దారిలో నడుస్తున్నప్పుడు ఏదైనా రాయి తగిలే అవకాశం అన్ని వేళ్లకూ ఉన్నా, బొటనవేలు కాస్త పెద్దది కాబట్టి దానికే తగిలే అవకాశాలు ఎక్కువ. అలా జరిగినప్పుడు ఏం చేయాలంటే...
రక్తస్రావం అవుతుంటే... మొదట శుభ్రమైన గుడ్డతో గాయాన్నంతా తుడిచేయాలి లేదా ధారగా పడుతున్న నీటి కింద ఉంచి గాయాన్ని శుభ్రం చేయాలి.
రక్తస్రావం ఆగేందుకు గాయం వద్ద చిన్న ఐస్ ముక్కను అదిమిపెట్టి ఉంచాలి.
గోరుగానీ లేచిందేమో చూడాలి. ఒకవేళ లేచి ఉంటే అది చర్మానికి అంటుకున్న మేరకే ఉంచి మిగతాదాన్ని గాయానికి ఏమాత్రం దెబ్బతగలకుండా కత్తిరించడం మంచిది.
అందుబాటులో ఉన్న యాంటీసెప్టిక్ క్రీమును గాయమైన ప్రాంతంలో రాసి, బ్యాండేజ్ కట్టాలి.
అవసరాన్ని బట్టి దెబ్బ తగిలిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంత అవసరం లేదని భావిస్తే పైన పేర్కొన్న ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఒక టెటనస్ టాక్సైడ్ (టీటీ) ఇంజెక్షన్ తీసుకుంటే చాలు.