యో యో యాం యాం తనుం భక్తః
శ్రద్ధయార్చితు మిచ్ఛతి,
తస్య తస్యాచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహమ్.
ఏ యే భక్తుడు ఏ యే (దేవతా) రూపమును శ్రద్ధతో పూజింప దలంచుచున్నాడో దానిదానికి తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగ గలుగజేయుచున్నాను.
******************************************************************************************* 21
స తయా శ్రద్ధయా యుక్త
స్తస్యారాధన మీహతే,
లభతే చ తతః కామాన్
మయైవ విహితాన్ హి తాన్.
అతడు (పైన తెలుపబడిన కామ్యభక్తుడు) అట్టి శ్రద్ధతో గూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు. మఱియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు.
******************************************************************************************* 22
అంతవత్తు ఫలం తేషాం
తద్భవత్యల్ప మేధసామ్,
దేవాన్ దేవయజో యాంతి
మద్భక్తా యాంతి మామపి.
అల్పబుద్ధి కలిగిన వారియొక్క ఆ ఫలము నాశవంతమైయున్నది. (ఏలయనగా) దేవతలను పూజించు వారు దేవతలనే పొందుచున్నారు. నా భక్తులు (నన్ను పూజించువారు) నన్నే పొందుచున్నారు.
******************************************************************************************* 23
అవ్యక్తం వ్యక్తిమాపన్నం
మన్యంతే మామబుద్ధయః,
పరం భావ మజానంతూ
మమావ్యయ మనుత్తమమ్.
నాశరహితమైనట్టియు, సర్వోత్తమమైనట్టియు, ప్రకృతికే పరమై విలసిల్లునట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు (ప్రపంచాతీతుడనగు) నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు.
******************************************************************************************* 24
నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయా సమావృతః,
మూఢోయం నాభిజానాతి
లోకో మా మజమవ్యయమ్.
యోగమాయచే బాగుగా కప్పబడియుండుటచే నేను అందరికిని కనిపించువాడనుగాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టక లేనివానినిగను, నాశరహితునిగను ఎఱుగరు.
******************************************************************************************* 25
వేదాహం సమతీతాని
వర్తమానాని చార్జున,
భవిష్యాణి చ భూతాని
మాం తు వేద న కశ్చన.
ఓ అర్జునా! నేను భూతభవిష్యద్వర్తమాన కాలమందలి ప్రాణులందఱిని ఎఱుగుదును. నన్ను మాత్రమెవడును ఎఱుగడు.
******************************************************************************************* 26
ఇచ్ఛాద్వేషసముత్థేన
ద్వంద్వమోహేన భారత,
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాంతి పరంతప.
శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! సమస్త ప్రాణులను పుట్టుకతోడనే రాగద్వేష జనితమగు సుఖ దుఃఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును బొందుచున్నవి.
******************************************************************************************* 27
యేషాం త్వంతగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్,
తే ద్వంద్వమోహనిర్ముక్తా
భజంతే మాం దృఢవ్రతాః.
పుణ్యకార్య తత్పరులగు ఏ జనులయొక్క పాపము నశించిపోయినదో, అట్టివారు (సుఖదుఃఖాది) ద్వంద్వ రూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు.
******************************************************************************************* 28
జరామరణ మోక్షాయ
మా మాశ్రిత్య యతంతి యే,
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న
మధ్యాత్మం కర్మ చాఖిలమ్.
ఎవరు వార్ధక్యమును, మరణమును (సంసార దుఃఖమును) పోగొట్టుకొనుటకొరకు నన్నాశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో, వారు సమస్త ప్రత్యగాత్మ స్వరూపమున్ను, సకల కర్మమున్ను ఆ బ్రహ్మమేయని తెలిసికొందురు.
******************************************************************************************* 29
సాధిభూతాధిదైవం మాం
సాధియజ్ఞం చ యే విదుః,
ప్రయాణకాలేపి చ మాం
తే విదుర్యుక్త చేతసః.
అధిభూత, అధిదైవ, అదియజ్ఞములతో గూడియున్న నన్నెవరుతెలిసికొందురో వారు దేహవియోగ కాలమందును (దైవమందు) నిలుకడ గల మనస్సుకలవారై (మనోనిగ్రహముకలవారై) నన్నెరుగగలరు.
******************************************************************************************* 30
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, విజ్ఞానయోగోనామ సప్తమోధ్యాయః