Followers

Saturday, 8 August 2015

గుణత్రయవిభాగయోగః 3 ( అథ చతుర్దశోధ్యాయః, భగవద్గీత) -శ్రీ భగవద్గీత

నాన్యం గుణ్యేభ్యః కర్తారం
యదా ద్రష్టానుపశ్యతి,
గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోధిగచ్ఛతి.


ఎప్పుడు వివేకవంతుడు (సత్త్వాది) గుణముల కంటె నితరమును కర్తగా నెంచడో, మఱియు తన్ను గుణములకంటె వేఱగువానినిగ తెలిసికొనుచున్నాడో, అపుడాతడు నాస్వరూపమును (మోక్షమును) బొందుచున్నాడు.

******************************************************************************************* 19

గుణానేతానతీత్యత్రీన్‌
దేహీ దేహసముద్భవాన్‌,
జన్మమృత్యుజరాదుఃఖై
ర్విముక్తోమృతమశ్నుతే.


జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడుగుణములను దాటి (దాటినచో) పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు - అను వానిచేత లెస్సగా విడువబడినవాడై, మోక్షమును (మరణరహిత ఆత్మస్థితిని) బొందుచున్నాడు.

******************************************************************************************* 20

అర్జున ఉవాచ :-

కైర్లింగై స్త్రీంగుణానేతా
అతీతో భవతి ప్రభో,
కిమాచారః కథం చైతాం
స్త్రీంగుణానతివర్తతే.


అర్జునుడు పలికెను - ప్రభువగు ఓ కృష్ణా! ఈ మూడు గుణములను దాటిన వాడెట్టి లక్షణములతో గూడియుండును? ఎట్టి ప్రవర్తన గలిగియుండును? మఱియు ఈ మూడు గుణములను నాత డే ప్రకారము దాటివేయగల్గును?.

******************************************************************************************* 21

శ్రీ భగవానువాచ :-

ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాణ్డవ,
న ద్వేష్టి సంప్రవృత్తాని
న నివృత్తాని కాంక్ష తి.

ఉదాసీనవదాసీనో
గుణ్యైర్యో న విచాల్యతే,
గుణా వర్తంత ఇత్యేవ
యోవతిష్ఠతి నేజ్గతే‌.

సమదుఃఖసుఖః స్వస్థః
స్సమలోష్టాశ్మకాఞ్చనః,
తుల్యప్రియాప్రియోధీరః
స్తుల్యనిందాత్మసంస్తుతిః.

మానావమానయోస్తుల్య
స్తుల్యో మిత్రారిపక్షయోః‌,
సర్వారంభ పరిత్యాగీ
గుణాతీతస్స ఉచ్యతే‌.


శ్రీ భగవానుడు చెప్పెను:- ఓ అర్జునా! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణసంబంధమగు ప్రకాశమును (సుఖమును) గాని, రజోగుణసంబంధమగు కార్యప్రవృత్తినిగాని, తమోగుణ సంబంధమగు మోహమును (నిద్రాతంద్రలను) గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని ఆపేక్షింపడో, తటస్థునివలె ఉన్నవాడై గుణముల చేత (గుణకార్యములగు సుఖాదులచేత) చలింపజేయబడడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, (ఏ పరిస్థితులయందును) చలింపక నిశ్చలముగ నుండునో, మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గల వాడును, ఆత్మయందే స్థిరముగ నున్నవాడును, మట్టిగడ్డ, ఱాయి, బంగారము - వీనియందు సమబుద్ధిగలవాడును, ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును, (లేక కామ్యకర్మలన్నిటిని విడచువాడును, లేక సమస్తకర్మములను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయం దుండువాడును) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును.

******************************************************************************************* 22, 23, 24, 25

మాం చ యోవ్యభిచారేణ
భక్తియోగేన సేవతే,
స గుణాన్‌ సమతీత్యైతాన్‌
బ్రహ్మభూయాయ కల్పతే.


ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగము చేత సేవించుచున్నాడో అతడీ గుణములన్నిటిని లెస్సగా దాటివైచి బ్రహ్మముగా నగుటకు (జీవన్ముక్తుడగుట కొఱకు) సమర్థుడగుచున్నాడు.

******************************************************************************************* 26

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ
మమృతస్యావ్యయస్య చ,
శాశ్వతస్య చ ధర్మస్య
సుఖ స్యైకాంతికస్య చ.


ఏలయనగా, నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వతధర్మ స్వరూపమును, (దుఃఖమిశ్రితము కాని) నిరతిశయ (అచంచల) ఆనంద స్వరూరమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును (అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును) అయియున్నాను.

******************************************************************************************* 27


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, గుణత్రయవిభాగయోగోనామ, చతుర్దశోధ్యాయః


Popular Posts