Followers

Saturday, 28 September 2013

మీ వ్యక్తిత్వమే మీ ఆరోగ్యం

మన వ్యక్తిత్వంలోని లోపాలే మన శారీరక ఆరోగ్యాన్ని కూడా నిర్ణయిస్తాయంటే మీరు నమ్ముతారా? మనం చులాగ్గా ఉద్రేకానికీ, ఉద్వేగానికీ లోనయ్యేవారమైౖతే, తరచూ నరాల ఒత్తిడికి గురవుతుంటే, మన భౌతిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. మన చుట్టూ ఉండేవారివి కాక మన సొంత భావోద్వేగాలే మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆ సర్వేలు తేల్చాయి. ఓ వ్యక్తి మానసిక స్థితే ఆ వ్యక్తి శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని అధ్యయనకారులు చెప్పారు. అసలు మన వ్యక్తిత్వంలోని ఏయే లక్షణాలు కలిసి వస్తాయి? ఏయే పోకడలు చెరుపు చేస్తాయి అన్నది తేల్చుకోవాలి ముందు. మన శరీర రోగ నిరోధక శక్తిని మన వ్యక్తిత్వమే కుదురుగా ఉంచగలదని ఈ సర్వేలు తేల్చాయి.
ఒత్తిడులకు దూరంగా ఉందాం!
దీర్ఘకాలం ఒత్తిడికి లోనయ్యే వారికి జీవన సరళికి సంబంధించిన వ్యాధులు తొందరగా వస్తాయి. వాటిలో కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు, ఫ్లూ వైరస్‌, అధిక రక్త పోటు, మధుమేహం ఉన్నాయి. చిన్న చిన్న మోతాదులలో తరచూ ఒత్తిళ్లు కలుగుతుంటే, అడ్రినలిన్‌ గ్రంథిపై ప్రభావం పడుతుంది కాబట్టి ఒత్తిడిని ఉపేక్షించకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడి పోగొట్టుకోవడానికి చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వస్తే, మనం ముందుగానే రోజును ఎలా గడపాలన్నది ప్రణాళిక రూపొందించుకోవాలి. మన రోజువారీ కార్యకలాపాలలో ఎక్కువ సమయాన్ని తీసుకొంటున్న దేదో చూడాలి. అది మన ఇంటి నుంచి ఆఫీసుకు పట్టే ప్రయాణ సమయం అయితే, ఆ వ్యవధిని మన తప్పనిసరి ఫోన్‌కాల్స్‌, ఫైళ్ల పఠనం వంటివాటికి వినియోగించుకోవాలి. అప్పుడు మన ప్రయాణ సమయంలో చాలా భాగం ఆదా అయినట్లే!
ప్రశాంత చిత్తమే ఆరోగ్యప్రదాయని
ఆందోళనలతో ఉండేవారితో పోలిస్తే, నిమ్మళంగా ఉండేవారు డిమెన్షియా, అల్జమీర్స్‌ వ్యాధుల ప్రమాదానికి తక్కువ లోనవుతారు. అయిదు వందల మంది వ్యక్తులను ఐదేళ్లకు మించి అధ్యయనం చేయడం ద్వారా ఈ ఫలితాలను తేల్చారు. ప్రశాంతంగా ఉండే వారిలో డిమెన్షియా ప్రమాదం నిరాశా నిస్పృ హలతో ఉండేవారిలో కన్నా 50 శాతం తక్కువ.
మీ మీద మీకు అదుపు ఉంటే..
ముఖ్యమైన సమావేశాలకు ఆలస్యమవుతున్నారా? సమయపాలన సరిగ్గా ఉండడం లేదా? డెస్క్‌వర్క్‌ సరిగ్గా సమన్వయపరచలేకపోతున్నారా? పైకి ప్రమాదరహితంగా కనిపించే ఈ లక్షణాలు త్వరలోనే మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించవచ్చు. సరిగ్గా పనులు నిర్వర్తిస్తూ, స్వీయ క్రమ శిక్షణతో, అదుపుతో, సంతృప్తితో ఉన్నవారు ఆరోగ్యపరంగా మెరుగైన జీవితం గడుపుతున్నారు. చాలా విషయాల్లో ఆత్మ ప్రబోధం ప్రకారం నడుచుకొంటున్నవారు మద్యపానం, పొగ తాగడంలో మితంగా ఉంటున్నారు. ఫలితంగా వారికి అదనపు జీవితకాలం లభిస్తోంది.
డిప్రెషన్‌ మహమ్మారి
జీవితంలో పట్టించుకోనవసరం లేని చాలా విషయా లను తలచుకొని ఆందోళనపడేవారు మానసిక వ్యాకులతకు, నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. తోటివారి కన్నా ముందే మరణిస్తున్నారు. 1800 మంది పురుషులను 30 ఏళ్ళు అధ్యయనం చేసి రూపొందించిన ఓ నివేదిక ఈ విషయాన్ని చాటుతోంది. డిప్రెషన్‌, ఇతర న్యూరోటిక్స్‌ కూడా పొగ తాగడానికి కారణం అవుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. సిగరెట్‌ వల్ల ఆందోళన నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా, అది వ్యాధుల పాలు చేస్తుంది. కాబట్టి, పొగ తాగే అలవాటు మానేయాల్సిందే.
ఎక్కువ కాలం ఎలా జీవించగలం?
మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం లేకుండా ఉంటే చాలా తక్కువ కాలమే జీవిస్తామని మరో సర్వే తేల్చింది. డిమెన్షియా వ్యాధి లేని 1200 మంది వయోవృద్ధులను పరిశీ లిస్తే, జీవితానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నవారు అలాంటి లక్ష్యం లేనివారి కన్నా ఎక్కువ కాలం బతికారు. లక్ష్యశుద్ధి లేని చాలా మంది ఐదేళ్ల అధ్యయనకాలం గడవకుండానే మరణించారు. లక్ష్యశుద్ధితో జీవితం గడపాలనుకొనేవారు జీవితంలో ఎదు రయ్యే ప్రతిదాన్నీ సునిశితదృష్టితో చూస్తారు. దేనికీ ఆందోళన చెందరు. అర్థవంతమైన ప్రశాంత జీవితం గడుపుతారు. అదే వారికి దీర్ఘకాల జీవితాన్నిస్తోంది. అవగాహనతో వారు తమ కార్యకలాపాలనూ, ప్రవర్తననూ మలుచుకోగలుగుతారు కూడా! ఏది ముఖ్యమో, ఏది కాదో వారు ఇట్టే పసిగడతారు. లక్ష్యాలకు విలువనిచ్చే వారిలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి వేరుగా ఉంటుంది. వారికి గుండె ఆరోగ్యం బాగుంటుంది.
విచార మనస్కులు
ఎప్పుడూ విచారంతో ముఖం వేలాడేసుకొని ఉండేవారి దగ్గరకు ఎవరూ చేరరు. సుమారు 180 మందితో జరిపిన ఓ సర్వేలో ఆ మాదిరి విచార మనస్కులు ఇతరుల కన్నా త్వరగా మరణిస్తున్నట్లు తేలింది. ఇతరులపై ఎప్పుడూ అపనమ్మ కంతో ఉండే నిరాశావాదులు గుండె జబ్బుల పాలయ్యే అవకా శాలు ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. దురుద్దేశాలతో జీవించే వారు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు కాబట్టి, వారికీ ఇబ్బంది తప్పదు. అందుకే ఎప్పుడూ కూల్‌గా ఉందాం. 

Popular Posts