కురు పాండవ యుద్ధంలోకౌరవ సైన్యం మొత్తం మంటగలిసిపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం నేలకూలింది. సుయోధనచక్రవర్తి భీమసేనుడి గదాఘాతం వల్ల తొడలు విరిగి దుమ్ములో ధూళిలో దొర్లి మరణించాడు.
"హా! నాయనా! ఎంత అనుచితంగా అస్తమించావురా!" అంటూ ధృతరాష్ట్రుడు ఏడ్చాడు. గాంధారీ, కోడళ్ళూ సృహతప్పి పడిపోయారు. హస్తినాపురంలో అడవాళ్ళూ, పిల్లలూ యుద్ధంలో చనిపోయిన వారికోసం ఆక్రందనలు చేస్తూ, కేకలు వేస్తూ వుంటే ఆ ధ్వనులు ఎక్కడచూసినా ప్రతిధ్వనిస్తున్నాయి.
"తమ్ముడా! విదురా! అనాథనయిపోయాను! అందరూ పోయారు! ఇంక నువ్వే నాకు దిక్కు" అంటూ దుఃఖించాడు ధృతరాష్ట్రుడు.
"మహారాజా! అజాత శత్రుడి మంచితనాన్ని బలహీనతగాను, చేతగానితనంగాను భావించి నిష్కారణవైరం కొనితెచ్చుకున్నారు. తాటాకు మంటలాంటి కోపం వల్ల హాని లేదు. దీర్ఘక్రోధం వల్ల కీడు కలుగుతుంది. తమకు బలం ఎక్కువగా వుంటే యుద్ధం చెయ్యాలి. శత్రువులకు బలం ఎక్కువుగా వుంటే సంధి చేసుకోవాలి. అది రాజనీతి. పైగా పాండవులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు హరి. అది తెలిసి కూడా మూర్ఖంగా పౌరుషానికి పోయరు. కృష్ణార్జునుల బలం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు చింతించి ఫలమేమిటి?" అన్నాడు విదురుడు. ఇంతలో వ్యాసుడు కూడా వచ్చాడు. " నాయనా! నీకు తెలియనిదీ, నీకు కొత్తగా చెప్పవలసినదీ ఏదీ లేదు. భూభారం కొంత తగ్గడానికే ఈ యుద్ధం జరిగింది. ఇకమీదట ధర్మరాజునే నీ కుమారుడిగా భావించుకో. పాండవులందరినీ ప్రేమాభిమానాలతో చూడు" అని ధృతరాష్ట్రుడికి హితవు చెప్పాడు.
ఇలా అంటూ వుండగానే కృష్ణుడు, ధర్మరాజు వచ్చారు. ధర్మరాజు పిన తండ్రికి వంగి నమస్కరించాడు. శోకంలో వున్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు శరీరమంతా తడిమి చూసి కౌగలించుకున్నాడు. మరి కాసేపటికి భీమసేనుడు వచ్చాడు. "రారా తండ్రీ! రా" అని భీముణ్ణి రెండు చేతులతోనూ దగ్గరకు తీసుకోబోయాడు ధృతరాష్ట్రుడు. భీముణ్ణి వద్దని సైగ చేసి ఇనుముతో చేసిన ఒక బొమ్మను ఆ ధృతరాష్ట్రుడు ముందు నిలబెట్టాడు కృష్ణుడు. ఇనుపమయంగా వున్న ఆ బొమ్మను భీమసేనుడే అనుకుని ధృతరాష్టుడు రెండు చేతులతోనూ గట్టిగా నొక్కి, తన ఉక్కు కౌగిలిలో బిగించి అమితమైన కోపంతో అలాగే హతమార్చబోయాడు. తీరా నొక్కాకా "అయ్యో! నా ప్రేమాతిశయం వల్ల ఏమీ తెలీలేదు. నా కౌగలిలో భీముదు మరణించలేదు కదా" అని కల్లబొల్లి విచారాన్ని నటించాడు.
"ప్రభూ! మీ వల్లమాలిన ప్రేమ ఇంతపని చేస్తుందని నేను ముందే గ్రహించను. భీముణ్ణి మీ పరిష్వంగంలోకి వెళ్ళవద్దని కళ్ళతోనే హెచ్చరించాను. మీ కౌగిలిలో విరిగిముక్కలైంది భీమసేనుడు కాదు, ఒక ఇనుప విగ్రహం! దైవానుగ్రహం వల్ల భీముడు క్షేమంగానే వున్నాడు" అన్నాడు కృష్ణుడు. గత్యంతరం లేక కోపాన్ని దిగమించుకున్న ధృతరాష్ట్రుడు పాండుపుత్రులందరినీ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు.