ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఏడవ అధ్యాయం
శ్రీరాజోవాచ
యేన యేనావతారేణ భగవాన్హరిరీశ్వరః
కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో
పూతనా మోక్ష వృత్తాంతాన్ని విన్న పరీక్షిత్తు పరమాత్మ ఆచరించే కర్మలన్నీ విశేహ్సముగా ఉంటాయి, వినటానికి చెవులకి ఇంపుగా ఉంటాయి, మనసుకూ నచ్చినవిగా ఉంటాయి.
యచ్ఛృణ్వతోऽపైత్యరతిర్వితృష్ణా సత్త్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః
భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్
పరమాత్మ ఆచరించే విచిత్రమిన లీలలు విన్నవారికి భగవంతుని మీది అరతి (అప్రీతి) తొలగిపోతుంది, సోమరితనం తొలగిపోతుంది. ఆశలేకుండా ఉండుట కలిగి మనసు త్వరగానే శుద్ధి పొందుతుంది. పరమాత్మ యందు భక్తీ పరమాత్మ భక్తుల యందు స్నేహమూ కలుగుతాయి. అటువంటి పరమాత్మ లీలలు మీరు చెప్పాలనుకుంటే చెప్పండి
అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతమ్
మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురున్ధతః
పూతనా మోక్ష చరితమే ఇంత అద్భుతముగా ఉంది. శిశువుగా ఉన్న స్వామి చేసిన మిగతా లీలలు కూడా చెప్పవలసింది.
శ్రీశుక ఉవాచ
కదాచిదౌత్థానికకౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితామ్
వాదిత్రగీతద్విజమన్త్రవాచకైశ్చకార సూనోరభిషేచనం సతీ
పిల్లవాడు బోర్లా పడ్డాడు అని అందరూ ఉత్సవం చేయాలనుకున్నారు. ఆ రోజే స్వామి యొక్క జన్మ నక్షత్రం. మకు పుట్టిన రోజు నక్షత్రాన్ని బట్టే చేసుకోవాలి.
అక్కడ స్త్రీలూ పురుషులూ కలిసారు, బ్రాహ్మణులూ గోవులూ అందరూ వచ్చారు.
వాదిత్రములు (మంగళ వాద్యాలు) పాటలు బ్రాహ్మణుల స్వస్తి పుణ్యాహవాచములతో పిల్లవానికి అభిషేచనం (అభ్యంగనం) చేసారు.
నన్దస్య పత్నీ కృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః
అన్నాద్యవాసఃస్రగభీష్టధేనుభిః సఞ్జాతనిద్రాక్షమశీశయచ్ఛనైః
యశోదమ్మ పిల్లవానికి బాగా అలంకరించి బ్రాహ్మణులు చేసిన స్వస్తి వాక్యాలు తీసుకుని, బ్రాహ్మణులకు భోజనములూ వస్త్రములూ పుష్పమాలలూ గోవులూ ఇచ్చి పూజించారు. ఇలా బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేసిన పిల్లవాడు కనులు మూసుకున్నాడు.
ఔత్థానికౌత్సుక్యమనా మనస్వినీ సమాగతాన్పూజయతీ వ్రజౌకసః
నైవాశృణోద్వై రుదితం సుతస్య సా రుదన్స్తనార్థీ చరణావుదక్షిపత్
పిల్లవాడు బోర్లాపడటం అనే పండుగను ఉత్సాహముగ చేస్తున్న యశోదమ్మ వచ్చిన బంధువులను పూజిస్తూ పిల్లవాడు లేచి ఏడుస్తున్న సంగతి వినలేదు.
ఆ పిల్లవాడు పాలు తాగాలని కోరి తన పాదాలను పైకి లేపాడు
అధఃశయానస్య శిశోరనోऽల్పక ప్రవాలమృద్వఙ్ఘ్రిహతం వ్యవర్తత
విధ్వస్తనానారసకుప్యభాజనం వ్యత్యస్తచక్రాక్షవిభిన్నకూబరమ్
ఒక బండి కింద పడుకోబెట్టారు పిల్లవాడిని. ఆ బండి కింద ఉన్న పిల్లవాడు కాలు ఆడించేసరికి ఆ కాలు పైనున్న బండికి తిరిగి ఆ బండి తిరగపడింది.
ఆ బండి కాస్తా పైకి లేచేసరికి చుట్టుపక్కలా ఉన్న అన్న పాత్రలూ అన్నీ చెల్లా చెదురై పోయాయి. బండి ఇరుసూ చక్రాలూ ఎక్కడపడితే అక్కడ పడిపోయాయి.
దృష్ట్వా యశోదాప్రముఖా వ్రజస్త్రియ
ఔత్థానికే కర్మణి యాః సమాగతాః
నన్దాదయశ్చాద్భుతదర్శనాకులాః
కథం స్వయం వై శకటం విపర్యగాత్
దీన్ని అందరూ చూచారు. బండి ఎలా తిరగబడింది. తనకు తానుగా బండి ఎలా పైకి లేచింది అని ఆశ్చర్యపోతూ ఉంటే
ఊచురవ్యవసితమతీన్గోపాన్గోపీశ్చ బాలకాః
రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః
అందరూ అడుగుతూ ఉంటే ఆ బండి పక్కనే ఆడుకుంటున్న పిల్లలు పిల్లవాడి కాలు తగిలి పడింది అని చెప్పారు
న తే శ్రద్దధిరే గోపా బాలభాషితమిత్యుత
అప్రమేయం బలం తస్య బాలకస్య న తే విదుః
అది విని వారు నమ్మలేదు. వాళ్ళకు బాలకుడనే తెలుసు గానీ కొలవడానికి వీలు కాని కృష్ణుని బలం ఎలా తెలుసు.
రుదన్తం సుతమాదాయ యశోదా గ్రహశఙ్కితా
కృతస్వస్త్యయనం విప్రైః సూక్తైః స్తనమపాయయత్
యశోదమ్మ ఏడుస్తున్న పిల్లవాడిని తీసుకుని అది ఏదో గ్రహం వలన అయ్యిందేమో అనుకుని బ్రాహ్మణులను పిలిచి రక్ష కలిపించమని అడిగి, పిల్లవానికి పాలిచ్చింది
పూర్వవత్స్థాపితం గోపైర్బలిభిః సపరిచ్ఛదమ్
విప్రా హుత్వార్చయాం చక్రుర్దధ్యక్షతకుశామ్బుభిః
మళ్ళీ వీరు, ఆ బండిని యథా ప్రకారం ఉంచారు. మళ్ళీ హోమం చేసి ఆరాధనం చేసి పెరుగూ పాలూ దర్భలూ నెయ్యితో హోమం చేసి స్వస్తి వాచనం పలికారు
యేऽసూయానృతదమ్భేర్షా హింసామానవివర్జితాః
న తేషాం సత్యశీలానామాశిషో విఫలాః కృతాః
వారందరూ కలిసి, " ఇంత పెద్ద బండి పైకి లేచి కిందబడ్డా పిల్లవానికి ఏమీ కాలేదంటే అసత్యమూ ఈర్ష్య హింస అసూయా ధంబమూ గర్వమూ, ఈ ఆరూ లేని వారు పలికిన ఆశీర్వచనములు ఎన్నడూ వ్యర్థము కావు.
ఇతి బాలకమాదాయ సామర్గ్యజురుపాకృతైః
జలైః పవిత్రౌషధిభిరభిషిచ్య ద్విజోత్తమైః
సామ ఋక్ యజు మంత్రాలతో మంత్రించిన నీటితో పవిత్ర జలముతో బ్రాహ్మణులు మళ్ళీ అభిషేకం చేసారు, మళ్ళీ స్వస్తి వాచనం చేయగా
వాచయిత్వా స్వస్త్యయనం నన్దగోపః సమాహితః
హుత్వా చాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణమ్
నందుడు బ్రాహ్మణుల చేత హోమం చేయించి వారికి చక్కని భోజనం పెట్టి చక్కని ఆవులను అలంకరించి పంపారు
గావః సర్వగుణోపేతా వాసఃస్రగ్రుక్మమాలినీః
ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్తే చాన్వయుఞ్జత
పిల్లవాడు బాగుండాలని వారికి గోవులను దానం చేసారు
విప్రా మన్త్రవిదో యుక్తాస్తైర్యాః ప్రోక్తాస్తథాశిషః
తా నిష్ఫలా భవిష్యన్తి న కదాచిదపి స్ఫుటమ్
మంత్రజ్ఞ్యులూ పండితులూ కలిసి పిల్లవానికి ఆశీర్వాదం ఇచ్చారు. అలాంటి మహానుభావుల చేత చేయబడిన ఆశీర్వాదములు వ్యర్థము కావు అని స్పష్టమయ్యింది అని తమలో తాము అనుకున్నారు
ఏకదారోహమారూఢం లాలయన్తీ సుతం సతీ
గరిమాణం శిశోర్వోఢుం న సేహే గిరికూటవత్
ఇలా కొద్ది రోజులు గడవగా ఒక నాడు పిల్లవాడిని ఒడిలో కూర్చోపెట్టి పాలు తాపింది, అలా పిల్లవాడిని ముద్దు చేస్తూ ఉంటే, ఉన్నట్లుండి పిల్లవాడు బాగా బరువయ్యాడు, పర్వత శిఖరమ అంత బరువయ్యాడు
భూమౌ నిధాయ తం గోపీ విస్మితా భారపీడితా
మహాపురుషమాదధ్యౌ జగతామాస కర్మసు
అది తట్టుకోలేక పిల్లవాన్ని భూమి మీద కూర్చోబెట్టి ఆశ్చర్యపడి పరమాత్మ యందు మనసు పెట్టి భగవంతుని ధ్యానం చేస్తూ తన ఇంటి పనిలో మునిగిపోయింది
దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః
చక్రవాతస్వరూపేణ జహారాసీనమర్భకమ్
కంసుడు పంపగా, కంసుని సేవకుడైన తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపములో వచ్చాడు.
సుడిగాలి రూపములో అలా కూర్చున్న పిల్లవాడిని హరించాడు
గోకులం సర్వమావృణ్వన్ముష్ణంశ్చక్షూంషి రేణుభిః
ఈరయన్సుమహాఘోర శబ్దేన ప్రదిశో దిశః
మొత్తం వ్రేపల్లెను చుట్టుముట్టింది సుడిగాలి. అందరి కళ్ళల్లో దుమ్ము పడింది. మహాభయంకరమైన ధ్వనితో అన్ని దిక్కులనూ ప్రతిధ్వనింపచేస్తూ స్వామిని తీసుకు వెళ్ళగా ఒక్క క్షణకాలం దుమ్ము ఆవహించి చీకట్లు వచ్చాయి.
ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసావృతమ్
సుతం యశోదా నాపశ్యత్తస్మిన్న్యస్తవతీ యతః
పిల్లవాడు ఏమయ్యాడో అని భయపడి యశోదరాగా
నాపశ్యత్కశ్చనాత్మానం పరం చాపి విమోహితః
తృణావర్తనిసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః
కృష్ణుడు ఎక్కడున్నాడో కనపడలేదు, తాను ఎక్కడున్నాడో తెలియడం లేదు. వ్రేపల్లెలో ఉన్న వారందరిదీ ఇదే స్థితి
ఇతి ఖరపవనచక్రపాంశువర్షే సుతపదవీమబలావిలక్ష్య మాతా
అతికరుణమనుస్మరన్త్యశోచద్భువి పతితా మృతవత్సకా యథా గౌః
ఆ రాక్షసుడు దుమ్ముతో ఆవారించి ఉండగా, ఇటువంటి ఘోరమైన దుమ్ములో పిల్లవాడిని చూడని యశోద వినేవారి మనసు కరిగేలాగ విలపించింది.
దూడ చనిపోయిన ఆవు పడి పొర్లినట్లుగా భూమి మీద పడి పొర్లుతూ ఉంది.
రుదితమనునిశమ్య తత్ర గోప్యో భృశమనుతప్తధియోऽశ్రుపూర్ణముఖ్యః
రురుదురనుపలభ్య నన్దసూనుం పవన ఉపారతపాంశువర్షవేగే
యశోదమ్మ ఏడుపు విన్న చుట్టుపక్కలవారు కన్నీరు పెట్టుకుంటూ వారూ వచ్చారు. దుమ్మేవానలాగ వచ్చింది. అంత వేగములో కూడా వారు ఏడుస్తూ ఉన్నారు
తృణావర్తః శాన్తరయో వాత్యారూపధరో హరన్
కృష్ణం నభోగతో గన్తుం నాశక్నోద్భూరిభారభృత్
తృణావర్తుడు తన పని అయ్యింది కాబట్టి తన వేగాన్ని తగ్గించాడు.
పిల్లవాడిని తీసుకుని కొద్ది దూరం పైకి వెళ్ళాడు. అలా పైభాగానికి వెళ్ళగా కృష్ణుడి బరువును మోయలేక ముందరికి వెళ్ళలేకపోయాడు. ఒక పెద్ద పర్వతాన్ని మెడకు తగిలించుకున్నట్లు అయ్యింది
తమశ్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా
గలే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోదద్భుతార్భకమ్
తన కంటే బరువు ఉన్నాడు. వదిలించుకుందామని అనుకుంటే స్వామి తన రెండు చేతులతో మెడను పట్టుకున్నాడు.
గలగ్రహణనిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః
అవ్యక్తరావో న్యపతత్సహబాలో వ్యసుర్వ్రజే
మెడ గట్టిగా పట్టుకుంటే విడిపించుకోలేకపోతున్నాడు. మేద పిసికినత పని చేసాడు. రెండు కనుగుడ్లూ బయటకు వచ్చాయి ఆ రాక్షసునికి. గట్టిగా అరుద్దామంటే గొంతు కూడా పెగలక, ప్రాణాలు విడిచి పిల్లవానితో సహా వ్రేపల్లెలో కింద ఒక రాయి మీద పడ్డాడు
తమన్తరిక్షాత్పతితం శిలాయాం విశీర్ణసర్వావయవం కరాలమ్
పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశుః సమేతాః
అంత ఎత్తునుంచి కిందబడితే అన్ని అవయవాలూ విరిగిపోయి, శంకరుని బాణముతో (నారాయణుడే శంకరుని బాణం) త్రిపురములు ఎలా చిన్నాభిన్నమయ్యాయో అలా ఈ రాక్షసుని అవయవాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అలా పడి ఉన్న పిల్లవాన్ని ఏడుస్తున్న స్త్రీలు చూచారు
ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసి లమ్బమానమ్
తం స్వస్తిమన్తం పురుషాదనీతం విహాయసా మృత్యుముఖాత్ప్రముక్తమ్
గోప్యశ్చ గోపాః కిల నన్దముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదమ్
అమాంతం పిల్లవాన్ని తీసుకుని తల్లికి ఇచ్చారు. పడిపోయిన రాక్షసుని మీద పిల్లవాడు పడి హాయిగా ఆడుకుంటున్నాడు. అలాంటి పిల్లవాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు. ఇంచుమించు మృత్యువు నుండి బయటపడ్డాడు.గోపికలూ గోపాలురూ నందులూ అందరూ పరమానందాన్ని పొందారు.
అహో బతాత్యద్భుతమేష రక్షసా బాలో నివృత్తిం గమితోऽభ్యగాత్పునః
హింస్రః స్వపాపేన విహింసితః ఖలః సాధుః సమత్వేన భయాద్విముచ్యతే
ఎంత ఆశ్చర్యం ఇది. ఇంత చిన్న పిల్లవాడు రాక్షసుని చేత తీసుకు వెళ్ళబడి కింద పడి కూడా క్షేమముగా ఉన్నాడంటే ఈ సంఘటన కూడా పరమ సత్యాన్ని చెబుతుంది. పది మందిని హింసించేవాడు తాను చేసిన పాపముతోనే హింసించబడతాడు. పది మందికి మంచి కోరేవాడు,సమతావాది తాను చేసే మంచి వలనే, తన సాధు గుణముల చేతనే తాను రక్షింపబడతారౌ. మనం చేసే పుణ్యపాపాలే మనను శిక్షిస్తాయీ రక్షిస్తాయి
కిం నస్తపశ్చీర్ణమధోక్షజార్చనం
పూర్తేష్టదత్తముత భూతసౌహృదమ్
యత్సమ్పరేతః పునరేవ బాలకో
దిష్ట్యా స్వబన్ధూన్ప్రణయన్నుపస్థితః
ఎంత అదృష్టవంతులం మన, ఎదో తపస్సు చేసే ఉంటాము, ఇంద్రియ జయం కలిగించే పరమాత్మను ఆరాధించే ఉంటాము, ఎన్నో యజ్ఞ్యాలూ చేసే ఉంటాము, చెరువులో తోటలో దేవాలయాలో కట్టించి ఉంటాము, పాడు బడిన దేవాయలాన్ని బాగు చేసి ఉంటాము, (కొత్త గుళ్ళు కట్టించడం కంటా జీర్ణమైపోతున్న పాత గుడిని ఉద్ధరిచడం వేయిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది) ఎంతో మంది పిల్లలకు పూర్వ జన్మలో మేలు చేసి ఉంటాము.
అందరమూ పోయాడనుకున్న పిల్లవాడు మనందరికీ ఆనందం కలిగిస్తూ క్షేమముగా వచ్చాడు.
దృష్ట్వాద్భుతాని బహుశో నన్దగోపో బృహద్వనే
వసుదేవవచో భూయో మానయామాస విస్మితః
ఇలాంటి అద్భుతాలను చూచిన నందుడు వసుదేవుడు చెప్పిన మాట నిజమే, అతను నిజముగా మహాయోగి అని అతని మాటలు తలచుకున్నాడు, ఆశ్చర్యపోయాడు
ఏకదార్భకమాదాయ స్వాఙ్కమారోప్య భామినీ
ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుతా
ఒక సారి పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. తల్లికి ముద్దు వచ్చి ఆడిస్తూ పాలిచ్చింది. ఇలా పాలు తాగిన తరువాత పిల్లవాడి చిరునవ్వు చూస్తూ ఉంది. ముఖాన్ని లాలిస్తూ, ముఖాన్ని తుడిచి ముద్దాడుతూ ఉండగా
పీతప్రాయస్య జననీ సుతస్య రుచిరస్మితమ్
ముఖం లాలయతీ రాజఞ్జృమ్భతో దదృశే ఇదమ్
అప్పుడు స్వామి ఒకసారి ఆవలించాడు
ఖం రోదసీ జ్యోతిరనీకమాశాః సూర్యేన్దువహ్నిశ్వసనామ్బుధీంశ్చ
ద్వీపాన్నగాంస్తద్దుహితౄర్వనాని భూతాని యాని స్థిరజఙ్గమాని
అప్పుడు అన్ని లోకాలూ చూపించాడు, ఆ ముఖములో ఆకాశమూ భూమీ అగ్నిహోత్రుడూ దిక్కులూ సూర్యుడూ చంద్రుడూ వనాలూ అరణ్యాలూ సకల చరాచర జగత్తుం మొత్తం చూసింది.
సా వీక్ష్య విశ్వం సహసా రాజన్సఞ్జాతవేపథుః
సమ్మీల్య మృగశావాక్షీ నేత్రే ఆసీత్సువిస్మితా
అలా చూడగా వణుకు పుట్టి కళ్ళు మూసుకుంది. ఆశ్చర్యాన్ని పొందింది.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు