తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకమ్,
దదామి బుద్ధియోగం తం
యేన మాముపయాంతితే.
ఎల్లప్పుడు నాయందు మనస్సుగలవారై, ప్రీతితో నన్నుభజించునట్టివారికి - దేనిచే వారు నన్ను పొందగలరో అట్టి జ్ఞానయోగమును (ఆత్మానాత్మ వివేచనా శక్తిని) ప్రసాదించుచున్నాను.
******************************************************************************************* 10
తేషామేవానుకంపార్థ
మహమజ్ఞానజం తమః,
నాశయామ్యాత్మభావస్థో
జ్ఞానదీ పేన భాస్వతా.
వారలకు (అట్టిభక్తులకు) దయజూపుట కొరకు నేనే వారి యంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపము చేత, అజ్ఞానజన్యమగు అంధకారమును నశింప జేయుచున్నాను.
******************************************************************************************* 11
అర్జున ఉవాచ:-
పరం బ్రహ్మ పరం ధామ
పవిత్రం పరమం భవాన్,
పురుషం శాశ్వతం దివ్య
మాదిదేవమజం విభుమ్.
ఆహుస్త్వాం ఋషయస్సర్వే
దేవర్షిర్నారదస్తథా,
అసితో దేవలో వ్యాస
స్స్వయం చైవ బ్రవీషి మే.
అర్జునుడు చెప్పెను :- (ఓ కృష్ణా) మీరు పరబ్రహ్మస్వరూపులు, పరంధాముడవు (పరమపదస్వరూపులు లేక గొప్ప తేజస్స్వరూపులు), పరమపావనులు, మిమ్ము నిత్యులుగను, ప్రకాశస్వరూపులుగను, పరమపురుషులుగను, ఆది దేవులుగను, జన్మరహితులుగను, సర్వవ్యాపకులుగను, ఋషులందరున్ను దేవర్షియగు నారదుడున్ను, అసితుడున్ను, దేవలుడున్ను వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు. స్వయముగ మీరున్ను ఆ ప్రకారమే (నిన్ను గూర్చి) నాకు చెప్పుచున్నారు.
******************************************************************************************* 12, 13
సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ,
న హి తే భగవన్ వ్యక్తిం
విదుర్దేవా న దానవాః.
ఓ కృష్ణా! దేనిని మీరు నాకు చెప్పుచున్నారో ఇది యంతయు సత్యమని నేను తలంచుచున్నాను. ఓ భగవంతుడా! మీయొక్క నిజస్వరూపమును దేవతలు గాని, అసురులుగాని, ఎఱుంగజాలరు కదా!
******************************************************************************************* 14
స్వయమేవాత్మనాత్మానం
వేత్థ త్వం పురుషోత్తమ,
భూతభావన భూతేశ
దేవదేవ జగత్పతే.
ఓ పురుష శ్రేష్ఠా, సమస్త ప్రాణుల సృష్టికర్తా, సకల జీవుల నియామకా, దేవతలకు దేవుడా, జగన్నాథా, మిమ్ము మీరే యెరుగుదురు (మీ స్వరూపమితరులకు దుర్గ్రాహ్యమని భావము).
******************************************************************************************* 15
వక్తుమర్హస్యశేషేణ
దివ్యాహ్యాత్మ విభూతయః,
యాభిర్విభూతిభిర్లోకా
నిమాం స్త్వం వ్యాప్య తిష్ఠసి.
కావున ఏ విభూతులచే (మహాత్మ్యవిస్తారములచే) మీరీ లోకములన్నిటిని వ్యాపించియున్నారో అట్టి దివ్యములగు మీ విభూతులను సంపూర్ణముగ చెప్పుటకు మీరే తగుదురు.
******************************************************************************************* 16
కథం విద్యామహం యోగిం
స్త్వాం సదా పరిచింతయన్,
కేషు కేషు చ భావేషు
చింత్యోసి భగవన్మయా.
యోగేశ్వరా! నేనెల్లపుడును ఏ ప్రకారముగ ధ్యానించుచు మిమ్ము తెలిసికొనగలను? భగవంతుడా! ఏ యే వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలెను!
******************************************************************************************* 17
విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్దన,
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తి మేమృతమ్.
ఓ కృష్ణా! మీయొక్క యోగమహిమను, జగల్లీలా విభూతులను (ధ్యానింపదగిన వస్తువులను) సవిస్తరముగ మఱల తెలియజేయుడు. ఏలయనగ మీయొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు. (ఇంకను వినవలయునని కుతూహలము గలుగుచున్నది.).
******************************************************************************************* 18