Followers

Thursday, 9 January 2014

శ్రీశైలం.. భూలోక కైలాసం



శ్రీశైలం.. భూలోక కైలాసం

భారతదేశ సంస్కృతీ చరిత్రలో మన రాష్ట్రం విశేష స్థానాన్ని కల్గి ఉంది. ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం ‘శ్రీశైలం’. శ్రీశైలం పేరు వినగానే ప్రతీ భక్తుడి మదిలో అవ్యక్తమైన భక్తిపూర్వక ఆనందం వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. సాక్షాత్తు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కొలువుదీరిన పుణ్యక్షేత్రమిది. పచ్చని ప్రకృతి అందాల నడుమ, ఆధ్యాత్మిక సుగంధ పుష్పంలా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ఓ పక్క అష్టాదశ శక్తి పీఠంగా, మరోపక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా ప్రసిద్ధిపొందింది. ఇక్కడ గాలి పవిత్రం. నేల పవిత్రం. ఆఖరికి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు సైతం పవిత్ర మనస్కులై రావాలన్నది స్వామి అభిమతం. అందుకే ఆ మహాదేవుని కరుణాకటాక్ష వీక్షణాలున్నవారే ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలుగుతారని ప్రతీతి. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రం మహాదేవుని లీలావిశేషాలకు తార్కాణంగా దర్శనమిస్తుంది.
కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకాలో నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య ‘పాతాళగంగ’ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. పనె్నండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో బ్రమరీ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం వేదాలకు ఆలవాలమై, అనంతమైన పుణ్యక్షేత్రాలతోను, 60కోట్ల తీర్థరాజాలతో మహర్షుల తపోవనాలతో, పుష్కరిణిలతో అనంతమైన ఓషధులతో పురాణ ప్రసిద్ధిచెందిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. భూలోక కైలాసంగా కీర్తిని పొందిన శ్రీశైల క్షేత్రం ఒకటవ శతాబ్దం నుంచీ నిత్యనీరాజనాలందుకుంటోందని తెలుస్తోంది.
పురాణ గాథ
శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.
ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది. దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి, మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు. అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు.
ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు. వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా, మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం. శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది. స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.
సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు ‘శివానంద’, ‘సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో, అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని, అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి. కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు
శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. ‘అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’ అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా. ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి. క్రీ.శ.9-10 దశాబ్దాలనుంచి 15వ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి.
శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. హైద్రాబాద్‌నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీశైలంలో భోజన వసతి సదుపాయాలు మెండుగా వున్నాయి.

Popular Posts