Followers

Thursday, 19 September 2013

‘కుంకుమ’ను ఎందుకు ధరించాలి?

కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించినది.


కుంకుమ పెట్టుకోవడం హిందూ సంప్రదాయం! అన్ని కులాల హిందువులు, శైవ వైష్ణవ మతస్థులు అందరూ నొసటన కుంకుమ ధరించటం గొప్పగా భావిస్తారు.

కుంకుమ ఆస్తికత చిహ్నం!

ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకూ హిందూ మతస్థులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం బలీయంగా వుండేది. ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వుండేది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని గూడా నొసట ధరించటం హిందూ సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు పూర్వీకులు. 

రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదిటివద్ద ‘ఇడ’ ‘పింగళి’ నాడులు కలిసి ‘సుషుమ్న’ నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమ దిద్దుకొంటాం. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టిదోషం తగుల కుండా వుంటుందని కూడా ఒక నమ్మకం వుంది. మరొకటి ఏమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికీ ఎదుటివారు మానసికంగా లొంగి పోతారన్న (సైకాలజీ) వాదన కూడా వుంది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగ తత్వాన్ని, నిర్భయత్వాన్నీ, పరోప కారగుణాన్ని కల్గిస్తాయన్న ‘థియరీ’ కూడా ఉంది.

కుంకుమ ధరించటం పవిత్రతకు, ఆస్తికత్వానికి ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్తీలకు ఐదవ తనానికీ, సౌభాగ్యానికీ, స్థిరబుద్ధికీ సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చినదగ్గరనుండీ కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది.

భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికీ అందంగా తాము కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే కుంకుమ ధారణను త్యజిస్తారు. కుంకుమ భారతీయతకు చెరుగని ముద్ర. పాశ్చాత్య నాగరికత మనమీదకు దాడిచేసిన తరువాత పురుషులందరూ కుంకుమధారణ మరిచిపోయారు. ఇంకాకోంతకాలానికి స్త్రీలు కూడా మర్చిపోవచ్చునేమో! దేవుళ్లు మాత్రమే మిగుల్చుకుంటారేమో! ఎవరికి తెలుసు?

కాలం తెచ్చే మార్పులు వింత సంటగా వుంటాయి.

Popular Posts