ఈనాడు భగవంతుని గురించి వినడానికి ప్రజలు తండోపతండా లుగా వస్తున్నారు. అయినా వారిలోని అశాంతిని పారదోలుకోలేకుండా వున్నారు. ఎన్నో ఉపదేశాలు వింటున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా చేస్తున్నారు. అయినా వారిలో శాంతి లేదు. వినడమొక్కటే సరిపోదు. భక్తితో భగవంతుడిని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది. మనఃపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించే వారికి అసంతౄఎప్తి అనేది వుండదు. తన గురించి మనకెంత తెలుసునని ఆయన ఆలోచించడు, ఆయనకోసం మనమెంత తపిస్తున్నామనేదే ఆయన వీక్షణ. దేవుడు మన భక్తి విషయంలో సదా మేల్కొనేట్టుగా మన పూజలు వుండాలి. అంతేగానీ ఉన్నాడో లేడోనని పదిమందిని పోగేసి మీమాంసలు చేయవద్దు.
సంశయాత్ములకు భగవంతుడు సందేహాస్పదుడే! దైవ కార్యాలకు వచ్చే విఘ్నాలను దైవమే పోగొట్టాలి. తన శక్తి పైన గాక పరమాత్మ శక్తి పైన ఆధారపడి జీవించే వాడు భక్తుడు. మూడవ నేత్రం ముక్కంటికే గాదు, మనుష్యులందరికీ ఉంది. అదే జ్ఞాన నేత్రం. ఎవరికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారు గర్వాన్ని దగ్ధం చెయ్యగలరు. ‘సర్వం జ్ఞాన ప్లవే నైవ వృజినం సంతరిష్యసి’ జ్ఞానమనే తెప్పచే పాపరాశిని దాటగలవని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం వుంచిన వాడికి జగమంతా వెలుగులే!