చాలా మంది అనుకున్నట్టుగా, ప్రపంచంలో మిగతా మతాల మాదిరిగా కాకుండా వైదిక మతం శాస్త్ర విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. హిందువులకు ముఖ్యమైన మత గ్రంధాలు వేదాలు. 'వేదం' అనే పదం 'విత్' అనే ధాతువు నుండి వచ్చింది. విత్ అంటే 'జ్ఞానం' అని అర్థం. మానవ సమాజం యొక్క మొదటి మెట్టు జ్ఞానంతోనే మొదలయిందని దీని అర్థం. మనిషి నాగరికత మొదటి అడుగు వేసింది నిప్పును కనిపెట్టడంతోనే అని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి ప్రాచీనమైన గ్రంధమైన ఋగ్వేదం 'అగ్నిమీళే పురోహితమ్' అనే అగ్ని దేవుని ఋక్కు (ప్రార్థన)తో మొదలయింది. హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. ప్రశ్నించడం జ్ఞానం తెలిసిన వాడి హక్కు. ఫలానా గ్రంధంలో ఇలాగే ఉంది కాబట్టి దాని గురించి మీకు ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని ఎవరూ అనలేరు. ప్రశ్నించ గల నేర్పు, ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చునో కూడా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నాయి. అదే 'తర్కశాస్త్రం' - వేదాంగాలలో ఒకటి. వేదాంతమైన ఉపనిషత్తు కూడా గురు శిష్యుల మధ్య సంవాద రూపంలో ఉంటాయి. అంటే శిష్యుడు తనకు వచ్చిన ఒక అనుమానాన్ని గురువుని అడుగుతాడు. దానికి గురువు చక్కటి, సమాధానం చెబుతాడు. ఒకవేళ గురువుగారు చెప్పిన సమాధానంతో శిష్యుడు తృప్తి పడకపోతే, లేదా ప్రక్కనున్న మరో శిష్యుడికి దానికి సంబంధించిన మరో అనుమానం వస్తే, మరల గురువుగారిని తన ప్రశ్నని గురించి అడగవచ్చు. ఈ విధంగా మనం ఇపుడు చెప్పుకుంటున్న గ్రూప్ డిస్కషన్స్ ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చల ద్వారా వేద విషయాలలోని సంక్లిష్టత అందరికీ అర్థమయ్యే సులభ భాషలో ఉపనిషత్ రూపంలో భద్రపరచబడింది. ఉపనిషత్తులలో లేని అంశమంటూ లేదు. ఈ సృష్టి ఏర్పడిన విధానం - భగవంతుని గుణ గణాలు - ఆయన రూపం - ఆత్మ - పరమాత్మ - వీరిద్దరికీ గల సంబంధం - ప్రకృతి శక్తులు ఏమిటి - మనిషికి ప్రకృతికిగల సంబంధం - జననం - మరణం - పునర్జన్మ - వీటి రహస్యాలు ఇలా మనిషికి వచ్చే ప్రతీ అంశం గురించి ఉపనిషత్తులలో కూలంకంషంగా అధ్యయనం చేసారు - మన ప్రాచీన ఋషులు, యోగులు.
మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. అందుకే ఏ భాషలోనైనా అమ్మని పిలిచే పిలుపులో 'మ' అనే అక్షరం తప్పని సరిగా ఉంటుంది. మన జన్మకి కారకుడైన పురుషుడిని తండ్రిగాను, వీరందరినీ ఒక కుటుంబంగా వ్యవహరించాలని, నిత్యం మనం చేయవలసిన పనులు, సమాజం నడవడిక ఎలా ఉండాలో, రాజు ఎలా పరిపాలించాలో అన్నీ తెలిపింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. ఇక వేదం జ్ఞానాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది?
ఇదే కాకుండా ఈ రోజు ఆధునిక ప్రపంచానికి వచ్చే అనేక రుగ్మతల నుండి విముక్తి ప్రసాదిస్తున్న అతి ప్రాచీన - ఋషి ప్రసాదిత - యోగ విజ్ఞానం కూడా వేద కాలంలోనే రూపొందించబడింది. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి - ఏఏ నాడి పని తీరు ఎలా ఉంటుంది - ఏమి చేస్తే ఆయా అంగాల తీరుని మెరుగుపరచుకోవచ్చును - మనిషి తన ఆరోగ్యం కోసం ఏమి చేయాలి - ఇత్యాది విషయాలన్నీ యోగ శాస్త్రంలో నిబిడీకృతతం చేయబడ్డాయి. అవన్నీ కనిపెట్టడానికి ఇప్పటి వైద్య శాస్త్రానికి మరో వందేళ్ళ కాలం పట్టవచ్చు. ఇది అతిశయోక్తి కాదు - సంపూర్ణమైన నిజం. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన సత్యం. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం లోక క్షేమమే తమ పరమావధిగా తలచి మానవాళి మొత్తానికి ప్రాచీన ఋషి పుంగవులు అందించిన కల్తీ లేని, వ్యాపార ధృక్పదం లేని నిజమైన జ్ఞానం.
భరధ్వాజుని వైమానిక శాస్త్రం - శుశ్రుతుని శస్త్ర విద్య పరిజ్ఞానం (ఆపరేషన్) - వరాహమిహిరుడు, ఆర్యభట్ట మొదలగు వారి ఖగోళ శాస్త్రం, భాస్కరుని లీలా గణితం (ప్రపంచంలో మొట్టమొదటి ఆల్జీబ్రా గణితం) - పాణిని వ్యాకరణ సూత్రాలు (మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్), ప్రపంచానికే తలమానికమైన దశాంశ పద్దతి వాడుక, అంకెల్ని కనిపెట్టడం, సున్నాని కనిపెట్టడం - ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రీయమైన క్యాలండర్ రూపకల్పన - ఋతువుల విభజన - ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతు ఉండదు. ఇవన్నీ ఎందుకు - రెండేళ్ళ తరువాత గ్రహణం ఎప్పుడు వస్తుందో ఖగోళ శాస్త్రవేత్తని లేదా ప్లానిటేరియం వాళ్ళని అడిగి చూడండి - వాళ్ళు చెప్పలేరు. కాని ఎక్కడో రేలంగిలో ఉన్న తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారినో మరో ప్రఖ్యాత సిద్ధాంతి గారినో అడిగి చూడండి - ఖచ్చితంగా లెక్కలు వేసి - కూర్చున్న చోట నుండి లేవకుండా సమాధానం చెప్పగలరు. అది కూడా ఎలా - గ్రహణం ఏ రోజు, ఎన్ని ఘడియల - ఎన్ని విఘడియలకు మొదలవుతుంది - ఆ సమయంలో గ్రహ స్థితి ఏమిటి - ఎన్ని గంటల ఎన్ని నిముషాల పాటు ఆ గ్రహణం ఉంటుంది - దాని స్పర్శా కాలం ఎంత - సంపూర్ణ గ్రహణం ఎంత సేపు ఉంటుంది ఇలా పూర్తి వివరాల్ని సంపూర్ణంగా అందించగలరు. ఇంతటి అద్భుతమైన ఖగోళ పరిజ్ఞానం ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఏ ఒక్క సమాజానికి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. పైగా ఇదంతా కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేని (మనం అనుకుంటున్నాం- నిజమో కాదో తెలియదు) ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు వ్రాసి ఉంచిన శాస్త్రాల ఆధారంగా గణించి చెప్పినటువంటిది. అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతటి అద్భుతమైన కృషి జరిగిందో ఇటే ఊహించవచ్చు.
మిగతా మతాల్లో జ్ఞానం అనేది ఒక నిషిద్ధ ఫలం. జ్ఞానాన్ని తెలుసుకోవడం దేవుడిని ఎదిరించడమే. అందుకే ఆడమ్, ఈవ్‌లు సాతాను మాట విని నిషిద్ధ జ్ఞాన ఫలాన్ని తిని దేవుని శాపానికి గురయ్యారు. కాని వైదిక మతంలో జ్ఞానమే రాజమార్గం. భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం. జ్ఞానిగా మారినవారు దేవునికి ఇష్టులవుతారు. వారు ఎప్పటికైనా భగవంతునిలో ఐక్యమవుతారంటోంది వేదం. అలా నేను అనే అహంకారం నశించి, భగవంతునిలో ఐక్యమవ్వడమే మోక్షం.
ఇప్పటి తరం దేన్నయితే నిజమైన అభివృద్ధిగా భ్రమపడుతుందో - ఏ ప్రకృతి వినాశనాన్ని వ్యాపారం అనుకుంటున్నదో - ఏ శారీరక మానసిక అనారోగ్యాన్ని నాగరికత అనుకుంటున్నదో అటువంటి ప్రయోగాలన్నీ దీర్ఘకాలంలో మనిషి మనుగడకు, తద్వారా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అందుచేత అటువంటి పరిజ్ఞానాన్ని ప్రాచీన కాలంలోనే సామాన్య ప్రజలకు అందకుండా చేశారు దీర్ఘదర్శులైన మన మహర్షులు.
మరి ఇంతటి అద్భుతమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న భారతీయులు ఎందుకు మిగతా జాతులకి బానిసగా మారవలసి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రపంచానికే మార్గదర్శి అయిన భారత దేశం ఒక సామాన్య దేశంగా ఎందుకు మిగిలిపోయింది - భారతీయులంతా పర జాతికి తొత్తులుగా మారి వారు చెప్పిందే వేదంగా చెలామణీ అవుతూ - వారి నాగరికత (?)ను అనుసరిస్తూ, అనుకరిస్తూ, తమ మూలాల్ని మరచిపోయి - ఒక నిస్సత్తువ జాతిగా మారి తమని తాము నిత్యం కించపరుచుకుంటూ - స్వార్థ పరంగా జీవిస్తున్నారు? వీటి గురించి నా తరువాతి పోస్టులో వివరిస్తాను.
అంత వరకు 'సర్వేజనా సుఖినోభవన్తు'.