Followers

Thursday, 6 August 2015

రాజవిద్యారాజగుహ్యయోగః 1 (అథ నవమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత

శ్రీ భగవానువాచ :-

ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామ్యనసూయవే,
జ్ఞానం విజ్ఞానసహితం
యజ్జ్ఞా త్వా మోక్ష్య సే శుభాత్‌.


శ్రీ భగవంతుడు చెప్పెను :- (ఓ అర్జునా!) దేనిని తెలిసికొనినచో అశుభరూపమగు ఈ సంసార బంధమునుండి నీవు విడివడుదువో, అట్టి అతిరహస్యమైన, అనుభవజ్ఞానసహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేనివాడవగు నీకు లెస్సగా చెప్పుచున్నాను (వినుము).

******************************************************************************************* 1

రాజవిద్యా రాజగుహ్యం
పవిత్రమిదముత్తమమ్‌,
ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయమ్‌.


ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనదియు, రహస్యములలో కెల్లా అతిరహస్యమైనదియు, సర్వోత్కృష్టమైనదియు, పవిత్రమైనదియు, ప్రత్యక్షముగ తెలియదగినదియు, ధర్మయుక్తమైనదియు, అనుష్ఠించుటకు మిగుల సులభమైనదియు, నాశరహితమైనదియు, అయి యున్నది.

******************************************************************************************* 2

అశ్రద్దధానాః పురుషా
ధర్మస్యాస్య పరంతప,
అప్రాప్య మాం నివర్తంతే
మృత్యుసంసారవర్త్మని.


ఓ అర్జునా! ఈ (ఆత్మజ్ఞానమును) ధర్మము నందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందనివారై మృత్యురూపమైన సంసారమార్గమునందే మఱలుచున్నారు. తిరుగుచున్నారు. లేక నిక్కముగ వర్తించుచున్నారు .

*******************************************************************************************  3

మయా తతమిదం సర్వం
జగదవ్యక్తమూర్తినా,
మత్థ్సాని సర్వభూతాని
న చాహం తేష్వవస్థితః‌.


ఈ సమస్త ప్రపంచము అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపింపబడి యున్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియం దుండుటలేదు (నాకవి ఆధారములు కావు.).

*******************************************************************************************  4

న చ మత్థ్సాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్‌,
భూతభృన్న చ భూతస్థో
మమాత్మా భూతభావనః.


ప్రాణికోట్లు నాయందుండుననియుకావు. ఈశ్వర సంబంధమగు నా యీ యోగమహిమను జూడుము. నాయాత్మ (స్వరూపము) ప్రాణికోట్ల నుత్పన్న మొనర్చునదియు, భరించునదియునైనను ఆ ప్రాణుల యందుండుటలేదు. (వాని నాధారముగ జేసికొని యుండునది కాదు.) .

*******************************************************************************************  5

యథా కాశస్థితో నిత్యం
వాయుస్సర్వత్రగో మహాన్‌,
తథా సర్వాణి భూతాని
మత్థ్సానీత్యుపధారయ.


ఏ ప్రకారముగ అంతటను సంచరించునదియు, గొప్పదియునగు వాయు వెల్లప్పుడును ఆకాశమునందున్నదో, ఆ ప్రకరమే సమస్త ప్రాణికోట్లున్ను నా యందున్నవని తెలిసికొనుము.

*******************************************************************************************  6

సర్వభూతాని కౌంతేయ
ప్రకృతిం యాంతి మామికామ్‌,
కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్‌.


అర్జునా! సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని (మాయను) జేరి అందు అణగియుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును.

*******************************************************************************************  7

ప్రకృతిం స్వామవష్టభ్య
విసృజామి పునఃపునః,
భూతగ్రామమిమం కృత్స్న
మవశం ప్రకృతేర్వశాత్‌.


ప్రకృతికి (మాయకు, లేక స్వకీయ కర్మకు) అధీనమైయుండుట వలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మఱలమఱల సృష్టించుచున్నాను .

*******************************************************************************************  8

న చ మాం తాని కర్మాణి
నిబధ్నంతి ధనంజయ,
ఉదాసీనవదాసీన
మసక్తం తేషు కర్మసు‌.


ఓ అర్జునా! (ఆ ప్రకారము జీవులను సృష్టించినవాడనైనను) ఆ సృష్ట్యాది కర్మలయందు తగులు కొననివాడనై సాక్షిభూతుడుగ నుండునట్టి నన్ను ఆ కర్మ లెవ్వియు బంధింపనేరవు.

*******************************************************************************************  9


Popular Posts