ఎందుకో – సీతమ్మ శ్రీరాముడికన్నా వయసులో పెద్దది
అనే ప్రచారం ఉన్నది. దీనికి కారణం ఏమయి
ఉంటుందో! వాల్మీకి రామాయణంలో ఈ విషయం
గురించి, ఒక సంధర్భంలో తేటతెల్లంగా వివరాలు
దొరుకుతాయి.
అరణ్యకాండ 47వ సర్గ. యతి వేషంలో రావణాసురుడు
సీతాదేవి వద్దకు వచ్చినప్పటి సంధర్భం. తానెవరని
యతి వేసిన ప్రశ్నకు సమాధానంగా తన వివరాలు
చెబుతుంది సీతమ్మ. ఆ సర్గలో పదవ శ్లోకం…
మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః |
అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||
అర్థం: మిగులు పరాక్రమశాలియగు నా భర్త యొక్క
అప్పటి* వయస్సు ఇరువదిఐదు సంవత్సరములు.
నా
వయస్సు పదునెనిమిది సంవత్సరములు.
* ‘అప్పటి’ – అంటే తాము అరణ్యవాసానికి
బయలుదేరినప్పటి వయసును అమ్మవారు తెలిపారు.
శ్రీరాముడు సీతమ్మకన్నా వయసులో ఏడేళ్ళు పెద్ద
వాడు. ఇందులో అనుమానమే లేదు. వనవాసంలో
పదునాల్గవ సంవత్సరం మొదలుకావస్తున్నందున,
యుద్ధం జరిగినప్పటికి వారి వయసును లెక్క
కట్టవచ్చు. రామరావణ యుద్ధం జరిగినపుడు
శ్రీరామునికి 39వ సంవత్సరం నడుస్తుంటే, అమ్మవారికి
32 నడుస్తున్నాయి.
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి |
నిందితస్స జనో లోకే స్వాఽఽత్మాప్యేనం విగర్హతే ||