Followers

Friday, 13 September 2013

కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటే లేకుండా పోయింది. కూర్చున్నచోటు నుంచి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయడం మామూలైపోయింది. ఇలా ఎక్కువసేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయంతోపాటు మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. 



మోకాళ్ల నొప్పులకు కారణాలేంటి..? ప్రధానంగా మోకాళ్ల జాయింట్ మధ్యలో ఉన్న మృధులాస్తి, సైనోవియల్ ఫ్లూయిడ్‌లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటుచేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధికబరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ల నొప్పులు తీవ్రరూపం దాల్చుతాయి.
గమనించడం ఎలా...? 
మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్లు బాగా నొప్పెడతాయి. అదే
విధంగా కూర్చొని పైకి లేచేటపుడు మోకాళ్లు పట్టుకుపోతాయి. ఉదయంపూట లేవగానే నడిచేందుకు మోకాళ్లు సహకరించకుండా ఉంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ల వద్ద చిన్నచిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ కూడదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.... 
ముఖ్యంగా కుర్చీని అంటిపెట్టుకుని పనిచేసేవారు కనీసం గంటకోసారైనా ఓ పది నిమిషాలు అలా అటూఇటూ నడవడం చేయాలి. ఇక స్థూలకాయం కలిగి ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే... ఉప్పు, వంటలలో నూనె మోతాదులను తగ్గించుకోవడం మంచిది.

మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలి. క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. మంచినీళ్లు సరిపడినన్ని తాగుతుండాలి. కొంతమంది పనిలోపడితే గొంతు పిడచకట్టుకపోతున్నా తలతిప్పరు. ఆ అలవాటును మానుకుని ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా లేకపోతే పనిని కూడా సమర్థవంతంగా చేయలేరు. నాణ్యత తగ్గుతుంది.

ఇక అన్ని జబ్బులకు మంచి మందు వ్యాయామం. వ్యాయామం, నడక వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. తద్వారా మోకాళ్ల నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Popular Posts