Followers

Wednesday, 23 October 2013

సంస్కారం - భగవద్గీత



సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత మానవజన్మకి ఉంది. మనిషి ఇది లేదు అది లేదు అని ఈనాడు ఇన్ని ఏడుపులు వస్తున్నాయి అంటే మనస్సుకి నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇతరులని అణిచివేసి బ్రతుకుతున్నాడు అంటే, మనస్సుకి కలిగిన ఉద్రేకాల వల్ల కదా! కేవలం బాహ్యమైన లోపాల వల్ల ఏడుపు కలగడం లేదు, అవి మనస్సులో ఏర్పడ్డ లోపం వల్ల. దీనికి కారణం సంస్కారం అని సహవాసం అని రెండు ఉన్నాయి. ఇందులో సంస్కారం చాలా బలమైనది. సహవాసం కొంత తోడ్పడగలదు, కొంత మార్పు తేగలదు. కానీ సంస్కారం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సులభంగా అర్థం చేసుకోవడానికి చిన్ని ఉదాహరణ తీసుకుందాం. మిరప గింజ రుచి ఏమిటి ? కారం. పంచదార రుచి ఏమి ? తీపి. ఒక మిరపగింజను పంచదారలో వేశారనుకోండి, దానికి తీయటి సహవాసం దొరికింది, కానీ మిరప గింజ యొక్క కారం పోతుందా. సహవాసం ఎంతటిదైనా సంస్కారం బలీయమైనది. అట్లాకాక మిరపకాయను పంచదార పాకంలో ఉడికించినా, దాని ప్రభావం అది చూపించి తీరుతుంది. మిరపగింజయే కాదు చింత పులుపు అయినా, వేప చేదు అయినా తీసుకోండి, సంస్కార ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇది మనిషి కంటే ఇతరమైన ప్రాణుల్లో. కానీ మానవ శరీరం చాల గొప్పది. సహవాసం, సంస్కారం రెంటినీ బాగు చేసుకోవడానికి యోగ్యమైన ప్రాణి మానవుడంటే. మిగతా ప్రాణులకి ఎంత చేసినా వాటి ప్రవృత్తి పోదు. కానీ మనిషికి సహవాసం మంచిదైతే సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత ఉంది, కనుకనే మన పెద్దలు సత్సంఘం, సజ్జన సహవాసం చేయండి అని పదే పదే చెబుతుంటారు. సహవాసం వల్ల బయట కొంత మార్పు కనిపిస్తుంది, ఆ సహవాసం కొంతకాలం సాగితే లోన సంస్కారం కూడా మారుతుంది. అట్లాంటి అవకాశం ఉంది. ఏ రావణాసురుడి లాంటి వాడిని వదిలేయండి. సీతమ్మ వాడి వద్ద తొమ్మిదినెలలు ఉండి బాగుచేద్దాం అని ప్రయత్నం చేసినా, "సీతే! యేషమే సహజో దోషః", నాకు ఇలా వంకరగా ఉండటం సహజం, "స్వభావో దురతిక్రమః" పుట్టుకతో వచ్చిన స్వభావం కట్టెలతో తప్ప పోదు, పోగొట్టుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసాడు. అట్లాంటి వాడిని వదిలి పెట్టేద్దాం. కానీ సామాన్య మానవుడికి తన సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత ఉంది. రెంటి వల్ల మారే అవకాశం ఉంది. ఒకటి శాస్త్రీయమైన ఆచరణ వల్ల, రెండవది భగవంతుని అనుగ్రహ విశేషం చేత.
మానవ జన్మలో అట్లా మనస్సుని సంస్కరించుకొనే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మనల్ని మార్చటానికి అద్భుతమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులో మనం బాగుపడటానికి వీలుగా ఉపదేశాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఎప్పుడూ చుట్టు ఉంటాడు, కానీ భగవత్ రూపాన్ని చూసే యోగ్యత లేదు, గుర్తించగలిగే యోగ్యత లేదు. విశ్వసించే యోగ్యత లేదు. నేను దేవుణ్ణిరా! ఇదిగో నా విరాట్ రూపం అని చూపిస్తే, చూసిన అర్జునుడికే నమ్మకం కలగలేదు, యుద్ధం అంతా పూర్తి అయ్యాక రథాన్ని డేరా వద్దకు తెచ్చి, నేను విజయం సాధించాను, నీవు సారథివి వచ్చి తలుపుతీయాలని తెలియదా అని అడిగాడు కృష్ణుడిని. అంటే నేరుగా కృష్ణుడినుండే విన్నా, విశ్వాసం కలగలేదు. అందుకే భగవంతుడు నేను దేవుణ్ణి అని అనుకొనేట్టు రాడు, ఉపదేశాత్మకుడై ఎప్పుడూ ఉంటాడు. అందుకే భగవంతుణ్ణి శబ్దాత్మకుడు అని అంటాం. ఆయన విగ్రహ రూపాంలో ఉంటాడా, లేదా కదులుతూ ఉంటాడా అనేది ప్రశ్నే కాదు, ఆయన శబ్దాత్మకుడై ఎప్పడికీ మన మధ్య ఉంటాడు, ఆ శబ్దమే భగవద్గీత.

Popular Posts