మానస సరోవరము
మానస సరోవరము అత్యద్భుతమైన, విశాలమైన (చుట్టు కొలత ౧౦౬ కి.మీ) సరస్సు వాల్మీకి రాసిన రామాయణంలో ఈ సరస్సు బ్రహ్మదేవుడు తన మనసులో సృష్టించినాడని వ్రాశాడు. బ్రహ్మ మనసునుండి పుట్టినది గనుక మానస సరోవరము అనడము జరిగినది. ఈ సరోవర మహిమల ప్రసిద్ధి వాసికెక్కినది. దేవతలు ఈ సరోవరములో స్నానము చేయడానికి స్వర్గలోకమునుండి ప్రతి రాత్రి వస్తుంటారని, పండుగ రోజుల్లో, నిండు పున్నమి రాత్రులలో తప్పక వస్తారని ప్రతీతి. తమ నిజ రూపములో రావడం, పది మందికి కనిపించడము ఇష్టము ఉండదు గనుక వారు నక్షత్ర రూపములో వచ్చి సరోవర ప్రాంతములో విహరించి, జలకములాడి తిరిగి వెళ్తారని అనుకోవడము నిజము. విష్ణుమూర్తి, లక్షిదేవి శేషతల్పము మీద ఈ సరస్సులో అపుడపుడు కనిపిస్తారని కూడా విన్నాము. ఈ సరస్సు కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉండడము మూలంగా శివుడు నటరాజుగా సరోవర తటాన్ని దర్శించి ఆనంద తాండవము చేస్తాడని కూడా ప్రతీతి. అలాంటి మహాత్మ్యము కలిగిన సరోవరాన్ని దర్శించాలని, అందులో జలకాలాడి పునీతులము కావాలని ఎన్నో రోజులనుండి కోరిక.
అంత దూరము వెళ్ళినపుడు శివపార్వతులు నివసించే కైలాస పర్వతాన్ని కూడ దర్శించాలనే పట్టుదల ఈ విహారానికి నాంది పలికింది. ఈ పర్వత శిఖరాన శివుడు పార్వతి, కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నది తదితర ప్రమధగణాలతో నివసిస్తారని, ఈ పర్వతాన్ని ఎక్కగలిగితే వచ్చే పుణ్యము పునర్జన్మ లేకుండా చేస్తుందని, మృత్యువును జయించినట్లేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పార్వాతీదేవికి జన్మనిచ్చిన పర్వతరాజు మేరు, మహారాణి మేనక నివాసము కూడా ఈ పర్వతశ్రేణిలో ఉండడం వలన ఈ విహారము వలన పుణ్యము, పురుషార్ధము కలసి వస్తుందని కోరిక మరీ బలపడింది.
ఈ రెండు సుప్రసిద్ధ, చారిత్రాత్మక, ఆద్యాత్మిక స్థలాలు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండడము మూలంగా అందరికి వీలుపడదు. కైలాస శిఖరము పూర్తి ఎత్తు ౨౧,౦౦౦ అడుగులు. ఐతే మానవమాత్రులు పోగలిగిన ఎత్తు ౧౯,౦౦౦ అడుగులు మాతమే. ఆ చివరి రెండువేల అడుగుల ఎత్తున ఉన్న పర్వత శిఖరము ఎప్పుడూ తెల్లని మంచుతో నిండి వుంటుంది. శివుని దర్శనము ఈ మానవ సహజమైన శరీరానికి అందనిది. శివుడు గాని, విష్ణుమూర్తి కాక ఇంకే దేవున్నైనా చేరాలంటే మన శరీరమేకాక, మనస్సుకూడా నిర్మలమై, దైవభక్తితో పునీతమై వుంటేనే వీలు పడుతుంది. అంటే ఆధ్యాత్మికంగానే వీలు పడుతుంది. ఆ అదృష్టము కొందరు మహాత్ములకే వీలుపడుతుంది. మనలాంటి మానవ మాత్రులకు కనీసము పర్వత ప్రాంగణము. పర్వత శ్రేణి పైకి వెళ్ళగలిగితే ఆ అదృష్టమే చాలుననే కోరిక మనలను ఈ ప్రయత్నానికి పురికొల్పుతుంది.