Followers

Saturday, 8 August 2015

పురుషోత్తమప్రాప్తియోగః 2 ( అథ పంచదశోధ్యాయః, భగవద్గీత) -శ్రీ భగవద్గీత

ఉత్ర్కమంతం స్థితం వాపి
భుఞ్జానం వా గుణాన్వితమ్‌,
విమూఢా నానుపశ్యంతి
పశ్యంతి జ్ఞానచక్షుషః.


(ఒక శరీరము నుండి మఱియొక శరీరమునకు)బయలుదేరుచున్నవాడును లేక, శరీరమునందున్నవాడును, లేక విషయముల ననుభవించుచున్నవాడును, (సత్త్వాది) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు (తెలిసికొనజాలరు). జ్ఞానదృష్టిగలవారుమాత్రము చూచుచున్నారు (తెలిసికొనుచున్నారు.) (అనగా ఆయాక్రియలు జరుపుచున్నపుడాతనిని అజ్ఞ లెఱుగజాలరనియు, జ్ఞానులు మాత్రమెఱుగ గలరనియు భావము) .

******************************************************************************************* 10

యతంతో యోగినశ్చైనం
పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌,
యతంతోప్యకృతాత్మానో
నైనం పశ్యంత్యచేతసః.


(ఆత్మసాక్షాత్కారమునకై) ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు. (అనుభూతమొనర్చుకొనుచున్నారు) అట్లు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు.

******************************************************************************************* 11

యదాదిత్యగతం తేజో
జగద్భాసయతేఖిలమ్‌,
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ
తత్తేజో విద్ధి మామకమ్‌.


సూర్యునియందే తేజస్సు (ప్రకాశము, చైతన్యము) ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రుని యందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, ఇదియంతయు నాదిగా నెఱుగుము.

******************************************************************************************* 12

గామావిశ్య చ భూతాని
ధారయామ్యహ మోజసా,
పుష్ణామి చౌషధీస్సర్వా
స్సోమో భూత్వా రసాత్మకః‌.


మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్తప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటిని పోషించుచున్నాను.

******************************************************************************************* 13

అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః,
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్‌.


నేను 'వైశ్వానరుడ' ను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో గూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను.

******************************************************************************************* 14

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ,
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌.


నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను. నావలననే (జీవులకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱుపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేను అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడను గూడ నేనే అయియున్నాను.

******************************************************************************************* 15

ద్వావిమౌ పురుషౌ లోకే
క్షరశ్చాక్షర ఏవ చ,
క్షరస్సర్వాణి భూతాని
కూటస్థోక్షర ఉచ్యతే‌.


ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహముల (ఉపాదుల) అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు.

******************************************************************************************* 16

ఉత్తమః పురుషస్త్వన్యః
పరమాత్మేత్యుదాహృతః,
యో లోకత్రయమావిశ్య
బిభర్త్యవ్యయ ఈశ్వరః.


ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, (పైన తెలిపిన క్షరాక్షరులిద్దఱికంటెను) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.

******************************************************************************************* 17

యస్మాత రమతీతోహ
మక్షరాదపి చోత్తమః,
అతోస్మి లోకే వేదే చ
ప్రథితః పురుషోత్తమః.


నేను క్షరస్వరూపునికంటె మించినవాడను, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందు వలన ప్రపంచము నందును, వేదము నందును 'పురుషోత్తము' డని ప్రసిద్ధికెక్కి యున్నాను.

******************************************************************************************* 18

యో మామేవ మసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్‌,
స సర్వవిద్భజతి మాం
సర్వభావేన భారత.


ఓ అర్జునా! ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుగుచున్నాడో, అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో (సర్వవిధముల) నన్ను భజించుచున్నాడు.

******************************************************************************************* 19

ఇతి గుహ్యతమం శాస్త్ర
మిదముక్తం మయానఘ,
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్‌ స్యా
త్కృతకృత్యశ్చ భారత.


పాపరహితుడవగు ఓ అర్జునా! ఈ ప్రకారముగ అతిరహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు జెప్పితిని. దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడును, కృతకృత్యుడును కాగలడు.

******************************************************************************************* 20


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, పురుషోత్తమప్రాప్తియోగోనామ, పంచదశోధ్యాయః


Popular Posts