ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.
పరమేశ్వరుడు మహానందిలో శ్రీ మహానందీశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నారు.
మహానంది క్షేత్రం నంద్యాల కి 14కిలోమీటర్ల దూరంలో ఉంది.నంద్యాల కి చుట్టుపక్కల 15కిలోమీటర్ల దూరంలో నవనంది (నవ= తొమ్మిది + నంది) క్షేత్రాలు ఉన్నాయి. ఆక్షేత్రాలలో శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం విశిష్టమైనది.
మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ఫ్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది(విష్ణునంది) మరియు నాగనంది క్షేత్రాలే నవనంది క్షేత్రాలుగా కీర్తించబడ్డాయి.
ఈక్షేత్రంలో కోనేరు లో ఉన్న నీరు చాలా స్వచ్చంగా ఉన్నాయి. ఈక్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామిగా సన్నిధికి
ఎదురుగా ఒక కోనేరు, ప్రాంగణం బయట మరో రెండు కోనేరులు ఉన్నాయి.
ఈక్షేత్రంలో నవగ్రహాలకి దీపాలు వెలిగిస్తారు.
ఈక్షేత్రంలో మహానందీశ్వర స్వామి స్వయంభూలింగం.గర్భాలయంలో శివలింగం చిన్నగా ఉండి పైభాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయనమనోహరంగా దర్శనమిస్తారు.
పార్వతీదేవి కామేశ్వరిగా కొలువుదీరిఉన్నారు. కామేశ్వరిదేవి పచ్చని మోవితో, సర్వాభరణభూషితురాలై వరదహస్తంతో మంగళకరంగా దర్శనమిస్తారు.కామేశ్వరి దేవి కొలువైన ప్రాంగణంలో శిల్పకళ అపురూపం. ప్రాంగణం లోపల పైకప్పుపై సరస్వతీదేవి కచ్చపి ధరించి దర్శనమిస్తారు. రాతి స్థంభాలపై నాగకన్నియలు నిజంగానే చూస్తున్నట్లు ఉంది. పార్వతీ దేవి తనయులు వినాయక కార్తికేయులు కూడా దర్శనమిస్తారు.
ప్రక్కనే ఉన్న మరో ఆలయంలో సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్ర స్వామి ధవళ వర్ణంతో, ధగధగద్ధమాయంగా మెరిసిపోయే తిరువాభరణాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయ ముఖద్వారంవద్ద, ద్వారానికి మూడువైపులా చెక్కిన దశావతారాలు, హనుమ, గరుడాళ్వార్ దర్శనమిస్తారు.
ప్రాంగణం లోపల పైకప్పుపై మహావిష్ణువు శ్రీదేవితో కూడి ఖగరాజుపై అత్యంత వర్ణశోభితంగా దర్శనమిస్తారు. సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు కూడా దర్శించవచ్చు.
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ .....
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ .....
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
ఈప్రాంగణంలో ఉన్న రాతి స్థంభాలపై భారతమాత, నెహ్రు, గాంధి, జాతీయ జెండాని చెయ్యితిరిగిన శిల్పి చక్కగా మలిచారు.
శ్రీ మహానందీశ్వర స్వామివారి ప్రాంగణంలో వినాయకనంది కూడా దర్శనమిస్తారు.
శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయానికి కొంచెం దూరంలో గరుడనంది దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న విశేషం
గరుడాళ్వారి చిన్న లోహపు విగ్రహం, శివలింగం పానపట్టంపై ఉన్నారు.
గరుడనందిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సుధానంది(సిమెంటుతో చేసిన నంది) కనిపిస్తుంది. ఆ నంది లోపలికి వెళ్ళి చూడటానికి వీలుగా నంది విగ్రహం ఎడమవైపునుంచి ద్వారాన్ని కుడా ఏర్పాటుచేసారు.
నంద్యాల నుంచి మహానంది వెళ్ళే దారిలో, మహానంది గ్రామం మొదటిలోనే కృష్ణనంది(విష్ణునంది)ఆలయానికి దారి అని సూచికలు ఉన్నాయి.