Followers

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 2



సీ. రాజేంద్ర! విను సుధా! రాశిలో నొక పర్వ
తము త్రికూటంబున| దనరుచుండు
యోజనాయతమగు| నున్నతత్వంబును
నంతియ వెడలుపు| నతిశయిల్లు
గాంచనాయస్సార| కలధౌత మయములై
మూడు శృంగంబులు| మొనసియుండు
దటశ్రంగ బహురత్న| ధాతుచిత్రతములై
దిశలు భూనభములు| దేజరిల్లు

తే. భూరి భూజ లతాకుంజ| పుంజములను
మ్రోసి పఱతెంచు సెలయేటి| మొత్తములును
మరిగి తిరిగెడు దివ్యవిమానములును
జఱుల గ్రీడించు కిన్నర| చయము గలిగి


తా!! ఓ రాజేంద్రా! శ్రద్ధగా వినుము. పాలసముద్రములో త్రికూటమనే పర్వతమొకటి గలదు. ఒక యోజనమంత వెడల్పుతోనూ అంతే ఎత్తుతోను మిక్కిలి సుందరముగా నొప్పారుచున్న ఆ పర్వత శ్రంగములు బంగారు, వెండి, ఇనుము మొదలగు విలువైన ఖనిజ ధాతువులతోను, గైరికాది ఖనిజములతోను కూడి మిక్కిలి చిత్ర విచిత్ర వర్ణములతో మూడు శిఖరములతో ప్రకాశిస్తోంది. బహు విధమైన వృక్షములు, లెక్కలేనన్ని పొదలు, గలగల పారే సెలయేళ్ళ ధ్వనులతో శృంగార యుక్తమైన ఆ త్రికూట పర్వతముపై దేవతలు విహరించేవారు. కొండచరియలలో కిన్నెర కింపురుషాదులు విహారము చేసేవారు. పుణ్యపురుషులకాలవాలమై ఆ త్రికూట పర్వతము మిక్కిలిగా నొప్పారుచున్నది.

*******************************************************************************************  7

వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ
భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళవట
కుజట కుందకురువక కురంటక కోవిదారఖర్జూరనారికేళ సింధు
వార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ
మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల
ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీకపిత్థ
కాంచనకందరాళశిరీష శింశుపాశోక పలాశ నాగపున్నాగ
చంపకశతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరం
తర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవితకోరకిత
కుసుమిత ఫలిత లలిత విటపవిటపి వీరున్నివహాలంకృతం
బును, మణివాలుకానేక విమల పులిన తరంగిణీ సంగత
విచిత్ర విద్రుమలతామహోద్యాన శుక పిక నికర నిశిత
సమంచిత చంచూపుటనిర్దళిత శాఖిశాఖాంతర పరిపక్వఫల
రంద్రప్రవర్షితరసప్రవాహబహుళంబును, గమనీయ సలిల కాసార
కాంచన కుముద కళ్హార కమల పరిమళ మిళిత కబళాహార
సంతతాంగీకార భారపరిశ్రాంత కాంతా సమాలింగిత
కుమారమత్త మధుకరవిటసముదాయ సమీప సంచార సము
దంచిత శకుంతకలహంస కారండవ జలకుక్కుట చక్ర
వాక బక బలాహక కోయష్టిక ప్రముఖముఖరజలవిహంగవిసర వివిధ
కోలాహలబధిరీభూత భూనభోంతరాళంబును, తుహినకర
కాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక
పుష్యరాగ మనోహర కనక కలథౌతమణిమయానేక శిఖర
తట దరీ విహారమాణ విద్యాధర విబుధ సిద్ధచారణ గరుడ
గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరససల్లాప
సంగీత ప్రసంగ మంగళాయతనంబును, గంధగజగవయ
గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల
సారంగ సాలా వృకవరాహ మహిష మర్కట మహోరగ
మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ
సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై
యొప్పు నప్పర్వత సమీపమునందు


తా: ఆ పర్వతము యింకనూ, మాధీ ఫల, లవంగ చెట్లతోనూ, మామిడి, మొగలి, జీడి, అంబాళక చెట్లతోను, తెల్లపగడ, పనస, రేగు, పొగడ చెట్లతోను, మఱ్ఱి, ప్రబ్బ, కొండమల్లె, మల్లె, ఎర్రగోరంట, పసుపు గోరంట, ఎర్రకాంచనపు చెట్లతోను, ఖర్జూర, కొబ్బరిచెట్లతోనూ, సింధువార మంచి గంధపు చెట్లతోను, వేప, మందార, నేరేడు, నిమ్మ, గురివింద, ఇప్ప, తాటి, తక్కోల చెట్లతోనూ, తమాల, గిరికతాడి, తియ్యిమామిడి, ఉసిరిక, పోక, కడిమ, గన్నేరు, అరటి వెలగ, కాంచనపు చెత్లతోను, జువ్వి, దిరిశెన, అశోక, విరుగుడు, మోదుగ, నాగకేశరము, పున్నాగ, సంపెంగ, తామర, మరువము, మంచి మల్లెలు, మున్నగు నిత్యయవ్వనవసంత చెట్లతోనూ, వసంతఋతువు నందలి సౌభాగ్య సంపద్సుందర్యముతో గూడి, ఎదుగుచూ, చిగురించుచున్న పూల పండ్ల వృక్షాలతోనూ, అందమైన కొమ్మలతో నొప్పారు చెట్ల సమూహముల తోనూ, పొదలగుంపులతోనూ శృంగారభరిత శోభితమై నొప్పారుచున్న ఫల పుష్ప, వృక్ష జాతుల సమూహములతోనూ రత్నాల రజను వంటి అనేక తేట తేట ఇసుక దిబ్బలతీరములు గలిగిన నదులతోనూ, వింతైన పగడతీగలతోనూ, వాడియైన పక్షి ముక్కలచే కోరక బడిన కొమ్మల మధ్య గల మ్రగ్గిన పండ్లతోనూ, ఆ పండ్ల నుండి ద్రవించుచున్న రసధారలతోను, సుందర సలిలకాసారములో నున్నచెంగల్వ, తెల్ల కలువ, తామర పూవుల సువాసనలతో నిండినదియును, యవ్వన మధోన్మతులై ప్రియుల ఆలింగనములో మైమరచే తుమ్మెదల ఝంకారావము లతోనూ, రాజహంసచక్రవాక పక్షుల సముహముల యొక్కయు, జలవిహంగముల కలకల నినాధ ధ్వనులు భూమ్యాకాశములు నిండుచున్నట్లుగానుండెను. చంద్రకాంతలీను నవరత్న మణిమయభరిత సౌభాగ్య సుందర పర్వతశృంగముల సంచారము చేయు విధ్యాధర, దేవత, సిద్ధచారుణులు, గరుఢుడు, గంధర్వ, కిన్నెర కింపురుషాది దేవతాదంపతుల సమూహము లాడుకొను సరసశృంగార సంభాషణాదులు, గానమాధుర్యములచే శుభములనొసంగే మత్తేభములతోను, నల్లని ఎనుబోతులు, గండభేరుండ ఖగములు, సింహములు, మీగండ్ల మృగములు, పులులు, సవరపు మృగములు, ముండ్లపందులైన ఎలుగుబంట్లు, ఏదుపందులు, జింకలు, తోడేళ్ళు, లేళ్ళు అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, కొండచిలువలు, గండుబిల్లి మున్నగు సమస్త మృగములతో గూడియుండి యుద్ధాడంభరములతో మిగుల భయపడిన వారలై శరణు జొచ్చిన, యమకింకరులతో గూడి ప్రకాశించుచున్న ఆ పర్వతము దగ్గర (ఆ తర్వాత పద్యముతో నన్వయము).

******************************************************************************************   8

క. భిల్లీ భల్ల లులాయక
భల్లూక ఫణి ఖడ్గ గవయ| బలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభకి
మల్లాద్భుత కాక ఘూక| మయమగు నడవిన్‌.


తా!! బోయజాతులతోను, ఎనుబోతులు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగములు, దున్నపోతులు, కోతులు , చమరీమృగములు, ఈలపురుగులు, శ్రేష్ఠములైన మదమత్తేభ, సింహ, శరభ మృగముల సమూహములు, జాతిపందులు, వింతైన కాకులు, గుడ్లగూబల సమూహములచే నిండిన యా అడవియందు.

*******************************************************************************************  9

శా. అన్యాలోకన భీకరంబులు జితా! శానేకపానీకముల్‌
వన్యేభంబులు గొన్ని మత్తతనులై| వ్రజావిహారాగతో
దన్యత్వంబున భూరిభూదరదరీ| ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలి వడి గా| సారావగాహార్థమై.


తా!! భయంకర దిగ్గజములైన మదపుటేనుగులు,తమ గుహలనుండి బయల్వెడలి దిరిగి తిరిగి దాహముతో నీటిలో మునిగి చల్లదనమును గ్రోలు సమయంబున

*******************************************************************************************  10

ఆ. అంధకార మెల్ల| నద్రిగుహాంతర
వీథులందు పగలు| వెఱచి డాగి
యెడరు వేచి సంధ్య| నినుడు వృద్ధతనున్న
వెడలెననగ గుహలు| వెడలెగరులు.


తా!! పగలునకు భయపపడిన చీకటి పర్వత గుహాంతర్భాగములలో దాగుకొని అవకాశము కొఱకు వేచియుండి, సూర్యాస్తమయవేళ బయటి ప్రపంచము నాక్రమించునట్లు, గుహాంతర్భాగములనుండి నల్లని ఏనుగులు బయటకు బయలుదేరాయి. (ఉత్ప్రేక్షాలంకారము వాడబడినది)

*******************************************************************************************  11

Popular Posts