శ్రీ రామ భక్తుడైన హనుమ కు ఆయతోనే కలహం ఏర్పడింది .అది యుద్ధం వరకు వెళ్ళింది .యుద్ధం చేయాలన్న కోరిక లేక పోయినా శ్రీ రామ నామ మహిమతో సీతా పతి ని ఓడించి ,ఆయన అనుగ్రహాన్ని సంపాదించాడు .రాముడెక్కువా ,రామ నామం ఎక్కువా అనే సందేహం వచ్చింది .ఆ కధను తెలుసు కొందాం
వార నాసి అనే పట్టణం లో విశ్వనాధుడు కొలువై ఉన్నాడు .దానికే కాశీ అని పేరు . సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్ర మతి ని వేలం వేసిన ప్రదేశం ఇదే .విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన వేసిన ప్రదేశం ఇదే .ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు ,సత్య సంధుడు అయిన యయాతి మహా రాజు పాలిస్తున్నాడు .ఆతని పాలన లో ప్రజలు సుఖం గా రోగాలేవీ లేకుండా ఆనందం గా జీవిస్తున్నారు .ఒక సారి యయాతి మహారాజు అరణ్యానికి వేట కు వెళ్ళాడు .అక్కడ ఒక ప్రదేశం లో గౌతమ ,విశ్వామిత్రాది మహర్షులున్నారు .అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానం గా నారద మహర్షి సమక్షం లో జరుగు తోంది .అక్కడున్న వసిష్టుడు మొదలైన మునులకు నమస్కరిస్తూ మహా రాజు అక్కడి నుండి వెళ్లి పోయాడు .రామ నామ మహాత్యాన్ని లోకం లో చాటాలనే ఆలోచన అప్పుడు నారదునికి కలిగింది .వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్లి ”చూశావా మహర్షీ !వసిష్టుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే కాని యయాతి, విశ్వామిత్రాది అనలేదు .గమనించావా ?”అని పుల్ల వేశాడు ఇంకే ముంది అది అవమానం గా భావించాడు కోపిష్టి విశ్వా మిత్రుడు .యయాతి కి తగిన గుణ పాఠం చెప్పాలని నిర్ణ యించు కొన్నాడు .
కోపం తో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్యా నగరం చేరి శ్రీ రాముడిని సందర్శించాడు .రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుప మన్నాడు .ఆయన ”రామా !కాశీ రాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి ,మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి ,మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించ కుండా అవమానం చేసి వెళ్ళాడు .అతడు నీ భక్తుడే .అయినా ఉపేక్షించ కుండా ప్రతీ కారం చేసి నా పరాభావాగ్ని చల్లార్చు ”అన్నాడు .గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగి నట్లే నని రాఘవుడు భావించాడు .ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకొన్నాడు .వెంటనే ధనుస్సు ను చేతి లోకి తీసుకొని ,ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతి ని చంపుతానని ప్రతిజ్న చేశాడు . ఈ విషయాన్ని నారదుడు యయాతి కి తెలియ జెప్పాడు అతడిని కాపాడ గలిగింది శ్రీ రామ బంటు అయిన హనుమంతుడోక్కడే అని సలహా ఇచ్చాడు .
తన ప్రభువు తో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగం గా వెళ్లి హనుమ తల్లి అయిన అంజనా దేవి పాదాలపై పడ్డాడు.శరణు వేడాడు ..ఆమె మాత్రు హృదయం కరిగి ప్రాణ భయం లేదని అభయమిచ్చింది . .ఆమె హనుమ తో యయాతిని రక్షించ మని కోరింది .అప్పుడు అడిగారు వారిద్దరూ యయాతిని చంపాలని ప్రతిజ్న చేసింది ఎవరని .యయాతి విషయం అంతా వివరించి చెప్పాడు .రామ స్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు .కాని తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా .సరే నని యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు సరయూ నది ఒడ్డున యయాతి మహా రాజు ను కూర్చో బెట్టి యెడ తెరిపి లేకుండా శ్రీ రామ నామాన్ని జపించ మని యయాతి కి చెప్పి శ్రీ రాముని సందర్శించాడు మారుతి .”రామా ! నీ నామం జపించే వారినేవ్వరిని చంపను అన్న ప్రతిజ్న చేశావు నీవు జ్ఞాపకం ఉందా ?”అని అడిగాడు ”నా నామం జపించే వాడిని నేను సంహరిమ్పను ”అన్నాడు రాముడు . ..
శ్రీ రాముడు ఆ రోజూ సూర్యుడు అస్త మించే లోగా యయాతిని సంహరిస్తాను అని కొలువు కూటం లో చేసిన ప్రతిజ్న అయోధ్యా పుర వాసు లందరికి తెలిసి పోయింది .దీనితో బాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాటా అంతటా పాకి పోయింది .అందరు ఏం జరుగుతుందో అనే కుతూహలం తో సరయూ నది దగ్గరకు చేరారు .హనుమంతుడికి యయాతిని విడవమని సలహా ఇచ్చారు అందరు .ఇంతలో రాముడు సోదర సమేతం గా అక్కడికి చేరాడు .యయాతి ని విడిచి పెట్టమన్నాడు రాముడు .దానికి మారుతి ”రక్షించాటమే ధర్మం గా ఉన్న నీకు నేను సేవకుడిని .నువ్వు చేబట్టిన వ్రాతాన్నే నేనూ చేస్తున్నాను .యయాతిని చంపాలను కొంటె ,ముందు నన్ను చంపి ,ఆ తర్వాత అతన్ని సంహరించు .”అని విన్న వించి బిగ్గరగా రామ నామం చేస్తూ గద ను చేత్తో పట్టు కొన్నాడు .యుద్ధ సన్నద్దు డయాడు .రాముడు వేసిన బాణాలన్నీ హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్లి రాముని అమ్ముల పొది లోకి చేరి పోతున్నాయి .లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు .అవీ రామ నామం చేస్తున్న యయాతిని తాక కుండా అమ్ముల పోదిలోకే చేరి పోతున్నాయి .
ఇంతలో సూర్యాస్తమయం అయింది .శ్రీ రామాంజనేయ యుద్ధాన్ని నివారించటానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయాడు .”రామా ! వీరిద్దరూ నీ భక్తులు .నువ్వు చంపాలను కోన్నా వారిని చంప లేవు .”అని చెప్పాడు .యయాతి ని పిలిచి శ్రీ రాముని ప్రక్కన చేరిన విశ్వామిత్రునికి నమస్కరించ మని హితవు చెప్పాడు .అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు .అప్పడు నారద మహర్షి శ్రీ రామ చంద్రుని తో ”శ్రీ రామా ! నువ్వు గొప్పా నీ నామం గొప్పా అని లోకానికి తెలియ జెప్ప టానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను .నువ్వు అవతారం చాలించి వైకున్థం చేరితే ఈ లోకం గతి ఏమిటి ?రామావతార పరమార్ధం లోకం లో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం .శ్రీ హనుమ రోమ రోమం లో ,ప్రతి రక్త కణం లోను నీ రామ నామాన్ని జీర్ణించు కొన్న మహా భక్తుడు .యయాతి నీకు అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తుడు .నిత్య రామ నామ స్మరణ చేయనిది ఆహారం తీసుకోడు .సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీ రామ నామం మారు మోగుతూనే ఉండాలి .అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం .శ్రీ రామ నామం ప్రణవం గా మారి జీవ కోటి ని తరింప జేస్తుంది .ప్రజలంతా సీతా రాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తారు .మహర్షి విశ్వామిత్రునిదీ అదే అభి ప్రాయం .సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహాను భావుడికి లోక వాసనలున్టాయా?నీకు నీ నామానికి స్థిర యశస్సు కల్గించా టానికే ఆయన ఈ కలహం లో పాత్ర ధరించాడు .యయాతి ని ఆదరించు .నీ నామానికి అత్యంత మహిమ ను చేకూర్చిన అంజనా నందనుడైన ఆంజనేయుని మన్నించు .హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా ?” అన్నాడు నారదుడు .అందరుసంతోషించారు .హనుమంత యయాతులను ఆప్యాయం గా దగ్గరకు తీసుకొని శ్రీ రాముడు ఆలింగన భాగ్యం కల్గించాడు .అందరు శ్రీరామునికి జై ,శ్రీ ఆంజనేయుని కి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్లి పోయారు .