Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- సుదేవుడు


స్వర్గలోకం సుందరంగా వుంది. అప్సరసల అందెల రవళులతో మారుమ్రోగుతుంది. సమస్త భోగాలకూ నిలయమై ప్రకాశిస్తుంది. ఇంద్రుడు సుందరీమణుల నృత్యాన్ని తన్మయంగా తిలకిస్తున్నాడు. ఇంతలో అంబరీష మహారాజు వచ్చాడక్కడికి.

అతణ్ణి చూసి ఇంద్రుడు ఎదురు వెళ్ళి, "మహారాజా! స్వాగతం! ఎన్నో యాగాలూ, పుణ్యకార్యాలూ చేసి దేవలోకానికి వచ్చిన ఉత్తముడివి నువ్వు. నీ రాక మా అందరికీ మహదానందకరంగా వుంది" అన్నాడు . అంబరీషుడు చిరునవ్వుతో చుట్టూ కలయచూసాడు. ఒకచోట పుష్పక విమానంలో, దివ్యాంగనలతో పరాచికాలాడుతున్న ఓ విలాసపురుషుడు కనిపించాడు. ఇంద్రుడికి అతణ్ణి చూపిస్తూ "వాడు సుదేవుడు కదూ?" అని అడిగాడు అంబరీషుడు.

"వాడు నా సేవకుడు. ఏ పుణ్యకార్యాలూ చెయ్యలేదు. అయినా వాడికీ సుకృతం ఎలా కలిగింది?" అని అంబరీషుడు ప్రశ్నించాడు.

"ఒకసారి శతశృంగుడనే రాక్షసుడి కుమారులు సదముడూ, విదముడూ, దముడూ నీమీద దండెత్తారు కదూ?"

"అవును. ప్రజలెందరినో పీడించి దోచుకుని నా రాజ్యం ఆక్రమించడానికి వస్తే నేను సుదేవుణ్ణి పిలిచి , 'సైన్యంతో తక్షణం వెళ్ళి ఆ రాక్షస కుమారుల్ని హతమార్చు. జయం పొందకుండా వస్తే మాత్రం నీ తల కోట గుమ్మానికి కడతాను ' అని కావల్సినంత సైన్య మిచ్చి పంపాను. సరేనని వెళ్ళాడు. కాని ఆ తరువాత వాడి జాడ తెలీలేదు".

"నేను చెబుతాను విను. అతడు వెళ్ళి సైన్యంతో ఒకచోట విడిది చేసాడు. గూఢాచారుల్ని పంపి శత్రు సైన్యం బలం అంచనా వెయ్యమన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి శతశృంగుడి కుమారులతో తలపడడం మంచిది కాదని చెప్పారు.

' ఎదుటి వాడి బలం ఎంతో తెలుసుకున్నాకా కూడా యుద్ధం చేస్తే సైన్యానికి చేటు తప్ప ఏం ప్రయోజనం లేదు. తిరిగి వెడితే ఎలాగూ ప్రాణాలు దక్కవు. కనుక నా తల అంబరీషుడికి ఇచ్చే బదులు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆయనకు ఇవ్వడం మేలు ' అనుకుని యుద్ధం మానేసి సైన్యాన్ని వెనక్కి వెళ్ళమని చెప్పాడు సుదేవుడు. తను వెళ్ళి మరుభూమిలో కూర్చుని, శివుణ్ణి మనస్సులో నిలుపుకుని మెడమీద కత్తి పెట్టుకున్నాడు.

వెంటనే, ఆగు!ఏమిటీ సాహసం? ఎందుకీ పనికి పూనుకున్నావు? అని కత్తి తొలగించాడు పరమేశ్వరుడు. సుదేవుడు పరమానంద భరితుడై ఆదిదేవుడికి సాగిలబడ్డాడు.

'దేవా! శతశృంగుడి కుమారులను జయించకుండా వస్తే చంపుతానన్నాడు అంబరీష మహారాజు. కాని ఆ రాక్షస కుమారులు జయించరానివారుగా వున్నారు. ఎలాగైనా చావు తప్పనప్పుడు దేవదేవుడైన నీకే నా తల అర్పించుకుంటే మంచిదనుకున్నాను' అన్నాడు జాలిగా.

" శివుని మనస్సు ఆర్ద్రమైంది. ఒక దివ్యరథాన్ని, విల్లమ్ముల్నీ సుదేవుడికి ఇచ్చి, 'ఇంక నిన్ను యుద్ధంలో దేవదానవులెవరూ గెలవలేరు. కాని ఒక విషయం గుర్తుంచుకో - యుద్ధం చేసేటప్పుడు ఈ రథం మీదనుంచి కిందకు మాత్రం దిగకు ' అని హెచ్చరించాడు.

"సుదేవుడు బ్రహ్మానందపడిపోయాడు. ఆ రథమెక్కి వెళ్ళి సదముడినీ, దముడినీ చంపేశాడు. అది చూసి విదముడు మండిపడ్డాడు. ఖడ్గం చేతపట్టి సుదేవుడి మీదకు వచ్చాడు. వైరిని చూసి రెచ్చిపోయి, పరమేశ్వరుడు చెప్పిన మాట మరచి రథం మీదనుంచి కిందకు దూకాడు సుదేవుడు. ఖడ్గ యుద్ధం చేస్తుండగా ఒకరి కత్తికి ఒకరు బలై ఇద్దరూ మరణించారు. అతడలా శత్రుసంహారం చెయ్యబట్టే నీ రాజ్యం గొప్పగా వుంది. అందువల్లే సుదేవుడికి యీ లోకాన యింతటి ఉన్నత స్థానం లభించింది. "యుద్ధంలో చనిపోయి వచ్చినవాడు యిక్కడ పోందే సత్కారానికి సమానమైనది ఇంకొకటి ఏదీలేదు. వీరమరణం పొందిన వారికే కాక, సంగ్రామంలో వైరికి వెరవక, వెన్నివ్వక పోరాడి నిలిచిన వారికి కూడా వీరస్వర్గమే లభిస్తుంది" అన్నాడు ఇంద్రుడు.

అప్పుడు అంబరీషుడు కూడా సుదేవుణ్ణి అభినందించాడు.


Popular Posts