‘యజ్ఞ చేసేటప్పుడు రెండు అరణి కట్టెల్ని తెచ్చి రాపిడి చేసి అగ్నిని పుట్టించి, హోమాగ్నిని పుట్టిస్తారు. అలాగే ‘మనసు’ అనే ఒక కట్టెను ‘ఓం కారము’ అనే మరో కట్టెతో రాపిడి చేస్తే, ‘కుండలినీ శక్తి’ అనే అగ్ని పుట్టి షట్చక్రాలను దాటి సహస్రారం చేరినప్పుడు ‘మోక్షం’ లభిస్తుంది. అనంతమైన ఆనందం - మనం బతికి ఉన్నప్పుడు అనుభవించేదే మోక్షం.
అపాన వాయువు, ప్రాణవాయువు రెండింటినీ సమంగా చేసి లాగుతుంటే ఒక నాదం పుడుతుంది. ఈ నాదమే ఓంకాకం అని చెప్పబడింది. ఇది మనకు వినబడితే లక్ష్యం సిద్దించినట్టే. ఓం కారమే ధనస్సు ఆత్మయే బాణము పరబ్రహ్మమే లక్ష్యంగా చేసుకుని ఏకాగ్రతతో సాధన చేస్తే గమ్యాన్ని చేరతాము.ప్రణవము యొక్క ఉచ్ఛారణ మాత్రము చాలదని, దాని భావం కూడా మరల మరల చింతన చేయాలనే విషయం స్పష్టమవుతోంది. మంత్రార్దాన్ని భావించనిచో ఆ మంత్రం మనకు పూర్ణ ఫలితం ఇవ్వదు. అయితే ప్రణవార్ధం ఏమిటీ..? శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణ ప్రకారం ‘ఓం’ అనే శబ్థం అకార, ఉకార, మకార శబ్ధ సంయోగంతో ఏర్పడింది.
జాగ్రత్త్వ్సప్న సుషుప్తులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, విశ్వతైజస ప్రాజ్ఞులు, సత్వ, రజస్తమో గుణాలు మొదలగు వానిని అకార, ఉకార, మకారములు సూచించును. ఈ దృశ్య జగత్తు అంతటిలోను అనూన్య తమై వ్యాపించి దానికి ఆధారమై దాని కతీతంగా అర్థమాత్ర స్వరూపమై సర్వసాక్షిగా విలసిల్లు పరమాత్మయే తాను అని సాధకుడు ప్రణవ జపము చేసేటప్పుడు భావన చేయాలి. ప్రణవ ధ్యానం అంటే ఇదే..