Followers

Saturday, 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                                           ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏకదా గృహదాసీషు యశోదా నన్దగేహినీ
కర్మాన్తరనియుక్తాసు నిర్మమన్థ స్వయం దధి

యశోదమ్మ,  ఇంటిలోని దాసీ జనమంతా వేరు వేరు పనులు చేయించడానికి నియమించబడినందు వలన, స్వయముగా పెరుగు చిలకడానికి స్వయముగా పూనుకున్నది.

యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ
దధినిర్మన్థనే కాలే స్మరన్తీ తాన్యగాయత

పని చేస్తున్నప్పుడు పాట పాడుతూనే పని చేస్తూ ఉంటారు. అది ఏదో పాట కాకుండా కృష్ణ పరమాత్మ శైశవం నుండీ చేస్తున్న పనులనే పాటలు పాడుతూ ఉంది. వ్రేపల్లెలో స్త్రీలందరూ కృష్ణ పరమాత్మ లీలలను గానం చేస్తూనే వారి నిత్య కృత్యములు నిర్వహించేవారు. ధధి యొక్క నిర్మందన ధ్వని,ఆభరణముల ధ్వనీ, పాటల ధ్వనీ కలిసి స్వర్గం వరకూ వ్యాపించింది. ఆ మూడే అకార ఉకార మకారములు. వారు పాడుతున్న హరి కథా గానం మూడు లోకాలనూ పావనం చేస్తున్నది.

క్షౌమం వాసః పృథుకటితటే బిభ్రతీ సూత్రనద్ధం
పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకమ్పం చ సుభ్రూః
రజ్జ్వాకర్షశ్రమభుజచలత్కఙ్కణౌ కుణ్డలే చ
స్విన్నం వక్త్రం కబరవిగలన్మాలతీ నిర్మమన్థ

పట్టు వస్త్రం ధరించి, ఆ కుండకు ఉన్న తాడును లాగుతూ ఉంటే కంకణములు ధ్వనిస్తూ ఉన్నాయి. పెరుగు చాలా గట్టిగా ఉండడం వలన, ఎంతో శ్రమ పడుతూ చిలుకుతూ ఉండడం వలన చెమట పడుతూ, కొప్పు జారి, కొప్పులోని పూలు కూడా జారి సుగంధములను వ్యాపింపచేస్తూ ఉంది.

తాం స్తన్యకామ ఆసాద్య మథ్నన్తీం జననీం హరిః
గృహీత్వా దధిమన్థానం న్యషేధత్ప్రీతిమావహన్ఇ

ఈమె చక్కగా పెరుగు చిలకడములో నిమగ్నమై ఉంది. అప్పుడే పిల్లవాడు చూచి స్తన్యమును కోరి కవ్వాన్ని పట్టుకున్నాడు పరుగు పరుగున వచ్చి. అలా ప్రేమతో అడిగితే

తమఙ్కమారూఢమపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖమ్
అతృప్తముత్సృజ్య జవేన సా యయావుత్సిచ్యమానే పయసి త్వధిశ్రితే

ఆ పని కాస్తా ఆపేసి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. ఇలా పిల్లవానికి పాలు ఇస్తూ ఉండగానే దగ్గరలో పొయ్యి మీద కాగపెట్టిన పాలు పొంగిపోతున్నాయి. అప్పుడు సగం పాలు తాగిన పిల్లవాడిని పక్కన పెట్టి పొయ్యి వద్దకు వెళ్ళగా

సఞ్జాతకోపః స్ఫురితారుణాధరం సన్దశ్య దద్భిర్దధిమన్థభాజనమ్
భిత్త్వా మృషాశ్రుర్దృషదశ్మనా రహో జఘాస హైయఙ్గవమన్తరం గతః

కోపం వచ్చి అప్పుడే కొద్ది కొద్దిగా వస్తున్న పళ్ళతో పెదవులను కొరుకుతూ కుండలను పగులగొట్టి దొంగ కన్నీరుతో, పైకొచ్చిన వెన్నను తీసుకుని, ఆ వెన్న తెల్లగా ఉంటుందా నా నవ్వు తెల్లగా ఉంటుందా అన్నట్లుగా నవ్వాడు.

ఉత్తార్య గోపీ సుశృతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకమ్
భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తజ్జహాస తం చాపి న తత్ర పశ్యతీ

ఆమె కుండను దింపి అక్కడికి వచ్చి చూస్తే మొత్తం పెరుగు కింద పడి ఉంది, అంతా గందరగోళముగా ఉంది.
అర్థం చేసుకుంది. ఇది పిల్లవాడి పనే అని అర్థం చేసుకుని కాస్త నవ్వుకుంది,

ఉలూఖలాఙ్ఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచి స్థితమ్
హైయఙ్గవం చౌర్యవిశఙ్కితేక్షణం నిరీక్ష్య పశ్చాత్సుతమాగమచ్ఛనైః

తల్లికి కష్టం కలిగించకుండా తల్లి చేయవలసిన పనిని సూచించడానికి కృష్ణుడు రోటి మీద నిలబడి పక్కనున్న కోతి పిల్లలకు వెన్న అందిస్తున్నాడు.
దొంగతనముగా వెన్న తీసుకు వచ్చాడని తల్లి ఏమైనా అంటుందేమో అని మనసులో భయం తొణికిసలాడుతున్నట్లుగా బెదురు చూపులతో తల్లి వైపు చూస్తూ వెన్న తినిపిస్తున్నాడు.

తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరస్
తతోऽవరుహ్యాపససార భీతవత్
గోప్యన్వధావన్న యమాప యోగినాం
క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః

అలాంటి పిల్లవాని వద్దకు చేతిలో బెత్తం పట్టుకుని వెళ్ళింది. అలా తల్లిని చూచి భయపడిన వాడిలా ముందరకు పారిపోయాడు.
నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను అని చెబుతూ పిల్లవాడిని బెదిరిస్తూ పిల్లవాని వెంట పరిగెత్తింది. యోగులకు కూడా దొరకని స్వామిని పట్టుకుందామని యశోదమ్మ పరిగెత్తి వెళ్ళింది. తపస్సు చేత పరిశుద్ధమైన మనసులో ఏ స్వామిని చూడటానికి వీలు కాదో ఆ స్వామిని పట్టుకోవడానికి వెళ్ళింది యశోదమ్మ,


అన్వఞ్చమానా జననీ బృహచ్చలచ్ ఛ్రోణీభరాక్రాన్తగతిః సుమధ్యమా
జవేన విస్రంసితకేశబన్ధన చ్యుతప్రసూనానుగతిః పరామృశత్

పట్టుబట్టీ పరిగెడుతున్నది, ఆయన కూడా పరిగెడుతున్నాడు. కొప్పు జారిపోతోంది కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంత అవస్థ పడుతోంది. తల్లి కొడుతుందేమో అని భయపడుతూ ఏడుస్తున్నాడు. అసలే నల్లటి స్వామి, కంటికి కాటుకా, ఏడుస్తుంటే వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే, ఇంకా నల్లగా అయి స్వామి ఎక్కడ ఉన్నడో తెలియకుండా అయ్యింది. కాటుకం మొహం అంతా పూసుకుంటున్నాడు

కృతాగసం తం ప్రరుదన్తమక్షిణీ కషన్తమఞ్జన్మషిణీ స్వపాణినా
ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా భిషయన్త్యవాగురత్

భయం భయముగా వస్తుందేమో అని చూస్తున్నాడు, కళ్ళంతా కన్నీరు. కష్టపడి స్వామి దయ చూపగా పట్టుకుంది స్వామిని. పట్టుకుని బెత్తముతో కొడతా అని భయపెట్టింది. పిల్లవాడు ఇంకా భయపడ్డాడు. పిల్లవాడు భయపడుతున్నాడు కదా అని

త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా
ఇయేష కిల తం బద్ధుం దామ్నాతద్వీర్యకోవిదా

పిల్లవాడిని చూచి కొట్టలేక పిల్లవాడు భయపడుతున్నాడని తెలుసుకుని బెత్తం పక్కన పడేసింది. భగవంతుని ప్రభావం తెలియని యశోద అతన్ని తాడుతో కట్టేద్దామని అనుకుంది

న చాన్తర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరమ్
పూర్వాపరం బహిశ్చాన్తర్జగతో యో జగచ్చ యః

దేన్నైనా కట్టాలంటే అది నియమిత ప్రాంతములో ఉండాలి. ఫలాన చోట ఫలానా రూపములో ఉన్నదాన్ని పరిమాణం తెలిసినదాన్ని కట్టగలం. మరి ఈయన? లోపలా ఉంటాడు బయటా ఉంటాడు, చూచే వారిలో ఉంటాడు, ఎదురుగా ఉన్నదాన్ని చూచే కనులలో ఆయనే ఉంటాడు, మనసులో ఆయనే ఉంటాడు, వెలుపలా ఆయనే ఉంటాడు. తూర్పూ పశ్చిమా అన్ని దిక్కులూ ఉంటాడు, చిన్నవారికి చిన్నవాడు పెద్దవారికి పెద్దవాడు, మొదటివారికి మొదటివాడు తరువాతి వారికి తరువాతి వాడు. జగత్తుకు ముందూ ఉన్నాడు, జగత్తు తరువాతా ఉన్నాడు, జగత్తూ అయానే అయి ఉన్నాడు.
అలాంటి స్వామిని ఎలా కట్టేయాలి.

తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలిఙ్గమధోక్షజమ్
గోపికోలూఖలే దామ్నా బబన్ధ ప్రాకృతం యథా

ఇంతటి సర్వభూతాత్ముడైన స్వామిని మానవ దేహముతో వచ్చిన పరమాత్మను తన కొడుకుగా భావించి, యోశోదమ్మ మామూలు ప్రాకృతి శిశువుగా భావించి కట్టివేయడానికి పూనుకున్నది.

తద్దామ బధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః
ద్వ్యఙ్గులోనమభూత్తేన సన్దధేऽన్యచ్చ గోపికా

తాడు తెచ్చి పిల్లవాన్ని పట్టుకుంది, పొట్ట చుట్టూ తిప్పేసరికి రెండు అంగుళాలు తక్కువయ్యాయి, ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతోంది. తన దగ్గర ఉన్న గోవులను కట్టేయడానికి ఉన్న తాళ్ళాన్నీ తెచ్చినా చాలలేదు. అనంత కోటి బ్రహ్మాండములు దాగి ఉన్న కడుపు చుట్టూ తిప్పే తాడు కావాలంటే ఎంతటి తాడు కావాలి.

యదాసీత్తదపి న్యూనం తేనాన్యదపి సన్దధే
తదపి ద్వ్యఙ్గులం న్యూనం యద్యదాదత్త బన్ధనమ్

ఏవం స్వగేహదామాని యశోదా సన్దధత్యపి
గోపీనాం సుస్మయన్తీనాం స్మయన్తీ విస్మితాభవత్

గోపికలంతా గోపాలురంతా చూస్తున్నారు. ఇదేమి మాయ ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండంగుళాలే తగ్గుతోంది.

స్వమాతుః స్విన్నగాత్రాయా విస్రస్తకబరస్రజః
దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్స్వబన్ధనే

ఆ తల్లి ఆయాసపడుతోంది, కొప్పు జారిపోయింది, అందరూ చూస్తున్నారని సిగ్గుపడింది, తల్లిని మరీ ఎక్కువ బాధపెట్టకూడదని కృష్ణుడు కట్టుబడ్డాడు.
ఆ రెండు అంగుళాలూ మనదగ్గరే ఉంటాయి, అవి ఆయనకు ఇస్తే అమాంతం కట్టుబడతాడు. అవే అహంకార మమకారాలు. ఆ రెండు అంగాలే మనకు శరీరాన్ని ఇస్తాయి. మన శరీరాన్ని తెచ్చే రెండూ ఆయనకు ఇచ్చేస్తే మళ్ళీ మనకు శరీరం ఉండదు. యశోదమ్మ ఇక నా వల్ల కాదు అని విశ్రమించగానే ఆయన పట్టుబడ్డాడు. రామాయణములో కూడా స్వామి హనుమ నమోస్తు రామాయ స లక్ష్మణాయా దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అనగానే తల్లి కనపడింది. ఆనాడు జనకునకు కనపడినట్లు ఈనాడు నాకు కనపడు అనగానే కనపడింది. అలాగే యశోదమ్మ కూడా నావల్ల కాదు అనుకోగానే దయ చూపి కట్టు బడటానికి సంకల్పించాడు

ఏవం సన్దర్శితా హ్యఙ్గ హరిణా భృత్యవశ్యతా
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే

పరమాత్మ దాసులకు దాసుడు. ఆయన భక్తులకు పరాధీనుడు. సకల లోకపాలకులనూ తన వశములో ఉంచుకున్న స్వామి తాను పరిపాలించే ఒక చిన్నలోకములో యశోదమ్మకు వశమయ్యాడు.

నేమం విరిఞ్చో న భవో న శ్రీరప్యఙ్గసంశ్రయా
ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్

ఈ భాగ్యాన్ని ఎవరూ పొందలేదు. ఆఖరికి అమ్మవాఉ కూడా స్వామిని బంధించలేకపోయారు. సకల చరాచర జగత్తులో జీవరాశులను విడుదల చేసే స్వామి అందరి బంధాలనూ తెంచే స్వామి తాను బంధించబడ్డాడు. అందరినీ విడుదల చేస్తూ తాను మాత్రం కట్టుబడ్డాడు. ఈ దామ బంధ వృత్తాంతం విన్న వారికి అన్ని బంధాలూ వదులుతాయి. భగవంతునికి సంబంధించిన ఏ కథ వింటే ఆ కథలో ఏ సందర్భం ఉంటే అది మనకు అవుతుంది. ఉదా: రుక్మిణీ కళ్యాణం చదివితే మనకూ కళ్యాణం అవుతుంది. కానీ ఈ వృత్తాంతం చదివితే మనకు బంధనం రాదు మోక్షణమే వస్తుంది. ఏ రీతిలో పరమాత్మను తలచినా మనకు లభించేది మోక్షమే. భగవంతుని బంధం తలచినా మోక్షమే.
చిక్కడు సిరి కౌగిటిలో
చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం
జిక్కడు శ్రుతి లతికావలిం
జిక్కెనతడు తల్లి చేతన్ ఱోలన్

నాయం సుఖాపో భగవాన్దేహినాం గోపికాసుతః
జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ

ఇలా యశోదమ్మతో కట్టుబడిన దృష్టాంతం మనకు ఇంకో విషయాన్ని కూడా చెబుతుంది. సకల చరాచర ప్రాణులకు పరమాత్మ కష్టముగా కూడా దొరికేవాడు కాదు. జ్ఞ్యానులకు కూడా దొరకదు. జ్ఞ్యానులు నాకు ఆత్మ అని స్వామి గీతలో చెప్పాడు. తనకు ఆత్మగా ఉండే జ్ఞ్యానులకు కూడా ఇలాంటి భాగ్యం దొరకదు.   భక్తి కలిగే వారికి కల అదృష్టం జ్ఞ్యానులకు కూడా లభించదు అని ఈ దుష్టాంతముతో బోధబడింది. భక్తి ఉన్నవారి చేతిలో స్వామి బంధించబడతాడు.

కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభుః
అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ

ఇలా స్వామి తన పొట్ట చుట్టూ తాడుతో కట్టివేస్తే ఆ కట్టేసిన తాడు గుర్తు పరమ సుకుమారమైన స్వామి శరీరం మీద ఉండిపోయింది. పరమాత్మకు దామోదరుడు ఈ పేరు చాలా ఇష్టం.పరమాత్మ భక్త సౌలభ్యాన్ని చాటే పేరు ఈ దామోదరుడు. ఇలా పిల్లవాన్న్ కట్టేసి ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. కట్టుబడిన కృష్ణుడు ఆ రోటికి దగ్గరలోనే ఉన్న రెండు మద్ది చెట్లను చూచాడు. ఆ రెండు మద్ది చెట్లూ కుబేరుని కుమారులు. నలకూబర మణిగ్రీవులు. వారు వృక్షములుగా అయ్యారు. కృష్ణపరమాత్మను కట్టివేసిన రోలు ఉన్న పరిధిలోనే ఈ రెండు చెట్లూ ఉన్నాయి. వారికి మోక్షం ఇవ్వడానికే అలా కట్టుబడ్డాడు.

పురా నారదశాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్
నలకూవరమణిగ్రీవావితి ఖ్యాతౌ శ్రియాన్వితౌ

ఇలా స్వామి బంధనాన్ని తెచ్చుకున్నాడు. వీరిద్దరూ పూర్వ కాలము తమ ధన మదముతో విశృంకలముగా ప్రవర్తించి నారద మహర్షి వలన శాపం పొందారు. వీరు కుబేరుని కొడుకులు. నారద శాపముతో వృక్షములయ్యారు.

Popular Posts