ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారా? రూపాయి ఖర్చవకుండా ఇంట్లోనే పాటించే పద్ధతి ఒకటుంది చెప్పమంటారా? అదేంటంటే - ఉదయాన్నే నిద్ర లేవడం. ఈ ఒక్క అలవాటుతో జీవితం మారిపోతుందంటే నమ్మండి. దీనివెనక ఉన్న కెమిస్ట్రీ ఏమిటో తెలిస్తే ఈ అలవాటును పాటించడం తప్పనిసరి చేసుకుంటారు.
మన మెదడులో ఉండే వినాళ గ్రంధి (పీనియల్ గ్లాండ్) విడుదల చేసే మెలటోనిన్ నిద్రను నియంత్రిస్తుంది. సూర్యరశ్మి ఉంటేనే వినాళ గ్రంధి బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల వినాళ గ్రంధి శక్తిమంతమవుతుంది, దాంతో శరీర గడియారం చురుగ్గా మారి జీవక్రియలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. మెలటోనిన్ మన శరీర వయసును కూడా నియంత్రిస్తుంది. అందువల్ల అది బాగా పనిచేస్తేనే వయసుకు తగినట్టు అందంగా ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. వ్యర్థపదార్థాలను ఉదయం పదింటి లోపల శరీరం బయటకు పంపేస్తుంది. అలా జరిగినప్పుడే శరీరం తేలిగ్గా, హాయిగా ఉంటుంది. ఉదయాన్నే లేవకపోతే, వ్యర్థపదార్థాలు పెద్ద పేగుల్లో ఎక్కువసేపు నిలవ ఉండిపోతాయి.
వాటితో కలిసిన నీటిని శరీరం మళ్లీ పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తమ్మీద పొద్దెక్కి లేవడం అంటే మన శరీరాన్ని మనమే విషతుల్యం చేసేస్తున్నట్టు, తద్వారా రోగాల పుట్టగా మార్చేస్తున్నట్టు. త్వరగా పడుకోవడం కూడా శరీరానికి మేలు చేసే అలవాటే. దీనివల్ల శరీరంలోని భాగాలన్నిటికీ విశ్రాంతి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో శరీరం నీటిని త్వరగా పీల్చుకుంటుంది. దానివల్ల చర్మం తేమగా ఉండి, మనం వయసుకు తగినట్టు కనిపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా పడుకుని, త్వరగా నిద్రలేస్తే వచ్చే లాభాలను అందుకోండి.