Followers

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- శిఖండి



సంతానం లేని ద్రుపదుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భీష్ముణ్ణి చంపే కొడుకు కావాలని అడిగాడు.

"ముందు కూతురై పుట్టి తరువాత కొడుకుగా మారి భీష్ముణ్ణి చంపే సంతానం నీకు కలుగుతుంది" అని శివుడు వరమిచ్చాడు.

ఆ ప్రకారమే ద్రుపదుడికి కూతురు పుట్టింది. తల్లిదండ్రులిద్దరికి అసలు సంగతి ముందే తెలుసు కనుక కొడుకే పుట్టాడని అందరితోనూ చెప్పి ఆ పిల్లను పురుషవేషంలో పెంచారు. ఆమెను శిఖండి అని పేరు పెట్టారు. శివుడి వరం సంగతి ఆమెకు చెప్పి, ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్యాభ్యాసం చేయించడం మొదలు పెట్టారు.

కూతురికి యుక్తవయస్సు వచ్చాకా పెళ్ళి చేయాలనుకుని, ఈశ్వరుని వరం తలచుకుని ధైర్యం తెచ్చుకుని, దశార్ణదేశ ప్రభువు హేమవర్మ కూతుర్ని తెచ్చి పెళ్ళి చేశారు. ఆ పెళ్ళికూతురు చాలా తెలివైనది. శిఖండి అజాగ్రత్తగా ఉన్న సమయంలో అసలు సంగతి పసికట్టి తన దాసికి చెప్పింది. పరిచారిక వెళ్లి హేమవర్మ చెవిలో వేసిందా సంగతి. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

"కొడుకని చెప్పి కూతురికి మరో కన్యనిచ్చి పెళ్లిచేసావు. ఇందువల్ల నగుబాటు తప్ప మరేం జరిగింది నీకు? నన్ను అవమానించావు. కొడుకని చెప్పిన నీ కూతురికెలాగూ పురుషత్వం లేదు. నీకైనా మగతనం వుంటే యుద్ధంలో చూపించు" అన్నాడు.

"ఏం మాటలయ్యా ఇవి! కూతుర్ని కొడుకని చెప్పుకోవలసిన గతేమిటి నాకు? ఎవరో గిట్టనివాళ్ళు ఏదో చెప్పి వుంటారు మీకు. నావంటి వాడి మర్యాదైనా ఆలోచించకుండా మాట్లాడటం ధర్మమేనా?" అన్నాడు ద్రుపదుడు.

"అయితే మనిద్ధరం ఇప్పుడే నిజానిజాలు తేల్చుకుంటే సరిపోతుందిగా?" అన్నాడు హేమవర్మ.

"అబ్బే! అలా చేస్తే అబ్బాయిని అవమానించినట్లవుతుంది. ఎందుకూ - కొద్దిరోజుల్లో అబ్బాయి అత్తవారింటికోసారి రావాలిగా?" అని మెల్లగా నచ్చచెప్పి పంపించేశాడు ద్రుపదుడు.

ఇదంతా తెలిసి శిఖండి ఆ అవమానం భరించలేక మరణమే శరణ్యమనుకుని ఎవరికీ చెప్పకుండా అడవికి పారిపోయింది. అక్కడున్న యక్షుడొకడు ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నాలను గమనించి " అమ్మాయీ! ఏమిటీ చావు ప్రయత్నం? నీ బాధేమిటో చెప్పు, నేను తీరుస్తాను" అన్నాడు.

"నా బాధ భగవంతుడు తీర్చాల్సిందే" అంది శిఖండి విలపిస్తూ.

"పోని నేను వినడం వలన నష్టం లేదుగా?" అన్నాడు యక్షుడు.

"ఇప్పుడు నాకు పురుషత్వం వస్తే తప్ప ఈ బాధ తీరదు" అని తన కథంతా పూసగుచ్చినట్టు చెప్పింది శిఖండి.

యక్షుడికి జాలేసింది.

"ఓస్! ఇంతేకదా! నా పురుషత్వం నీకిస్తాను. వెళ్ళి మీ అత్తింటి సందేహం పోగొట్టి మళ్ళీ పదిరోజుల్లో తిరిగిరా. అంతవరకూ నీ కన్యత్వం నేను భరిస్తూ ఉంటాను. నువ్వొచ్చాకా నా పురుషత్వం నాకిచ్చేదువుగాని" అని శిఖండిని ఓదార్చి ఆమెకు తన పురుషత్వాన్ని ఇచ్చాడు యక్షుడు.

శిఖండి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి తల్లిదండ్రులకి చెప్పేసరికి వాళ్ళు బ్రహ్మానందపడిపోయారు. తక్షణం ద్రుపదుడు హేమవర్మను పిలిపించి శిఖండి పురుషుడనే సంగతి రుజువు చేసాడు. హేమవర్మ తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు.

పది రోజులయ్యాక యక్షుడికిచ్చిన మాటప్రకారం శిఖండి అరణ్యానికి తిరిగి వచ్చాడు.

"మహాత్మా! నా పరువు దక్కించావు. నీ పురుషత్వం నువ్వు తీసుకో" అన్నాడు.

"నాయనా! నువ్వు అదృష్టవంతుడివి. ఇక నువ్వు నీ జీవితాంతం ఇలా పురుషుడుగానే ఉంటావు. ఇది దైవ నిర్ణయం" అన్నాడూ యక్షుడు.

సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు శిఖండి.

"నాయనా! నువ్వు వెళ్ళాకా ఒకనాడు కుబేరుడు వచ్చాడు. ఆయన వస్తే ఎదురు వెళ్ళి గౌరవించాలని తెలుసు. కాని ఈ ఆడ రూపుతో వెళ్ళడానికి సిగ్గుపడ్డాను. నేను గౌరవించనందుకు ఆయనకు కోపం కలిగింది. ఆయన పరివారంలో ఉన్న యక్షులు కొందరు నా దగ్గరకు వచ్చి సంగతంతా తెలుసుకుని వెళ్ళి ఆయనతో చెప్పారు. అయినాసరే రమ్మనేసరికి నేను వెళ్ళి ఆయన పాదాలు తాకాను. 'స్థూల కర్ణా! ఇంక నువ్విలా స్త్రీ రూపంలో వుండు' అన్నాడు. ఆ మాట విని నేను ఏడ్చాను. యక్షులంతా నా బాధ చూసి కుబేరుణ్ణి ప్రార్థించారు. 'సరే అయితే! శిఖండి బ్రతికి ఉన్నన్నాళ్ళూ నువ్వు యిలా స్త్రీగా ఉండి, అతడు చనిపోయాకా నీ పురుషత్వాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు' అని కుబేరుడు అనుగ్రహించాడు. ఇందులో నీ తప్పేమీ లేదులే. వెళ్ళి సుఖంగా ఉండు" అని యక్షుడు అనగానే అపరిమిత ఆనందం పొందాడు శిఖండి.

స్థూలకర్ణుడి దగ్గర శెలవు తీసుకుని గబగబ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకీ వార్త తెలియజేసాడు.

ద్రుపదుడు తన అదృష్టానికి మురిసిపోయి దేవతలనూ, విప్రులనూ పూజించి నిస్సంకోచంగా ద్రోణాచార్యుడి దగ్గరకు శిష్యుడిగా పంపాడు శిఖండిని. ఆ తరువాత అస్త్రవిద్యలో అతను ఆరితేరాడు.

అంగనలనూ, అంగనాపూర్వులనూ, అంగనాకారం గలవాళ్ళనూ, అంగనానామధేయం కలవాళ్ళనూ చంపనని భీష్ముడు వ్రతం పట్టాడు. అందుకే శిఖండిని కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు చంపలేదు.

Popular Posts