పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హిందూ ధర్మమే మూలాధారమైనది
మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులెనె్నన్నో సమృద్ధిగా ఉన్నాయి. పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము. ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ‘్ధర్మం’ అని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు ఉపనిషత్తులు పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.
హిందుత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హిందూ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం అందించిన జీవన రచనా విధానం వల్లనే హిందూ సమాజం ‘చిరంజీవి’ అయింది.
బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది.మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం. ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హిందూ ధర్మచింతన ప్రసాదిస్తున్నది. ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి