Followers

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- స్వర్గారోహణం


శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ధర్మరాజు. " నా తమ్ముల్నీ, భార్యనూ, పుత్రమిత్రుల్నీ చూసి వచ్చి, తరువాత స్వర్గలోక సుఖాలన్నీ హాయిగా అనుభవిస్తాను" అన్నాడు.

"సరే! అయితే వీళ్ళ వెంట వెళ్ళు. నీకు నీ బంధువులందర్నీ చూపిస్తారు" అని చెప్పి అందుకు తగినవాళ్ళను చూపించాడు ఇంద్రుడు. నారద మహర్షి కూడా వాళ్ళను అనుసరించాడు.

మార్గమధ్యంలో ఒకచోట ఉదయసూర్యునిలా ఉన్నతాసనం మీద ప్రకాశిస్తున్న దుర్యోధనుణ్ణి చూశాడు ధర్మరాజు. "వీడు వట్టి లోభి! వీడి మూలానే మా కులమంతా నాశనమైంది. రాజులంతా మరణించారు. పరమ సాధ్వి పాంచాలిని అవమానించిన తుచ్చుడు వీడు. ఇక్కడి నుంచి నన్ను తక్షణం తీసుకువెళ్ళండి" అని తనకు మార్గం చూపిస్తున్న దేవతలతో అన్నాడు ధర్మరాజు. అతడు ముఖం తిప్పుకోవడం చూసి నవ్వాడు నారదుడు.

"ధర్మనందనా! యుద్ధంలో శరీరం విడిచిపెట్టి వచ్చాడు దుర్యోధనుడు. క్షాత్రధర్మంతోనే గదా ఇతడు రాజులను చంపింది! అది దుర్మార్గమెందుకౌతుంది? పాంచాలిని అవమానించడం మొదలైనవన్నీ ఇక్కడ అనుకోకూడదు. ఇది దేవలోకం. మానవ సహజ వికారాలేవీ ఇక్కడ పనికిరావు!" అన్నాడు.

మహర్షి మాటలు ధర్మరాజుకు రుచించలేదు. "ముందు నన్ను నా వాళ్ళ దగ్గరకు పంపించండి. వాళ్ళు లేని స్వర్గం నాకు సహ్యం కాదు" అన్నాడు ధర్మరాజు.

అతని ఆనతి ప్రకారం దేవదూతలు ముందుకు కదిలారు. వారివెంట వెళ్ళాడు ధర్మరాజు. కొంతదూరం వెళ్ళేసరికి మార్గమంతా తల వెంట్రుకలతోనూ, ఎముకులతోనూ నిండి అసహ్యంగా వుంది. దుర్గంధం వీస్తోంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఉడుకుతున్న నూనె వంటి నీళ్ళతో నిండి వున్న ఒక ఏరు కనిపించింది. అది వైతరణీనది. దాని ఒడ్డున ఇనుప ముళ్ళున్నాయి. కత్తులవంటి ఆకులతో ఒక వనం కూడా కనిపించింది. అది అసిపత్రవనం. అక్కడ అనేక రకాల బాధలు అనుభవిస్తున్న పాపాత్ములున్నారు.

"అబ్బ! ఇదంతా చాలా అసహ్యంగా వుంది. వీళ్ళ బాధలు చూడలేకుండా వున్నాను. పదండి పోదాం" అని వెనక్కి తిరిగాడు ధర్మరాజు.

"మహాత్మా! దివ్య సువాసనలు గల నీ శరీరపు గాలి సోకి యిక్కడంతా పరిమళభరితమయింది. నిన్ను చూడటం వలన మా నరకయాతనలన్నీ తొలగిపోయాయి. ఇంకొంచెంసేపు దయతో ఇక్కడే నిలబడవా?" అని అక్కడ పాపకూపంలో బాధలనుభవిస్తున్న కొన్ని కంఠాలు దీనంగా అర్థించాయి. ఆ ప్రార్థనకు కరిగిపోయాడు ధర్మరాజు. 'పాపం! ఎంత కఠినమైన బాధలు అనుభవిస్తున్నారో వీళ్ళు ' అని కాసేపు అక్కడే నిలబడ్డాడు.

ఆయన తిరిగి వెళ్ళబోయేసరికి మళ్ళీ అలాంటి మాటలే వినిపించాయి.

"ఎవరు మీరు? ధర్మరాజు ప్రశ్నించాడు.

"నేను కర్ణుణ్ణి"

"మేము పాండుపుత్రులం"

"నేను ద్రౌపదిని"

అన్నాయి కంఠాలు.

"అయ్యయ్యో! ఇలాంటి ఘోరం అనుభవించడానికి వీళ్ళేం పాపం చేశారు? ఒక్క మంచిపని కూడా చెయ్యని దుర్యోధనుడు సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇతరులకు ఎన్నడూ ఇసుమంతైనా పాపం తలపెట్టని వీళ్ళు కష్టాలు పడుతున్నారు. ఏమిటీ తేడా! ధర్మదేవతకెందుకీ పక్షపాతం?" అంటూ దుఃఖించాడు ధర్మరాజు. "నా తమ్ములు ఇక్కడ బాధల్లో మునిగివున్నారు. కనుక ఇంక నేను ఇక్కడే వుంటాను. ఈ విషయం ఇంద్రుడితో చెప్పండి" అన్నాడు దేవదూతలతో.

వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ సంగతంతా ఇంద్రుడికి చెప్పారు. ఇంద్రుడు వఛ్ఛాడక్కడికి. ధర్ముడు కూడా వచ్చాడు. అప్పుడు పాపాత్ములు బాధలు అనుభవించడం, దుర్గందం, వైతరణీనది, అసిపత్రవనం అన్నీ అదృశ్యాలయ్యాయి. దిక్కులన్నీ వెలిగాయి. "ధర్మతనయా! ఒక్క సంగతి చెబుతాను విను. రాజైనవాడు ప్రతీవాడూ నరకాన్ని చూసితీరాలి. వేదాల్లో వుందిది. పుణ్యం వల్ల స్వర్గం, పాపం వల్ల నరకం అనుభవించాలి. అల్పపుణ్యం చేసినవాడు ముందు అమర సుఖం అనుభవిస్తాడు. అధికంగా పుణ్యం చేసినవాళ్ళు ముందు కొద్దికాలం పాటు నరకయాతనలు అనుభవించి ఆ తరువాత మిగిలిన కాలమంతా సుఖపడతారు. ఇప్పుడు నినిక్కడికి పంపడం కూడా ఉత్తరోత్తరా నువ్వు సుఖపడటానికే" అన్నాడు ఇంద్రుడు.

వికసించిన ముఖంతో వినయంగా నమస్కరించాడు ధర్మరాజు. "ధర్మజా! విధివశం వల్ల తప్పింపరానివైన అల్పదుఃఖాలు అనుభవించావు నువ్వు. ఇదిగో! ఆకాశగంగ! ఇందులో మునిగి సకల సుఖాలనూ అనుభవించు. కర్ణుడితో సహా నీ తమ్ములందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలలో ప్రకాశిస్తున్నారు" అన్నాడు ఇంద్రుడు.

"నాయనా! ఇదివరకు మూడుసార్లు పరీక్షించాను నిన్ను. ఇది నాలుగోసారి. నీ మనస్సులో ధర్మం ఎన్నడూ చలించలేదు. నా మీద భక్తి ఎక్కువ నీకు. మీ అన్నదమ్ముల అన్యోన్యత అపారం. నీ సోదరులు బాధలు పడడం మేము కల్పించిన మాయ! వాళ్ళు పుణ్యలోకాలలో వున్నారు. నువ్వూ అక్కడ హాయిగా వుందువుగాని పద" అన్నాడు ధర్ముడు.

వెంటనే ఆకాశగంగలో మునిగాడు ధర్మరాజు. మానుషదేహం పోయి దివ్యశరీరం వచ్చింది. ఆ తరువాత ఉత్తమగతులు పొందిన అన్నదముల్నీ, ఉదయసూర్యప్రభతో వెలుగుతూన్న ద్రౌపదినీ చూసి పరమానందభరితుడయ్యాడు ధర్మరాజు.



Popular Posts