అర్జునుడు పాండవులలో మూడవవాడు. అతను పిట్టినప్పుడు "కుంతీ! నీ కుమారుడు పరమశివునితో సరితూగేటంత శక్తిమంతుడౌతాడు. ఇంద్రుని వలే అజేయుడౌతాడు. రాజులందర్నీ జయించిన తరువాత మూడుసార్లు అశ్వమేధం చేస్తాడు. శివుడ్ని ప్రసన్నం చేసుకుని పాశుపతదివ్యాస్త్రాన్ని సంపాదిస్తాడు" అని అశరీరవాణి పూలవానలు కురిపిస్తూ పలికింది.
పాండవులు చిన్నప్పుడు కౌరవులతో కలసి హస్తినాపురంలో వుంటుండేవారు. బాల్యంలోనే అర్జునుడు అస్త్రవిద్య, సంగీతం, నాట్యం, క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మొట్టమొదట అర్జునుడికి ధనుర్వేదంలో పాఠాలు చెప్పిందీ, బాణాలు వేయడం నేర్పిందీ శుకమహర్షి. తరువాత కృపాచర్యుడు, ఆ తరువాత ద్రోణుడు అర్జునుడ్ని మేటి విలుకాడుగా మలచారు.
ఓ సారి ద్రోణుడూ,ఆయన శిష్యులూ గంగానదిలో స్నానం చేస్తుండగా ఆచార్యుని కాలు ఒక తిమింగలం పట్టుకుంది. శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం పట్టు నుంచి గురువుగార్ని విడిపించలేకపోయారు. చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుణ్ణి వదలి పలాయనం చిత్తగించింది. ద్రోణుడు సంతోషించి అర్జునుడికి "బ్రహ్మశిరాస్త్రం" ఉపదేశించాడు. ఆ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించడానికి వీల్లేదు. మానవాతీతమూర్తుల మీదే అది పనిచేస్తుంది.
ఇలా వుండగా దుర్యోధనుడికి పాండవులందర్నీ హతమార్చి రాజ్యం మొత్తం చేజిక్కించుకోవాలన్న దురాశ కలిగి వాళ్ళందర్నీ 'వారణావతం' అనే పట్టణానికి పంపాడు. పాండవులకి దుర్యోధనుడి కుట్ర తెలిసిపోయింది. అక్కడ నుంచి యుక్తిగా తప్పించుకుని వాళ్ళందరూ బ్రాహ్మణ వేషాలలో ఏక చక్రపురం చేరారు. ఆ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె దౌపదికి స్వయంవరం చాటించాడు.
స్వయంవరమంటపం ఎంతో సొగసుగా నిర్మించారు. ఉక్కు తీగలతో పురిపెట్టిన అల్లెత్రాడు గల పెద్దవిల్లు ఒకటి వేదిక మీద ఉంచారు. ఆ విల్లు వంచి, నారిని సంధించి, బాణం ఎక్కుపెట్టి, పైన చాలా ఎత్తులోవున్న చేపను ఒకేదెబ్బలో కొట్టాలి. మధ్యలో ఒక చక్రం గిర్రున తిరుగుతూ వుంటుంది. దానికి ఏ మాత్రం తగలకుండా, దాని మధ్యగుండా బాణం వేయాలి. అలా వేయగలిగిన యోధుడ్ని దౌపది పెళ్ళాడుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు, వంటి యోధానుయోధులు ఆ స్వయంవర మహోత్సవానికి హాజరయ్యారు. బ్రాహ్మణ వేషాలలో వున్న పాండవులూ వెళ్ళారు. క్షత్రియ వీరులూ, రాకుమారులూ ప్రయత్నించి విఫలమయ్యారు. కర్ణుడు విర్రవీగుతూ వెళ్ళి వెల్లకిలా పడ్డాడు. చివరికి మారువేషంలో వున్న అర్జునుడు ధనస్సు ఎత్తి చాలా తేలికగా లక్ష్యాన్ని కొట్టగలిగాడు. పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది.
అర్జునుడి కపికేతనం గురించి చిత్రమైన కధ వుంది. ఒక సారి దేశయాత్రకు వెళ్ళిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకూ శ్రీ రాముడు నిర్మించిన వారధిని చూసి విస్తుపోయాడు. అయితే వంతెన నిర్మాణానికి కోతుల సాయం తీసుకోవాడం మాత్రం అర్జునుడికి నచ్చలేదు. 'గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీ రామచంద్రుడు బాణాలతో వంతెన నిర్మించుకోవలసింది' అనుకున్నాడు. సముద్ర తీరాన కూర్చుని రామాయణం పఠిస్తున్న ఒక పండితుడి దగ్గరకు వెళ్ళి ఇదే ప్రశ్న వేశాడు. అయినా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడొక కోతిపిల్ల వచ్చి "శ్రీ రాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే, కోతులన్నీ దాని మీదనుంచి నడిచివుంటే ఆ వారధి ఆనాడే కుప్పకూలి వుండేది" అని సమాధానమిచ్చింది.
"శ్రీ రాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల బరువుకే అది కూలటమా!" అని సవ్యచాచి బిగ్గరగా నవ్వాడు. పిల్లకోతికీ, అతనికీ మధ్య వాదోపవాదం చెలరేగింది.
" రాముడి సంగతి అలా వుంచు. నేను బాణాలతో వంతెన కడతాను. నువ్వు పడగొట్టగలిగితే నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను. నేను జయిస్తే ఎప్పటికీ మీ వానరజాతి అంతా నాకు బానిసలుగా, సేవకులుగా వుండాలి. సరేనా?" అన్నాడు.
సరేనంది మర్క్టటం.
అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు. కోతి అడుగు పెట్టగానే అది పుటుక్కుమంది. మళ్ళీ వంతెన కట్టాడు. మళ్ళీ కూలిపోయీంది. అర్జునుడు మంట చేసి ఆ జ్వాలల్లోకి దూకటానికి సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఒక బాలుడు వచ్చి, "న్యాయమూర్తిగా వ్యవహరించే పెద్ద మనిషి లేకుండా మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదు. నీ ఆత్మ త్యాగం చెల్లదు" అన్నాడు అర్జునుడితో.
అర్జనుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకబోతుండగా "సరే, మరోసారి పందెం కాయండి, ఈసారి నేను న్యాయం చెబుతాను. అప్పుడు కూడా ఓడిపోతే మీ యిష్టం" అన్నాడు బాలుడు. వానరం,అర్జునుడు అందుకు సరేనన్నారు.
అర్జునుడు మళ్ళీ వంతెన నిర్మించాడు. పిల్లకోతి చక చకా ఎక్కి నిలబడింది. ఈ సారి వంతెన చెక్కుచెదరలేదు. పిల్లకోతి శరీరాన్ని పెంచింది. పర్వతమంత ఎత్తు ఎదిగింది. అయినా వంతెన తొణకలేదు. కోతికి అర్ధమైంది "రామచంద్రప్రభో!" అంటూ వెళ్ళి బాలుడికి పాదాభివందనం చేసింది. "శ్రీకృష్ణా!" అంటూ వెళ్ళి పార్ధుడు బాలుడి పాదాలు పట్టుకున్నాడు.
పిల్లవాడు చిరునవ్వు నవ్వుతూ ఇద్ధర్న్నీ లేవనెత్తి "ఇకమీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తు వుంటుంది" అని కోతిని ఆశీర్వదించాడు