Followers

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 9


సీ. సర్వాగమామ్మాయ| జలధికి నపవర్గ
మయునికి నుత్తమ| మందిరునకు
సకలగుణారణి | చ్చన్నబోధాగ్ని కి
దంత రాజిల్లు| థన్యమతికి
గుణలయోద్దీపిత| గురుమానసునకు సం
వర్తిత కర్మని| ర్వర్తితునకు
దిశలేని నాబోటి| పశువుల పాపంబు
లణచు వానికి సమ| స్తాంతరాత్ము

ఆ. డై వెలుంగువాని| కచ్చిన్నునకు భగ
వంతునకు దనూజ| పశునివేళ
దార సక్తులయిన| వారి కందగరాని
వాని కాచరింతు| వందనములు


తా!! సర్వదేవతా పూజా విధానము తెలుపు వేదములకు నిధియైనవాడును, మోక్షమార్గ స్వరూపుడును, సర్వశ్రేష్ఠులకు ఆటపట్టయినవానికి, జ్ఞాన గుణ సంపన్నునకు, స్వయంప్రకాశ నిర్మలబుద్ధి గలవానికి దీనజనోద్ధారకుడు, సర్వాంతర్యామియై వెలుగొందువాడును, సంసారసాగరమున మునిగిన వారికొ అసాధ్యుడును అయిన యా జగత్ప్రభువును మనసారా రక్షింపుమని వినయపూర్వకముగా వేడుకొనుచున్నాను.

*******************************************************************************************  65

వ. మఱియును.

సీ. వర ధర్మ కామార్థ| వర్జిత కాము లై
విబుధు| లెవ్వాని సే| వింతు రిష్ట
గతి బొందుదురు చేరి| కాంక్షించువారి క
వ్యయ దేహ మునిచ్చు నె| వ్వాడుకరుణ
ముక్తాత్ము లెవ్వని| మునుకొని చింతింతు
రానందవార్ధి మ| గ్నాంతరంగు
లేకాంతు లెవ్వని| నేమియు గోరక
భద్రచరిత్రంబు| బాడుచుందు

ఆ. రా,మహేశు, నాద్యు| నవ్యక్తు, నధ్యాత్మ
యోగ గమ్యుఁ, బూర్ణు| నున్నతాత్ము,
బ్రహ్మమైనవాని| బరుని నతీంద్రియు
నీశు, స్థూక్ష్ము| నే భజింతు


తా: మహోన్నతమైన ధర్మార్ధకామములను త్యజించినవారై పండితులెవ్వని గని తమ కోరికలను ఈడేర్చు కొందురో, మనఃస్పూర్తిగా ప్రార్థించువారికోరికల నెవ్వరు కరుణతో దీర్చునో శరీరాభిమాన రహితులై నిష్ఠతో నెవనిని ధ్యానించి ఆనందింతురో అట్టి పరమేశ్వరుని పూజించెదను. మనోః వాక్కాయకర్మల కగోచరుడును, నిష్ఠాగరిష్టులైన పరమభక్తులను బొందినవాడును, బ్రహ్మ స్వరూపుడును, సర్వాంతర్యామియై స్థూల సూక్ష్మ రూపంబుల నొందు వాడును, నగు బరమేశ్వరుని సర్వదా రక్షింపుమని ప్రార్థిస్తున్నాను.

******************************************************************************************   66,67

వ. అని మఱియు నిట్లనివితర్కించె,


తా!! మరల నా గజేంద్రుడిట్లు దలపోయ దొడంగెను.

*******************************************************************************************  68

సీ. పాపకుండర్చుల| భానుండు దీప్తుల
నెబ్భంగి నిగిడింతు| రెట్లడంతు
రా క్రియ నాత్మ క| రావళిచేత బ్ర
హ్మాదుల వేల్పుల| నఖిలజంతు
గణముల జగముల| ఘననామరూప భే
దములతో మెఱయించి| తగ నడంచు
నెవ్వండు మనము బు| ద్దీంద్రియంబులు దాన
యై గుణసంప్రవా| హంబు బఱపు

తే. స్త్రీ నపుంసక పురుషమూ| ర్తియును గాక
తిర్యగమరనరాది మూ| ర్తియును గాక
కర్మగుణభేద సద సత్ర్స| కాశి గాక.
వెనుక నన్నియు దా నగు| విభుని దలంతు


తా!! సూర్యాగ్నులు తమదమ కాంతులను ప్రజ్వలించి కాంతింప జేయునట్లు ఏ విశ్వేశ్వరుడు ఈ విశ్వమంతటినీ, సమస్తభూమ్యాది లోకంబులను, బ్రహ్మాదిదేవతలను, చరాచర జీవసముదాయమును సృష్ఠించి, స్థితించి, లయమును బొందించి తనలోనికి జేర్చుకొనునో, మనోబుద్ధులను జ్ఞాన కర్మాంద్రియములకు ఎవడు కర్తగా నుండి సత్త్వ, రజస్తమో గుణముల కార్యములను బరిపూర్తిచేయునో, పిమ్మట శూన్యరూపుండై, స్త్రీ, పురుష, నపుంసకరూపరహితుడై, మానవ, పశు పక్ష్యాదుల దేవతారూపంబుల నొందక, గుణ కర్మల వలన ఖేధంబునొందక, సత్త్వ, అసత్త్వరూపుడును గాక, చివరకన్నియుదానైన వాడగు ఆ పరమాత్ముని సేవించెదను.

*******************************************************************************************  69

క. కలడందురు దీనులయెడ
గలడందురు పరమయోగి| గణములపాలన్‌
గలడందు రన్నిదిశలను
కలడు కలండనెడువాడు| కలడో లేడో


తా!! ఆ పరాత్పరుడు ఆపన్నులు, యోగుల సమూహముల యెడను, సకల దిక్కులయందునుగలడని ప్రస్తుతింతురు అసలట్టి మహాత్ప్రభువు ఈ యిలనుగలడో! లేడోనని! సంశయము గల్గుచున్నది. ఎన్ని విధముల బ్రార్థించిననూ నన్ను కరుణించడేమి? ఆపన్నుల నాదుకొనడేమి.

*******************************************************************************************  70

సీ. కలుగడే నాపాలి| కలిమి సందేహింప
గలిమి లేములు లేక| గలుగువాడు
నాకడ్డపడరాడె| నలిన సాధువులచే
బడినసాధుల కడ్డ| పడెడువాడు
చూడడే నా పాటు| జూపుల జూడక
జూచువారల గృప| జూచువాడు
లీలతో నా మొఱా| లింపడే మొఱగుల
మొఱ లెఱుగుచు దన్ను| మొఱగువాడు

తే. నఖిలరూపులు దన రూప| మైనవాడు
నాదిమథ్యాంతములు లేక| యలరువాడు
భక్తజనముల దీనుల| పాలివాడు
వినడె చూడడె తలపడె| వేగరాడె.


తా!! పుట్టుటయును, గిట్టుటయును లేని యా పరాత్పరుడు నాయందున్నాడో? లేడో? ననే సంశయము కలుగుతున్నది. లేకున్న నాపైఇంత దనుక దయజూపడేమి; తనజ్ఞాన చక్షువులతో నన్నేల వీక్షింపకున్నాడు. కపటభక్తులకు కానరానికమలనాభుడు, నన్ను, నా నిష్కళంక మొరను ఆలకింపకున్నాడేమి? జగత్వ్సరూపుడైన , ఆదిమధ్యాంతరహితుడై ప్రకాశించు, దీనజనభక్త భాందవుడు అగు ఆ పరంధాముడు నా ప్రార్థనల నాలకించి వేగమే నన్ను బ్రోవమని వేడుకుంటున్నాను.

*******************************************************************************************  71

Popular Posts