శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్న మాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికారదర్పంతో, అహంకారంతో కన్నూ,మిన్నూ గానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బ తిన్నాడు. అనంతరం విచిత్రవీర్యునుకి పట్టం కట్టారు. తమ్మునికి పెళ్ళి చేయాలనుకున్న భిష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్రవీర్యుణ్ణి అక్కడకు తీసుకుపోయాడు.
కాశీరాజుకు ముగ్గురు కూతుళ్ళు .
అంబ,అంబిక,అంబాలిక అని వాళ్ళకు పేర్లు.
వాళ్ళ కోసం అక్కడకు చేరిన రాజులందరూ పోట్లాడుకోవాడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందర్నీ ఓడించి రాజకుమార్తెలు ముగ్గుర్నీ రధమెక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు.
వెంటనే పెళ్ళికి ఏర్పాటు చెయ్యమని మంత్రుల్ని అదేశించాడు. అంబ నీళ్ళు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి " గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు. అతనే నా సర్వస్వం. మనసు లేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు. నా చెల్లెళ్ళిద్దర్నీ నీ తమ్ముడుకిచ్చి పెళ్ళి చెయ్యి" అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాళ్వదేశానికి పంపాడు.
సాళ్వుడు అంబను చూస్తూనే " నువ్వంటే నాకూ ఇష్టమే. నిన్ను పెళ్ళి చేసుకోవాలని నేనూ అనుకున్నాను. కాని రాజులందరూ చూస్తూవుండగా భీష్ముడు నిన్ను రధమెక్కించుకుని తీసుకుపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్రవీర్యుణ్ణి పెళ్ళాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్ళి చేసుకోమంటావు?" అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. " నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్ర్ణయనాధుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంక చేసేదేంలేదు. వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది. నీ తెమ్ముణ్ణే పెళ్ళి చేసుకుంటా" అంది.
భీష్ముడు ఒప్పుకోలేదు.
" సాళ్వుడే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు. నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొకచోట మనువొకచోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకూ మా తమ్ముడికీ పొసగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది" అన్నాడు. అంబ మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు అమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తి, "నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం నా బ్రతుకు అల్లరి పాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు" అని వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది.
ఒక రోజు హొత్రవాహనుడనే రాజర్షి వచ్చి, అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకుని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి, హొత్రవాహనుడ్ని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు.
అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కధంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి "అమ్మా! నీకు రెండువైపులా పరాభవం కలిగింది. సాళ్వుణ్ణి చక్క చెయ్యమంటావా? భీష్ముడికి నచ్చ చెప్పమంటావా?" అని అడిగాడు.
" మహర్షి ! సాళ్వుడెలాగా నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతణ్ణి సాధించడానికే తపస్సు చేస్తున్నాను" అంది.
"అమ్మా!తపస్సు చేసేటంత కష్టమెందుకు నీకు! భీష్ముడు నా మాట వినకపోతేగా?" అని అంబను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పరశురాముడు.
"గాంగేయా! ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మంకాదు. ఈ పిల్లను నీ తెమ్ముడికిచ్చి పెళ్ళి చెయ్యి" అన్నాడు.
"పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయ్యడం మాత్రం ధర్మమా మహాత్మా" అన్నాడు భీష్ముడు.
"ఏమో అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చెయ్యడమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్నీ, నీ బంధువుల్నీ కూడా చంపుతాను" అన్నాడు పరుశురాముడు.
"అయ్యా! ఇది అధర్మం" అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ.
"నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడవయ్యావా?" అని మండిపడ్డాడు పరశురాముడు.
"స్వామీ! మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు." అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చిందాయనకు.
" నేను గురువునని తెలిసినా,నా మాట తిరస్కరిస్తున్నావు? పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు. మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్ళిచేస్తే నా కోపం చల్లారుతుంది. లేదా..." అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే " అధర్మకార్యం మాత్రం నేను చెయ్యను" అన్నాడు భీష్ముడు.
దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు.
పరశురాముడు బాణాలవర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రధాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది.పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు.ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి "నాయనా!భీష్ముణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణసఖుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వూరుకో" అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకుని గౌరవించాడు.
భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.
పరశురాముడు అంబను పిలిచి " అమ్మాయీ! నన్ను భీష్ముడు గెలిచాడు. ఇంక నేనేం చేయ్యలేను. నీ ఇష్టం మరి" అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్లిపోయింది.
ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి "ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు?" అని అడిగేసరికి " వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి అందుకూ ఈ తపస్సు " అంది అంబ.
"నువ్వు కుటులసంచారిణివి. కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకంటే ఇంకేం చెయ్యలేవు నువ్వు" అంది కోపంగా గంగ.
అంబ తన తపఃప్రభావంలో సగం ధారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై "మరుజన్మలో భీష్ముణ్ణి చంపగలవు" అని సెలవిచ్చాడు.
"స్వామీ! అదెలా సంభవం?" అని అంబ అడిగింది.
"నువ్వీ శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురివై పుడతావు. తరువాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు.
అంబ చితి పేర్చుకొని 'వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక' అంటూ అగ్నిలో ప్రవేశించింది. అదీ అంబ కధ.