భోజరాజు - సాలభంజికలు
పూర్వం భరత ఖండంలో దక్షిణ మండలాన ధారా నగరాన్ని భోజరాజు పరిపాలిస్తు ఉండేవాడు. అతని రాజ్యం సకల భోగాలతో, పండిత శ్రేష్టులతో, సకల ధర్మాలు తెలిసిన ప్రజలతో నిత్యం కళ కళ లాడుతూ ఉండేది. భోజరాజు కూడా ప్రజల పట్ల పిత్రువాత్సల్యంతో, ధర్మము తప్పక, నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా నిష్పక్షపాతం గా పరిపాలించేవాడు. ప్రజలందరికీ ఆ ప్రభువంటే ఎనలేని భక్తి విశ్వాసాలు ఉండేవి.ఇలా ప్రజారంజకంగా పరిపాలిస్తున్న భోజరాజుకి అడవి మృగములు గ్రామాలపై పడి పంటలను నాశనం చేస్తున్నవని, వాటి వల్ల ప్రజలు అపాయం కలుగుతున్నదని వార్త తెలిసింది. వెంటనే భోజరాజు తన ప్రధాన మంత్రి బుధిసాగరుడిని పిలచి "మహామంత్రీ ! అడవి మృగాలవలన పంటలు నాశనం అవుతున్నవని, ప్రజలకు అపాయం కలుగుతున్నదన్న విషయం మీకు తెలుసు కదా. తక్షణమే సైన్యం సిద్ధం చేయించండి. నేడే మనము అరణ్యానికి వెళ్ళి ఆ జంతువులని తుద ముట్టిద్దాము" అన్నాడు.
రాజాఙ్ఞ కాగానే వేటకి సర్వం సిద్ధం అయ్యింది. భోజరాజు సర్వ సైన్య సమేతంగా అడవికి ప్రయాణం అయ్యాడు. అడవికి చేరిన మహారాజు ఎన్నో క్రూరజంతువులని వేటాడాడు. ఎన్నో పులులు, ఎలుగులు భోజ మహారాజు భాణాలకి ఎర అయ్యాయి. అలా అన్ని మృగాలని వేటాడి సర్వ సైన్య సమేతుడై రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
తిరుగు ప్రయాణం వేళకు మధ్యాహ్నం అయ్యింది. భోజరాజుతో సహా మిగిలిన సైన్యానికి కూడా విపరీతంగా ఆకలి వేయసాగింది. అదే సమయంలో వారికి దారిలో ఒక కోతకు వచ్చిన సజ్జ చేను కనపడింది. దానిని శ్రవణభట్టు అనే బ్రాహ్మణుడు కాపాలా కాస్తున్నాడు. పంట కోతకు రావటంతో పొలము మధ్యలో ఒక పెద్ద మంచె కట్టుకొని వడిసెల తిప్పి పక్షులని బెదర కొడుతున్నాడు.
అతడు దూరం నుంచి వస్తున్న సైన్యాన్ని, ముందుగా వస్తున్న భోజరాజుని చూసి తన జన్మ ధన్యమైందని అనుకుని మంచ పైనుండే "మహా ప్రభూ ! వందనములు. తమరి రాకతో నా జీవితం ధన్యమయింది. మీరు నా కోరిక మన్నించి ఈ పూట నా ఆతిధ్యం స్వీకరించండి" అన్నాడు.
అస్సలే ఆకలితో ఉన్న మహారాజుకు మిగిలిన వారికి ఆ మాటలు అమృతం పోసినట్లయింది. వారు సంతోషం గా ఒప్పుకున్నారు. అప్పుడు శ్రవణభట్టు "మహారాజా ! తమరు నా పొలంలో ఉన్న ఆ మహా వృక్షం క్రింద విశ్రాంతి తీసుకోండి. ఆ పక్కనే ఉన్న బావిలోని నీరు కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటాయి. కొంచం సేద తీరాక నా పొలంలో ఉన్న సజ్జలు మీకు కావలసినంత తినవచ్చును" అన్నాడు.
అందుకు ఒప్పుకున్న మహారాజు సైన్యంతో సహా చెట్టుకింద చేరి మంచినీళ్ళు తాగి కాసేపు విశ్రమించటానికి పూనుకున్నారు.
ఇంతలో శ్రవవణభట్టు "మహా ప్రభూ ! నా వంటి పేద బ్రాహ్మణుడి కోరికను మన్నించి మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. అనులకే కదా మిమ్ములను ప్రజలకి దైవ సమానులయ్యారు. దయచేసి మీరంతా వచ్చి నా పొలములో చక్కగా పండిన సజ్జలను తనివి తీరా ఆరగించండి. ఒక వేళ సజ్జలు ఎవరికైనా ఇష్టం లేకపోతే పక్కనే ఉన్న నా దోస తోటలో మంచి దోస పండ్లు ఉన్నాయి. ఎవరికి ఏది కావలనో అది తినండి " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన మహారాజు, వారి సైన్యం పొలంలోని సజ్జలు, దోసపండ్లు ఎవరికి కావలసినది వారు కోసుకొని తినటం ప్రారంభించారు.
ఇంతలో ఏదో పనిమీద మంచె మీదనుంచి దిగిన శ్రవణభట్టు మంచె దిగగానే పొలంలో సజ్జలను దోసపండ్లను తింటున్న సైన్యాన్ని చూసి కోపంతో "ఔరా ఎంత ఘోరం ! పట్టపగలు నేను పొలానికి కాపలా ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా నా పొలం అంతా నాశనం చేస్తున్నారే. ఇది భోజుని రాజ్యం. ఇక్కడ అన్యాయానికి తావు లేదు. ఈ విషయం మహారాజుకు తెలిస్తే మిమ్మలను కఠినంగా శిక్షిస్తారు. నాశనం చేసింది చాలుగానీ ఇంక వెళ్ళండి. లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు. " అంటూ అరిచాడు.
ఆ మాటలు విన్న మహారాజు, సైన్యం ఆశ్చర్యపోయారు. "మహారాజునై నేను ఈ విధంగా ప్రవర్తించటం సరి కాదు" అనుకుని సైన్యం తో తిరిగిపోవటానికి సిద్ధం అయ్యాడు.
ఈ లోగా మళ్ళీ మంచె మీద చేరిన శరవణభట్టు, వెనుతిరిగి పోతున్న సైన్యాన్ని చూసి "అయ్యలారా ! అప్పుడే మీ కడుపులు నిండాయా? మిమ్ములని చూస్తే మీరు సరిగ్గా తినలేదనిపిస్తోంది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. దయచేసి అర్ధాకలితో మాత్రం వెళ్ళకండి " అన్నాడు దీనంగా.
ఇలాగ శ్రవణభట్టు రెండుసార్లు మంచె దిగినప్పుడు ఒక విధంగా మంచె మీద ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించటం గమనించిన భోజరాజు మహామంత్రి బుధిసాగరుని పిలిచి "మహామంత్రీ ! ఈ బ్రాహ్మణుది ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈతనికి మతికానీ చలించలేదు కదా! ఇతను మంచె మీద ఉన్నప్పుడు చాలా వినయంగా మంచివాడుగా ప్రవర్తిస్తున్నాడు. మంచె దిగ గానే హటాత్తుగా మారిపోతున్నాడు. ఇది ఆ మంచె ప్రభావమా లేక ఇతనికు మతి లేదా?" అని అడిగాడు.
అందుకు మహామంత్రి "మహారాజా ! నాకు మాత్రం ఇదేదో మంచెకి సంబంధించినదిగా తోస్తోంది. ఆ మంచె ఉన్న స్థల ప్రభావం వలనే అతను అలా ప్రవర్తిస్తున్నాడు " అన్నాడు.
సరే ఇదేదో మనమే స్వయంగా తేల్చుకుందాము అనుకున్న మహారాజు శ్రవణభట్టుని పిలిచి"బ్రాహ్మణోత్తమా ! తమరు మామీద జాలి చూపించి మా ఆకలి భాదను తీర్చారు. కానీ మావలన మీ పొలం నాశనం అయ్యింది. అందుకు ప్రతిఫలం గా మీకు ఐదు గ్రామాలు, ఒక చేను ఇస్తాను . దయచేసి ఈ పొలాన్ని మాకు ఇవ్వండి " అన్నాడు.
ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆనందంతో "మహాప్రభూ ! తమరు దయతో అంతగా అనుగ్రహిస్తే ఎలా కాదనగలను? తమకు ఏది ఉచితం ఐతే అలాగే చెయ్యండీ " అన్నాడు. ఆ విధంగా ఆ స్థలం మహారాజుకి స్వాధీనమయింది.
వెంటనే మహారాజు ఆ మంచె ఉన్న స్థలాన్ని తవ్వించటానికి ముహూర్తం పెట్టించి అక్కడ పూజలు జరిపి తవ్వకం మొదలు పెట్టాడు. కొంత సేపటికి అక్కడనుంచి ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు.
దానిని చూసిన భోజరాజు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ సింహాసనాన్ని అత్యంత వైభవంతో తన నగరానికి తరలించి దానికి అభిషేకాదులు చేయించాడు. తరవాత బ్రాహ్మణులకు అన్నదాన భూదాన, గోదానములు చేసి, తాను దేవేంద్ర వైభవంతోమిక్కిలు ఉత్సాహంతో ఆ సింహాసనాన్ని ఎక్కటానికి బయలుదేరాడు. అలా బయలుదేరి మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి.
ఆ వింతకి అబ్బురపడ్డ భోజరాజు "ఓ ప్రతిమలారా ! మీరెవరు? ఈ సింహాసనం ఎవరిది? మీరలాగు చప్పట్లు కొట్టి ఎందుకునవ్వారు? నేను ఈ సింహాసనానికి తగిన వాడను కానా? " అని ప్రశ్నించాడు.
అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.
అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.
అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.