగల్యధారణ:

మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా,

కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్

నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి అంటూ వరుడు మాంగల్య ధారణ చేస్తాడు.

నాతిచరామి: 'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి"

అక్షింతలు: అక్షింతల తోటే పెళ్ళికి సంపూర్ణత్వం చేకూరుతుంది. క్షతము గానివి, అక్షింతలు, అనగా ఎప్పటికి నిలిచేవని, అమరమైనవి అనేది వేదార్ధము, తెల్లని బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారుచేస్తారు. బియ్యం చంద్రుడికి సంకేతం. చంద్రుడు మనః కారకుడు, వధూవరుల మనోభీష్ఠిని సుస్ధిరపరచే శక్తిని సిద్ధింపచేయడానికి చంద్రగుణానికి సంకేతంగా బియ్యాన్ని అక్షింతలుగా వాడడం మన ప్రాచీన సంప్రదాయం.

తలంబ్రాలు: పెళ్ళి పండుగలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం. ఇందులో మొదటగా వరుడు "సమాజశ్రేయస్సు కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు వధువు తలవంచి అంగీకరిస్తూ" వధువు "ఆ సంతానజీవన గమనానికి అవసరమైన పాడిపంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా తలంబ్రాలు పోస్తుంది. దానికి సమాధానంగా వరుడు "నేను అందించే ఆర్ధిక సంపదను అణకువగా, సమయోచితంగా వినియోగించమని" తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇరువురూ "త్యాగంతో, ధనంతో సహజీవనము సాగిద్దాము, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందామని" ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు. ఇవి వధూవరులకు ప్రమాణాలు, చూసేవారికి వేడుకలు.

సప్తపది - ఏడడుగలు: వధూవరులు నిలబడి ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రములు పఠిస్తారు. ప్రణాళికా బద్ధంగా ప్రగతి శీలమైన జీవనము కొరకు అగ్నిసాక్షిగా సంకల్పం తీసుకుంటూ దైవా నుగ్రహం జీవితమంతా లభిస్తుందని భావిస్తూ ఏడడుగులు వేస్తారు.

మొదటి అడుగు - అన్నవృద్ధికి

రెండవ అడుగు - బలవృద్ధికి

మూడవ అడుగు - ధనవృద్ధికి

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐధవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవనానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

అరుంధతీ దర్శనము:ఈ భూగోళము ధ్రువము ఈ ఉత్పత్తి స్ధానము ధ్రువము. నీవు ధ్రువముగా ఉందువుగాక! నక్షత్రముల సమూహమున అరుంధతీవలె ధ్రువత్వమును పొంది వర్ధిల్లుము.

Popular Posts