వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు
వధువు: లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.
బాసికము: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుఘమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమ వైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.
అడ్డుతెర: దీనికి మరోపేరు తెరశెల్ల తెల్లని వస్త్రంపై శ్రీ (స్వస్తిక్) అని వ్రాయబడి ఉంటుంది. వధూవరులను తూర్పు, పడమరలకు అభిముఖముగా కూర్చోబెట్టి, మంగళ వాయిధ్యాల మధ్య, ముత్తయిదువులు మంగళగీతాలు మరొకవైపు ఆలపిస్తుండగా, వధూవరులచే మహా సంకల్పం చెప్పిస్తారు.
కన్యాదానం: కన్యాదాన సమయంలో విష్ణు స్వరూపుడైన నీకు (వరునకు) బంగారు ఆభరణముల చేత అలంకరించబడిన నా కూతురు (వధువు)ను సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఈ శ్లోకం చేబుతాడు కన్యాదాత.
కన్యాంకనక సంపన్నాం కనకా భరణైర్యుతామ్
దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా
దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా
జీలకర్ర - బెల్లం: ఈ జీలకర్ర బెల్లం అనేది ఒక పాసిటిమ్ ఎలక్ట్రిక్ చార్టర్. వధూవరుల పరస్పర ఆకర్షణకు లోనుకావడానికి వేద ఋషులు దీనిని నిర్ణయించారు. సహజీవనానికి నాందిగా నిలపడానికి మేధస్సును చైతన్యపరిచే ఈ జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు.
మాంగల్యధారణ:
మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా,
కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్
కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్
నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి అంటూ వరుడు మాంగల్య ధారణ చేస్తాడు.
నాతిచరామి: 'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి"
అక్షింతలు: అక్షింతల తోటే పెళ్ళికి సంపూర్ణత్వం చేకూరుతుంది. క్షతము గానివి, అక్షింతలు, అనగా ఎప్పటికి నిలిచేవని, అమరమైనవి అనేది వేదార్ధము, తెల్లని బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారుచేస్తారు. బియ్యం చంద్రుడికి సంకేతం. చంద్రుడు మన కారకుడు, వధూవరుల మనోభీష్ఠిని సుస్ధిరపరచే శక్తిని సిద్ధింపచేయడానికి చంద్రగుణానికి సంకేతంగా బియ్యాన్ని అక్షింతలుగా వాడడం మన ప్రాచీన సంప్రదాయం.
తలంబ్రాలు: పెళ్ళి పండుగలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం. ఇందులో మొదటగా వరుడు "సమాజశ్రేయస్సు కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు వధువు తలవంచి అంగీకరిస్తూ" వధువు "ఆ సంతానజీవన గమనానికి అవసరమైన పాడిపంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా తలంబ్రాలు పోస్తుంది. దానికి సమాధానంగా వరుడు "నేను అందించే ఆర్ధిక సంపదను అణకువగా, సమయోచితంగా వినియోగించమని" తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇరువురూ "త్యాగంతో, ధనంతో సహజీవనము సాగిద్దాము, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందామని" ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు. ఇవి వధూవరులకు ప్రమాణాలు, చూసేవారికి వేడుకలు.
సప్తపది - ఏడడుగలు: వధూవరులు నిలబడి ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రములు పఠిస్తారు. ప్రణాళికా బద్ధంగా ప్రగతి శీలమైన జీవనము కొరకు అగ్నిసాక్షిగా సంకల్పం తీసుకుంటూ దైవా నుగ్రహం జీవితమంతా లభిస్తుందని భావిస్తూ ఏడడుగులు వేస్తారు.
- మొదటి అడుగు - అన్నవృద్ధికి
- రెండవ అడుగు - బలవృద్ధికి
- మూడవ అడుగు - ధనవృద్ధికి
- నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
- ఐధవ అడుగు - ప్రజాపాలనకి
- ఆరవ అడుగు - దాంపత్య జీవనానికి
- ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
అరుంధతీ దర్శనము:ఈ భూగోళము ధ్రువము ఈ ఉత్పత్తి స్ధానము ధ్రువము. నీవు ధ్రువముగా ఉందువుగాక! నక్షత్రముల సమూహమున అరుంధతీవలె ధ్రువత్వమును పొంది వర్ధిల్లుము.