.
‘‘సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతిః’’. ఏడుకోట్ల మంత్రరాశికి మూలమైనవాడు అని గణపతి సహస్రనామాలలోని మాట. ఆ మంత్రరాశియే స్వామివారి లంబోదరం. వేదమంత్ర స్వరూపుడు కనుక ఈతడు బుద్ధిశక్తికి అధిష్టానదేవత కూడా. స్వామినామాలే గణపతి తత్త్వాన్ని తెలుపుతాయి.
వక్రతుండ: వక్రతలను తొలగించువాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధి సిద్ధిని కల్గించవు. ఆ వంకరలను హరించే స్వామి గణపతి.
ఏకదంత: ‘ఏక’ అనగా ప్రధానం. ‘దంత’ అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం – దక్షిణ భాగం ఏకదంతం.
వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు వినాయకుడు. ఈతనికి నాయకుడు ఎవడూలేడు – విగతనాయకః – కనుక ఈతడు వినాయకుడు.
హేరంబ: ‘హే’ శబ్ధం దీనవాచకం. ‘రంబ’ పాలవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్త్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయా వికారాలనే పొల్లుని తొలగించి, సారమైన బ్రహజ్ఞానాన్ని మిగిల్చే తత్త్వమిది. బ్రహవిష్ణు రుద్రాది దేవతలు సైతం తమతమ విశ్వనిర్వహణ కార్యాలకు ఆరంభంగా గణపతిని కొలుస్తారని పురాణ ప్రతీతి. సర్వదేవమయుడైన గణేశుని అనేక రూపాలను వేదపురాణాగమనాలు పేర్కొన్నాయి.
‘కంఠోర్ధ్వంతు పరబ్రహ్మా – కంఠాధస్తు జగన్మయః’, ఈశ్వర జ్ఞానంతో, నడిచే జగం... ఈ రెండు కలిసిన విశ్వరూపమే వినాయక స్వరూపం. ‘ప్రణవ స్వరూప వక్రతుండం వాతాపి గణపతిం’ అని ముత్తుస్వామిదీక్షితార్ కృతి.
అదేవిధంగా ‘గణపతి’, ‘గణేశ’ నామాలలో కూడా ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంటుంది. అనంత విశ్వాన్ని చూస్తే, అందులో ఎన్నో గణాలు. నక్షత్ర గణాలు, గ్రహ గణాలు, వాయువుల గణాలు. అలాగే భూమి ఒక గ్రహం, అందు అనేక గణాలు. వృక్ష గణాలు, నదీ గణాలు, పర్వ గణాలు, పక్షి గణాలు, జంతు గణాలు, మనుష్య గణాలు. వాటన్నింటిలోనూ మరెన్నో గణాలు. ఈ విభిన్న గణాలంతా వ్యాపించి ఉన్నది పరమేశ్వర చైతన్యమే. మన శరీరంలో కూడా ఇంద్రియ గణాలు, ఉప గణాలు, గుణగణాలు ఎన్ని ఉన్నా అంతా కలిపి నేను అనే ఆత్మ చైతన్యం ఎలాగో, విశ్వవిశ్వాంతరాళలలో వ్యాపించిన భిన్నత్త్వంలోని ఏకత్త్వమే గణపతి తత్త్వం.
‘ఏకం సత్’, ‘ఏకం పరబ్రహ్మ’, ‘ఏకం దైవతం’ అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏక చైతన్యమే ‘గణేశుడు’.