సహ యజ్ఞాః ప్రజా స్సృష్ట్వా
పురోవాచ ప్రజాపతిః,
అనేన ప్రసవిష్యధ్వ
మేష వోస్త్విష్టకామధుక్.
పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతోగూడ ప్రజలను సృష్టించి 'ఈ యజ్ఞములచే మీరభివృద్ధిని బొందుడు. ఇవి మీ యభీష్టములను నెరవేర్చుగాక!" అని వారితో పలికెను.
******************************************************************************************* 10
దేవా ంభావయతానేన
తే దేవా భావయంతు వః,
పరస్పరం భావయంతః
శ్రేయః పర మవాప్స్యథ.
ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపఱచుడు. ఆ దేవతలున్ను మిమ్ములను (వర్షాదులచే) తృప్తినొందించుదురుగాక! ఈ ప్రకారముగ పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును బొందగలరు.
******************************************************************************************* 11
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా
దాస్యంతే యజ్ఞభావితాః,
తైర్దత్తాన ప్రదాయైభ్యో
యో భుజ్క్తేస్తేన ఏవ సః.
మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగముల నిత్తురు. అట్లు వారిచే నీయబడిన యాభోగ్యవస్తువులను తిరిగివారికి సమర్పింపకయే ఎవడనుభవించునో అతడు దొంగయే యగును.
******************************************************************************************* 12
యజ్ఞశ్శిష్టాశ్శిన స్సంతో
ముచ్యంతే సర్వకిల్బిషైః,
భుఞ్జేతే తే త్వఘం పాపా
యే పచంత్యాత్మకారణాత్.
యజ్ఞమునందు (భగవదర్పణముచేసి) మిగిలిన పదార్థములు తిను సజ్జనులు సమస్త పాపములనుండియు విడువబడుచున్నారు. అట్లుగాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో, అట్టివారు పాపమును తినువారే యగుదురు.
******************************************************************************************* 13
అన్నాద్భవంతి భూతాని
పర్జన్యా దన్న సంభవః,
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞః కర్మసముద్భవః.
కర్మబ్రహ్మోద్భవం విద్ధి
బ్రహ్మాక్షర సముద్భవమ్,
తస్మాత్సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్
ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి. అన్నము మేఘమువలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది. యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది. సత్కర్మ వేదముల వలన కలుగుచున్నది. వేదము అక్షరపరబ్రహ్మము వలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినదానినిగ నెఱుగుము.
******************************************************************************************* 14,15
ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః,
అఘాయు రింద్రియారామో
మోఘం పార్థ స జీవతి.
ఓ అర్జునా! ఈ ప్రకారముగ ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడనుసరించి వర్తింపడో, అతడు పాపజీవితమును గడుపువాడును, ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగ బ్రతుకుచున్నాడు.
******************************************************************************************* 16
యస్త్వాత్మరతిరేవ స్యా
దాత్మతృప్తశ్చమానవః,
ఆత్మన్యేవ చ సంతుష్ట
స్తస్య కార్యం న విద్యతే.
ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిబొందుచు, ఆత్మయందే సంతోషపడు చుండునో, అట్టి ఆత్మజ్ఞానికిక చేయదగినపని (విధి) యేదియును లేదు.
******************************************************************************************* 17
నైవ తస్య కృతేనార్థో
నాకృతేనేహ కశ్చన,
న చాస్య సర్వభూతేషు
కశ్చిదర్థవ్యపాశ్రయః
అట్టి ఆత్మజ్ఞాని కీ ప్రపంచమున కర్మచేయుటచే ప్రయోజనముగాని, చేయకుండుటచే దోషముగాని ఏదియును లేదు. మఱియు నాతనికి సమస్తభూతములయందును ఎట్టి ప్రయోజనము కొఱకైనను ఆశ్రయింపదగినది యేమియును లేదు.
******************************************************************************************* 18