ఈ చరాచర సృష్టిలో జీవుల మనుగడకు పంచభూతాలే ప్రధానకారణం. ఆ సర్వేశ్వరుని ఆశీస్సులతో పంచభూతాలూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటాయి. వీటి లక్షణం ఒకదానికొకటి పరస్పర రేఖంగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు అగ్ని మంటలను రేపితే, ఆ మంటలను నీరు చల్లార్చుతుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఇవన్నీ కలిసి భయంకర ఉత్పాతాలనూ సృష్టిస్తుంటాయి. పంచభూతాలు కలసి చేసిన చాలామటుకు విధ్వంసకరమైనవే అయినప్పటికీ, అరుదుగా కొన్ని ఉపయుక్తంగానే ఉంటుంటాయి. ఆందుకు ప్రబల తార్కాణం ఖాండవ వన దహనం. నరనారాయణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ దహనానికి నేపథ్యంలో శ్వేతకి అనే రాజర్షి కథ ఉంది.
పూర్వం శ్వేతకి అనే రాజర్షి తన జీవిత పర్యంతం ఏదో ఒక యజ్ఞాన్ని చేస్తుండేవాడు. అయినప్పటికీ అతనికి ఎంతమాత్రం సంతృప్తి కలుగలేదు. మరో నూరు సంవత్సరాలపాటు మహాసత్రయాగం చేయాలని సంకల్పించి ఋత్విజులతో ఈ విషయాన్ని చెప్పాడు. అప్పటికే బాగా అలసిపోయిన ఋత్వికులు, తమ వల్ల కాదనీ, యాజకత్వాన్ని ఆ పరమేశ్వరుని కంటే గొప్పగా ఎవ్వరూ నిర్వహించలేరని, ఆయన్ని ప్రార్థించమని చెప్పారు. వారి మాట ప్రకారం, కైలాసగిరి చేరుకున్న శ్వేతకి, పరమశివుని గురించి త్రీవమైన తపస్సు చేయగా ప్రత్యక్షమైన గౌరీమనోహరుడు, విప్రులే యాజకత్వాన్ని చేయడానికి అర్హులని చెప్పి, పన్నెండేళ్ళు అమూల్యమైన ఔషధాలుగల ఖాండవవనాన్ని దహించితే ఉపశపనం కలుగుతుందని చెబుతాడు. వెంటనే ఖండవ అరణ్య దహనం ప్రారంభించిన అగ్నికి చుక్కెదురైంది. అగ్ని దహన కార్యక్రమం ప్రారంభించిన వెంటనే మేఘాలు వర్షించి అర్పేయసాగాయి. తన దుస్థితిని మరలా బ్రహ్మ దగ్గర విన్నవించుకున్నాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుని వేదన విన్న బ్రహ్మ, అధైర్యపడవలసిన అవసరం లేదని, త్వరలోనే దేవహితార్థమై నరనారాయణులు అర్జునవాసుదేవులుగా భూలోకంలో అవతరించనున్నారని, వారు ఖాండవ వన సమీపంలో విహరిస్తున్నప్పుడు, అగ్ని అభిమతం నెరవేరగలదని ఊరడించాడు.
అలాగే నరనారాయణులు ఈ భూలోకంలో ఉద్భవించడం జరిగింది. మాయాజూడంతో అడవుల పాలైన పాండవులను చూసేందుకు వచ్చిన కృష్ణునితో అర్జునుడు, వేసవి మహాతీవ్రంగా ఉందనీ, కాస్తంత ఉపశమనం కోసం యమునా నదీతీరానున్న ఖాండవవనానికి వెళ్ళి సేదతీరితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. అందుకు శ్రీ కృష్ణుడు సమ్మతించడంతో ఖాండవవనం వైపు వెళ్లారు. అప్పటివరకు వారి రాకకోసం వేచియున్న అగ్నిదేవుడు, తన దుస్థితిని వివరించగా, నరనారాయణులు అగ్నిదేవునికి సాయపడేందుకు తమ సమ్మతిని తెలియజేశారు.
వెంటనే అగ్నిదేవుడు పెను జ్వాలలతో ఖాండవవనాన్ని దాహించడం ప్రారంభించాడు. చక్రాయుధం పట్టిన దేవకీ నందనుడు, గాండీవం ధరించిన సవ్యసాచి, ఆ మహా అరణ్యాకి ఇరువైపులా నిలిచి, నిరంతర జాగరూకులై అగ్నిదేవునికి ఎటువంటి అంతరాయం కలగకుండా కాపాడసాగారు. పెనుమంటలలో పది మరణిస్తున్న ప్రాణికోటి భీకర ఆర్తనాదాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు, దేవేంద్రుని దగ్గర నివేదించారు. ఆ ఖాండవవనంలోని తక్షకుడు దేవేంద్రుని మిత్రుడు. తన మిత్రుడు అగ్నిజ్వాలలలో మాది మసై పోకూడదన్న ఆత్రుతతో కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ ఫలితం కనపించక పోవడంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దానిని అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఎదుర్కొన్నాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయిన గరుదులు, పన్నగులు, గంధర్వులు, యక్షులు వివిధ శస్త్రాస్త్రాలతో వాసుదేవార్జునులతో తలపడ్డారు. గాండీవి విల్లెక్కుపెట్టి, శౌరి తన చక్రాయుధంతో ప్రత్యర్థులను హతమార్చారు. కుపితుడైన దేవేంద్రుడు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పుడు ఆశరీరవాణి దేవేంద్రునితో, తక్షకునికోసం చింతించనవసరంలేదనీ, అతడు కురుక్షేత్రంలో తలదాచుకున్నాడనీ, కనుక స్వర్గలోకానికి మరలి పోమ్మన్ని చెబుతుంది. అలా ఖాండవ దహనం నరనారాయణులచే జరుపబడింది.