దివ్యాస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయపర్వతాలకు వెళ్ళాడు.
గాండీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచాలి, పాండవులు. సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలి పెట్టి మరెక్కడికైనా తరలివెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి వెంటనే బయలుదేరి నారాయణాశ్రమవనం చేరుకుని కొన్నాళ్ళు కాలం గడిపారు. ఒకనాడు ఉత్తర దిశనుంచి చల్లని పిల్లగాలి వీచింది. ఆ గాలితోపాటూ దివ్యపరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి దౌపతి ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది.
"భీమసేనా! ఈ పువ్వు చూడు. ఎంత సువాసన! ఎంత అందం!! ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్యకవనంలో వేసి పెంచుకుందాం. ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి" అంది.
దౌప్రతి కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు వున్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు.
అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి, "నా ఒళ్ళు బాగాలేదు. పడుకున్నాను. కదలలేను. పిచ్చిపిచ్చిగా శబ్దాలు చెయ్యకు. వివేకం గల మునుష్యులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఎక్కడికి పోదామని వచ్చావు? ఇది దేవలోకానికి పోయే మార్గం. మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు. తిరిగి వచ్చిన దోవనే వెళ్ళిపో" అంది.
వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది. "అసలు నువ్వెవరు? నన్నడ్డగించడానికి నీకు గల అధికారమేమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి. వాయునందనుడ్ని అని తెలుసుకో. దారి ఇవ్వు" అని బిగ్గరగా గర్జించాడు.
"నేను ఒక సాధారణమైన కోతినే. కాని నువ్వీ దారిన వెళితే దెబ్బతింటావు. జాగ్రత్త" అంది వానరం.
"నీ సలహా నాకు అక్కర్లేదు. మర్యాదగా తప్పుకో" అన్నాడు భీముడు.
"నాకు లేవడనికి శక్తి లేదు. నేను ముసలుదాన్ని . కాదూ, కూడదూ అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు" అంది వానరం.
"జంతువులను దాటి పోగూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లఘించినట్టు, నిన్నూ ఈ పర్వతాన్నీ ఒక్క ఉదుటున దాటిపోగలను ఏమనుకున్నావో!" అన్నాడు భీముడు గొప్పగా.
"నాయనా! కోపం తగ్గించుకో. గొప్పలకు పోకు. ముసలివాణ్ణని ముందే చెప్పాను. నిలిచే శక్తి లేదు. నా మీదినుంచి దాటిపోవటానికి ఆక్షేపణ వుంటే, దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకుని వెళ్ళు" అంది వానరం.
తన భుజబలం చూసి గర్వపడుతున్న భీముడు 'అదెంత పని!' అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు. కాని ఆ వాలం కదల్లేదు. భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. తోక పైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు. ఆ క్షణంలో భీముడికి ఎదుటవున్నది సామాన్య వానరం కాదని అర్థమైంది.
"అయ్యా ! నన్ను మన్నించండి. మీరెవరు? సిద్ధులా? దేవతలా? గంధర్వులా? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి" అని వేడుకున్నాడు.
"పాండవవీరా! సర్వలోకాలకూ ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుడ్ని , హనుమంతుడ్ని నేనే. యక్షులూ, రాక్షసులూ సంచరించే ఈ తో్వలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సౌగంధ వృక్షం- అదిగో కనిపిస్తోంది చూడు" అని భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు.
మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమ అంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి. "వీరుడా! నీ నివాసానికి తిరిగిపొ. అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో. నీకు మేలు జరుగుతుంది. నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను. నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండాపైన నేనుంటాను. మీకు జయం కలుగుతుంది" అని దీవించాడు హనుమంతుడు.
భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలన్నీ కోసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు భీముడు.