Followers

Monday 5 August 2013

ఆషాఢమాసం - ప్రత్యేకతలు


                    ఆషాఢమాసం అనగానే చాలా మందిలో దుర్ముహుర్తాలు మొదలు కానున్నాయి అనే భావన ఉంటుంది. నిజానికి అలాంటిది ఏమి ఉండదు. పైగా ఆషాఢమాసం చాలా పవిత్రమైనది కూడానూ. ఉదాహరణకు అత్యంత శక్తివంతురాలు అయినటువంటి పార్వతీదేవి యొక్క వివిధ స్వరూపాలకు ఈ మాసం లోనే అనేక పూజలు జరుగుతాయి. ఈ మాసం లోనే తెలంగాణా ప్రాంతం లో అమ్మవారికి బోనాల జాతర జరుగుతుంది. మిగిలిన ఆంధ్ర్ర రాష్ట్రం లో కూడా అమ్మవారు ( విజయవాడ కనక దుర్గ తో సహా ) శాకంబరీ దేవి రూపంలో వివిధ పూజలు అందుకుంటుంది. 
                  అంతే గాక ఆషాడమాసం లోనే పవిత్రమైనటువంటి "తొలి ఏకాదశి" పండుగ వస్తుంది. వేదోపనిషత్తుల రూప కర్త సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయినటువంటి వేద వ్యాసులు కూడా ఈ మాసం లోనే జన్మించారు. కొన్ని ప్రాంతాలలో ఆషాఢమాసం లో పెళ్ళిళ్ళు చక్కగా జరుపుకుంటారు. 

తొలి ఏకాదశి : ఆషాఢమాసం లో వచ్చే ఈ పండుగ చాలా పవిత్రమైనది. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ నాడు "చాతుర్మాస్య వ్రతం" మొదలవుతుంది. ఈ వ్రతాన్ని నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం లో ముగుస్తుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది. చాతుర్మాస్య వ్రతం గురించి ఇంకా తెలుసుకోటానికి ఇక్కడ నొక్కండి.

పూరి జగన్నాథ రథ యాత్ర : ఉతర భారత దేశం లో జరుపుకునే ఈ పండుగ ఆషాఢమాసం శుద్ధ విదియ నాడు వచ్చేదే. ఒరిస్సా రాష్ట్రం లోని "పూరి" అనే ప్రాంతంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. రథ యాత్ర లో మొత్తం మూడు రథాలలో జగన్నాథుని గా వెలసిన శ్రీ కృష్ణుడు, బలరాముడు మరియు వారి సహోదరి సుభద్రలను ఊరేగిస్తారు. వీరు ఉన్న ఆలయం నుండి రెండు కిలోమీటర్ల వరకు ఈ రథ యాత్ర కన్నుల పండుగ గా కొనసాగుతుంది. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటారు. అలా ఊరేగించి తీసుకెళ్ళిన వారిని వారి అత్త గృహంలో ఒక వారం రోజుల పాటు వుంచి మళ్లీ తిరిగి స్వస్థానాలకు తీసుకెళ్తారు. ఈ రథయాత్ర యొక్క అంతరార్థాన్ని"కఠోపనిషత్తు " లో చక్కగా వర్ణించారు కఠ మహర్షుల వారు.
       "ఆత్మనాం రాతినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ".
         భావం: శరీరం రథము, ఆత్మయే అందులో ప్రతిష్టితమైన భగవంతుడు. నీకున్న జ్ఞానమే నీ మనస్సుని ఆలోచనలను సమన్వయ పరుస్తూ నిన్ను ముందుకు నడిపే రథ సారథి.

గురు పౌర్ణమి : సకల వేదాలను భారతావనికి అందించినటువంటి మహానుభావుడు శ్రీ వ్యాస భగవానుడు జన్మించిన రోజును నేటికి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆషాఢమాసం పౌర్ణమి రోజున వ్యాసుడు జన్మించాడు. 

ఉజ్జయిని మహంకాళి జాతర: సికింద్రాబాదు లో కొలువై ఉన్నఉజ్జయిని మహంకాళికి ప్రజలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే బోనాలు ఆషాఢమాసం లోనే జరుపుతారు. ప్రతి ఏటా ఆషాఢమాసం లోని మూడవ ఆది వారము నాడు ఈ జాతరను భక్తులు భక్తి పారవశ్యం తో జరుపుకుంటారు. ఇక్కడి ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని పూర్వం ఉజ్జయిని ప్రాంత శిల్పులతో చెక్కించి తీసుకు రావటం వాళ్ళ ఈ మహంకాళీ అమ్మ వారు ఉజ్జయిని మహంకాళీ గా పిలువ బడుతుంది. ఇంతకంటే ముందు వారమే అనగా ఆషాఢమాసం రెండవ ఆది వారం నాడు గోల్కొండ కోటలో సమర్పించే బోనాలతో తెలంగాణా ప్రాంతం లో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇక నాల్గవ ఆదివారం మిగిలిన నగర వాసులు తమ తమ ఊళ్లలో వెలసిన అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటారు. అలా తెలంగాణా లోని అన్ని ప్రాంతాల ప్రజలు దసరా, దీపావళి పండుగల వరకు తమ వీలుని బట్టి ఏదో ఒక ఆదివారం నాడు బోనాలు జరుపుకుంటూనే వుంటారు.

ఆషాఢమాసం లో వివాహాలు ఎందుకు జరుపుకోరు? : నిజానికి ఆషాఢమాసం లో వివాహాలు జరుపుకోకూడదు అని మన శాస్త్రం లో ఎక్కడా చెప్పబడలేదు. చక్కగా జరుపుకోవచ్చు. కేవలం ఇది అపోహ మాత్రమే. అసలు ఈ ఆషాఢమాసము శుభ కార్యాలకు మంచిది కాదు అని వచ్చిన అపోహలకు కారణాలు ఇవై ఉండవచ్చు. ఆషాఢమాసం లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. జ్వరాలకు, వివిధ రోగాలకు ఇది అనువైన కాలం. బంధువులు, మిత్రులు లేదా ఇంట్లో వారు అనారోగ్యం తో వుండే అవకాశాలు ఎక్కువ. అప్పట్లో వైద్యం కూడా సరిగ్గా అందుబాటులో ఉండేది కాదు.  మరణాలు కూడా సంభవించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కావున ఆ రోజుల్లో వాళ్ళకి ఇదొక పెద్ద సమస్య గానే ఉండేది. ఇక రెండో కారణం, పూర్వాకాలంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎన్నో ఉండేవి. కాబట్టి వాళ్ళకు వ్యవసాయ పనులకు ఇది చక్కటి సమయం. ఊళ్ళో వాళ్ళంతా వారి వారి పొలం పనులలో మునిగి తీరిక వుండేది కాదు. ఈరోజుల్లో జరుపుకుంటున్నాం కాని వెనుకటి రోజుల్లో ఊళ్ళో వాళ్ళు లేకుండా పెళ్లి అంటే వాళ్లకు కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి ఈ మాసం లో పెళ్లిళ్లకు వాళ్ళు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు కాకపోవచ్చు. అంతే గాక మూడో కారణం, ఇదే మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ తో ప్రారంభించే చాతుర్మాస్య వ్రతం లో ఆచరించ వలసిన ఆహారనియమాలు పెళ్లి విందు భోజనాలకు అనువైనవి గా ఉండేవి కాకపోవచ్చు. 

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన యువతి భర్తకు గానీ అత్తకు గానీ దూరంగా ఉండాలా? : అవసరమే లేదు. ఈ విషయాలు కూడా శాస్త్రాలలో ఎక్కడా కనిపించవు. కేవలం అపోహలే. వ్యవసాయం పనులు చక్కగా చేసుకొనే అనువైన సమయంలో  కొత్త భార్య పక్కన వుంటే పనులు జరగవేమో అన్న కారణం అయి ఉండవచ్చు.

Popular Posts