జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.
ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది.