యవనాశ్వుడు, భగీరథుడు, కార్తవీర్యుడు, భరతుడు, మరుత్తుడు, పంచ మహాసామ్రాట్టులుగా ప్రసిద్ధి పొందారు.
మరుత్తుడు కృతయుగానికి చెందినవాడు. ధీశాలి. ఆదర్శ చక్రవర్తిగా వేయేళ్ళు రాజ్య పాలన చేశాడు. ఆయన చేసిన యజ్ఞ యాగాలకు లెక్కే లేదు. యజ్ఞమంటపాలన్నీ బంగారంతో చేయించాడు. ఆయన చేసిన యాగాలను చూసేందుకు దేవతలే దిగివచ్చారు.
మరుత్తుడు రాజ్యాధికారానికి రాగానే బ్రహ్మండమైన ఒక యజ్ఞం తలపెట్టాడు. దానికి బోలేడంత డబ్బు అవసరమైంది. యాగ నిర్వహణకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవడమా అని మరుత్తుడు సతమతమయ్యాడు. దానికి తోడు యాగాన్ని భగ్నం చేసేందుకు ఇంద్రుడు కాచుకుని వున్నాడు. మరుత్తుడికి ఏం చేయాలో పాలుపోక నారదమహర్షిని సంప్రదించాడు.
"బృహస్పతి సోదరుడు సంవర్తకుడు అడవుల్లో తపోదిక్షలో వున్నాడు. నీవు కనక ఆయనను అర్థిస్తే యాగనిర్వహణకు అవసరమైన ధనాన్ని ఆయన నీకు ఇస్తాడు" అని నారదుడు సలహా ఇచ్చాడు.
మరుత్తుడు సంవర్తకుణ్ణి వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. సంవర్తకుడు శివుణ్ణి అర్థించమని మరుత్తుడికి సలహా ఇచ్చాడు. మరుత్తుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై యాగ నిర్వహణకు కావల్సిన బంగారం, వస్తు వాహనాలూ ఇచ్చాడు. మరుత్తుడు అమితానందంతో తన దేశానికి తిరిగి వెళ్ళి యాగం ప్రారంభించాడు. ఆ యాగం చివరికంటా కొనసాగకుండా వుండేందుకు ఇంద్రుడు ఎన్నో ఆటంకాలు కల్పించాడు. అయితే అవేవీ ఫలించలేదు. యాగం నిర్వఘ్నంగా సాగిపొయింది. యాగానికి ఖర్చుపెట్టగా మిగిలిన సొమ్మును మరుత్తుడు హిమాలయపర్వతప్రాంతాలలోని తన రాజధాని నగరంలో భద్రపరిచాడు. అప్పటి నుంచి ఆయన ఐశ్వర్యవంతుడైన మహారాజుగా పేరు పొందాడు.
భారతయుద్ధం పరిసమాప్తమయ్యాక ధర్మపుత్రుడికి రాజ్యాభివృద్ధి చేసుకునేందుకూ, పట్టణాలూ, నగరాలూ నిర్మించేందుకూ, ఆశ్వమేథయాగం చేసేందుకూ అమితంగా సంపద అవసరమైంది. ఎవరిదగ్గరా యాగ నిర్వహణకు కావల్సినంత ధనం లేదు. కాని, అఖిలపాపాలనూ హరించే అశ్వమేథయాగం చెయ్యమని వ్యాసభగవానుడు తనని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు సంకటంలో పడ్డాడు. దిక్కుతోచక మాధవుణ్ణి ప్రార్థించాడు. 'దామోదరా! నీవే గతి. మాకు తల్లీ, తండ్రీ, గురువూ, మంత్రీ, మిత్రుడూ సమస్తం నువ్వే మహాత్మా! అయినా నువ్వు మమ్మల్ని ఎప్పుడు రక్షించలేదు కనుక?! అంతా నీ దయ వల్ల జరగవల్సిందే' అని మనసులోనే కృష్ణుడికి అంజలిపడ్డాడు ధర్మరాజు.
వ్యాస మహర్షికి పరిస్థితి అర్థమైంది. ధర్మరాజుని దగ్గరకు పిలిచి "నాయనా! మరుత్తుడు గతంలో బ్రహ్మాండమైన యజ్ఞం చేశాడు. ఆ యాగం చూసేందుకు దేవతలూ, మునులూ వెళ్ళారు. ఆయన చేసిన దానాలు అన్నీ ఇన్నీ కావు. ఆ యాగ నిర్వహణకు అవసరమైన ధనాన్నంతటినీ పరమేశ్వరుడు సమకూర్చాడు గనుక సరిపోయింది. లేకపొతే మానవ మాత్రుల వల్ల అయ్యే పనేనా? ఆ యాగ నిర్వహణకు ఖర్చు చేసింది పోను మిగిలిన ధనాన్ని, బంగారాన్నీ మరుత్తుడు హిమాలయాలలో దాచి ఉంచాడు. మీరు వెళ్ళి అవి తీసుకురండి. అశ్వమేథయాగం నిర్విఘ్నంగా సాగుతుంది. మీరొచ్చేలోగా నేనూ, మజ్ఞవల్కుడూ యాగానికి కావల్సిన పనులన్నీ జరిపిస్తాం. కావల్సిన సంబరాలన్నీ తెప్పిస్తాం" అన్నాడు మహర్షి ఉపాయం చెబుతూ.
పాండవులు సంతోషించి హిమాలయాలవైపు కదిలి వెళ్ళారు. ఆ ధనరాసులతోనే ధర్మరాజు అశ్వమేథయాగం నిర్వహించాడు. ఆ డబ్బుతోనే బంగారు యజ్ఞశాలలూ, వేదికలూ, యూపస్తంభాలూ, తోరణాలూ, వివిధపాత్రలూ చేయించి దానం చేశాడు ధర్మరాజు.