Followers

Monday 13 January 2014

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం 

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.  
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి. 
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను  శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి,  ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప  ఆత్మసాక్షాత్కారం అవుతుంది.  
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి. 
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం. 
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.

Popular Posts