Followers

Wednesday, 23 October 2013

రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది.


రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది. పదార్థాలన్నీ అణు నిర్మితాలే. అణువులో పరమాణువులు ఉంటాయి. పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు, శిలలు జీవంలేనివని ఎలా అనగలం? భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు. కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే. కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ, స్థిరమూ చేయడం జరుగుతుంది. "మంత్రాధీనంతు దైవతం" కాన అలానే సాధ్యం. నిత్యనైమిత్తిక పూజాదికంచే ఆ కేంద్రీకృత దైవశక్తి క్రమాభివృద్ధితో జనాకర్షకమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి అజ్ఞానాంధకారం క్రమంగా తొలగిస్తూ ఉంటుంది. భావనాశక్తివలన స్థూలదృష్టికి కన్పడే జడ శిలనుకాక అందలి చైతన్యాన్ని దర్శింపగలం. ఇదంతా శాస్త్రీయ విధానమే తప్ప అశాస్త్రీయం కాదు. "కష్టమ్ శాస్త్రమ్" అన్నట్లు ఈ శాస్త్రీయత గ్రహింపగల్గడం ఒక ప్రత్యేక సంస్కారం. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై బహిర్గతంకాక తన ఉత్పత్తి స్థానమగు ఆత్మయందు విలీనమగు నిర్గుణోపాసనకు సుగుణోపాసన అత్యవసరమగు విషయం, మనస్తత్వ శాస్త్ర విహితం తప్ప అనాలోచిత వ్యవహారం కాదు. కాబట్టి విగ్రహారాధన శాస్త్రీయ సిద్ధాంతము, ఆధ్యాత్మికంలో అత్యావశ్యకము. ఈ సైన్సును నేటి సైంటిస్టులకంటే గొప్ప పరిశోధనల ద్వారానే ప్రాచీనకాలపు సైంటిస్టులైన మన మహర్షులు నిరూపించి తెల్పారు. నిశించుట, విపరీత స్థితులు పొందుట లేని ఉత్తమ శిలను ప్రతిష్ఠామూర్తులకు వినియోగించుట శ్రేష్ఠం. అందుకే శిలా విగ్రహాలే ప్రతిష్ఠిత మవటం చూస్తాం. యంత్రగత మంత్రాధిష్ఠాన దేవతాశక్తిని తనలోకి స్వీకరించే గుణము శిలామూర్తికి ఉంది. అందుకే యంత్రముపై శిలావిగ్రహాలనే అనాదిగా ప్రతిష్ఠించడం జరుగుతోంది.

Popular Posts