మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. 'తమసోమా జ్యోతిర్గమయా' అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు.
'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే' ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు.
స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వేదన్తానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః /
వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్ న జానాతి గురుం వినా //
వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు.
భక్తుల కోరిక వలన మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.
మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి.
గురువు నిశ్చయంగా అవసరం. గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయకీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. సాధరణంగా సాధకులు తమ మనస్సులతో ఈశ్వరచింతన చేయుదురు. మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణములకు, మనోబుద్ధులకు అతీతమైన బ్రహ్మమును ఆత్మానుభవంగల ఆచార్యుని వలననే దైవతత్వం తెలుసుకోగలరు. 'తద్విజ్ఞానార్ధం స గురుమేవాభి గచ్చేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం' (ముండకోపనిషత్)
భవబంధాలచే ఆత్మవిస్మృతి కలిగియున్న జీవునకు ఆత్మావభోధమును గలుగజేయువాడే గురుదేవుడు. నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వచోట్ల సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు.