ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాల్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తుచేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేథయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు ధర్మరాజుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికీ కోటీవేల బంగారు నాణాలను ఇచ్చి తన రాజ్యమంతటినీ వేదవ్యాసమహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.
"ధర్మతనయా! నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు. కాని, నాకు బంగారం కావాలి. భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలకట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో" అన్నాడు మహర్షి.
"స్వామీ! అశ్వమేథయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా వుంటానిక. అంతేకాని బ్రహ్మధనాన్ని తిసుకుంటానా?" అన్నాడు ధర్మరాజు.
"రాజా! మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో" అన్నాడు వ్యాసముని.
"సరే అయితే!" అంటూ కోటికోట్ల మాడలు కుప్పగా పోసి, "ఇది ఈ భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు.
"రండి! మీకేం కావాలో చెప్పండి. ఇవిగో వస్త్రాలు! ధరించండి! రకరకాల బంగారు పాత్రలివిగో - స్వీకరించండి" అంటూ అందర్నీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు.
ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు. సిద్ధులూ విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.
తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగ సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే, అప్పుడొక చిత్రం జరిగింది.
ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటకి వచ్చి, "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా! సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేథయాగం?!" అంటూ మూతి విరిచింది.
ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. "అదేమిటి అలా అంటున్నావు. ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?" అని విప్రులు ముంగిసను ప్రశ్నించారు.
"అయ్యా! ఆకలిని, తృష్ణను జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావుమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యులు చేసి, "ఆరగించండి స్వామీ" అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండినీ భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నాతలా, శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి! ఇదీ ఆ సక్తుప్రస్ఫుడి ధర్మమహిమ!!
"మిగిలిన శరీరం కూడా బంగారుమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకూ తారసపడలేదు. ఈ నాడు ధర్మరాజు యాగం చేస్తున్నాడుకదా, నా కోరిక తీరకపోతూందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమయింది.