ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై తొమ్మిదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
సుఖోపవిష్టః పర్యఙ్కే రమకృష్ణోరుమానితః
లేభే మనోరథాన్సర్వాన్పథి యాన్స చకార హ
మధురా నగరం నుండీ బృందావనం వచ్చే దారిలో అకౄరుడు ఏమేమి అనుకున్నాడో అవి అన్నీ పొందాడు. ఎలా ఎలా కృష్ణుడూ నందుడూ బలరాముడు ఆదరిస్తారని అనుకున్నాడో అవి అన్నీ పొందాడు.
రమకృష్ణోరుమానితః - బల రామ కృష్ణుల చేత గొప్పగా గౌరవించబడిన అకౄరుడు తను అనుకున్నవన్నీ పొందగలిగాడు.
కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే
తథాపి తత్పరా రాజన్న హి వాఞ్ఛన్తి కిఞ్చన
ఆయన ఇవన్నీ పొందడం గొప్ప వింతేమీ కాదు. శ్రీమన్నారాయణుడు ప్రసన్న్నుడైన తరువాత పొందరానిది అంటూ ఏదీ ఉండదు
పరమాత్మ ప్రసన్నుడైతే పొందరానిదేమీ లేకున్నా పరమాత్మ యందు భక్తి పారవశ్యం ఉన్న వారు (తత్పరులు) ఏమీ కోరరు.
సాయన్తనాశనం కృత్వా భగవాన్దేవకీసుతః
సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చికీర్షితమ్
కృష్ణ పరమాత్మ రాత్రి భోజనం పూర్తయ్యాక అకౄరున్ని తన దగ్గర కూర్చోబెట్టి మధురా నగర విశేషాలు అడిగాడు. కంసుడు మనవారి విషయములో ఎలా ఉంటున్నాడు, తన వారి విషయములో ఎలా ఉంటున్నాడు. ఇపుడు కంసుడు చేయదలచుకున్నదేమిటి.
శ్రీభగవానువాచ
తాత సౌమ్యాగతః కచ్చిత్స్వాగతం భద్రమస్తు వః
అపి స్వజ్ఞాతిబన్ధూనామనమీవమనామయమ్
నీ రాక మంచిది, నీకు మేలు కలుగుగాక. మన జ్ఞ్యాతులకూ బంధువులూ దుఃఖం లేకుండా ఉన్నారా. ఐనా అడగకూడదనుకో. మొత్తం కులానికి ఒక మహారోగం ఉండగా, ఆ రోగం ఉన్నవారిని బాగున్నారా అని అడగకూడదు కదా. కంసుడనే మేన మామ రోగం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఇంక ఆరోగ్యం ఏముంటుంది.
కిం ను నః కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే
కంసే మాతులనామ్నాఙ్గ స్వానాం నస్తత్ప్రజాసు చ
అహో అస్మదభూద్భూరి పిత్రోర్వృజినమార్యయోః
యద్ధేతోః పుత్రమరణం యద్ధేతోర్బన్ధనం తయోః
నా కారణముగా నా తల్లి తండ్రులకు భరింపరాని దుఃఖం కలిగింది. నా గురించే తక్కిన బాలురుని చంపాడు. నా గురించే తల్లి తండ్రులను చెరసాలలో పెట్టాడు. నా వలన వారికి ఇంత పెద్ద దుఃఖం కలిగింది.
దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్య కాఙ్క్షితమ్
సఞ్జాతం వర్ణ్యతాం తాత తవాగమనకారణమ్
ఇలా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి. మా వారిని ఒక్కసారైనా చూస్తే బాగుండు అనుకుంటున్నాను. ఇంతలోనే నీవు వచ్చావు.జరిగినదేమిటో చెప్పు.. నీవు రావడానికి గల కారణం ఏమిటో కూడా చెప్పు
శ్రీశుక ఉవాచ
పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః
వైరానుబన్ధం యదుషు వసుదేవవధోద్యమమ్
అకౄరునికి కూడా మాధవుడని పేరు ఉంది. యదువుల మీద ఎటువంటి వైరం పెంచుకున్నాడు, కృష్ణుడి తండ్రి మీద ఎటువంటి వైరం పెంచుకున్నాడో
యత్సన్దేశో యదర్థం వా దూతః సమ్ప్రేషితః స్వయమ్
యదుక్తం నారదేనాస్య స్వజన్మానకదున్దుభేః
యదువుల మీద ఎలా వైరం పెంచుకున్నాడో మీ తండ్రిని ఎలా చంపాలి అనుకున్నాడో, నన్ను దూతగా ఏమి ఆశించి మీ దగ్గరకు పంపాడో, నారదుడు అంతా చెప్పాడు, మీరు వసుదేవుని కుమారుడని చెప్పాడు
శ్రుత్వాక్రూరవచః కృష్ణో బలశ్చ పరవీరహా
ప్రహస్య నన్దం పితరం రాజ్ఞా దిష్టం విజజ్ఞతుః
ఇలా అకౄరుడు జరిగినదంతా చెప్పాడు. అది విని కృష్ణ బలరాములు పెద్దగా నవ్వారు. తన తండ్రిగారైన నందునితో రాజు ఐన కంసుని ఆజ్ఞ్య గురించి చెప్పారు
గోపాన్సమాదిశత్సోऽపి గృహ్యతాం సర్వగోరసః
ఉపాయనాని గృహ్ణీధ్వం యుజ్యన్తాం శకటాని చ
అతను రాజు కాబట్టి తన తోటి గోపాలురందరినీ వెంట తీసుకుని, కానుకలనూ, పాలూ వెన్న నెయ్యి మొదలైన కానుకలు తీసుకుని బళ్ళు తీసుకుని
యాస్యామః శ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్
ద్రక్ష్యామః సుమహత్పర్వ యాన్తి జానపదాః కిల
ఏవమాఘోషయత్క్షత్రా నన్దగోపః స్వగోకులే
రేపు మధురానగరానికి వెళ్ళి రాజుగారికి కానుకలు ఇద్దాము, మిత్రులనీ చూద్దాము అని నందుడు చాటింపు వేశాడు.
గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యథితా భృశమ్
రామకృష్ణౌ పురీం నేతుమక్రూరం వ్రజమాగతమ్
అందరూ విన్నారు. అందరిలాగే గోపికలు కూడా ఈ వార్త విన్నారు. మనసులో వారు బాధపడ్డారు. అకౄరుడట, కంసుడు పంపితే వచ్చాడట, బలరామకృష్ణులను తీసుకుని పోవడానికి వచ్చాడట, అది వినగానే హృదయములో ఉన్న తాపానికి ముఖాలన్నీ వాడిపోయాయి
కాశ్చిత్తత్కృతహృత్తాప శ్వాసమ్లానముఖశ్రియః
స్రంసద్దుకూలవలయ కేశగ్రన్థ్యశ్చ కాశ్చన
వస్త్రాలూ కంకణాలూ ఆభరణాలూ కూడా బాధకు తట్టుకోలేక వాటికవే జారిపోతున్నాయి. మరి కొందరు ఈ వార్తను విని దాని యందే మనసు ఉంచి ఆ విషయాన్నే నిరంతరం ధ్యానం చేయడం వలన ఇహలోక స్మృతి కూడా కోల్పోయారు
అన్యాశ్చ తదనుధ్యాన నివృత్తాశేషవృత్తయః
నాభ్యజానన్నిమం లోకమాత్మలోకం గతా ఇవ
స్మరన్త్యశ్చాపరాః శౌరేరనురాగస్మితేరితాః
హృదిస్పృశశ్చిత్రపదా గిరః సమ్ముముహుః స్త్రియః
పరమాత్మ యొక్క చిరునవ్వుతో ప్రేమతో ఆయన ఆచరించిన చేష్టలు తలచుకుంటూ, హృదయాన్ని స్పృశించి మరచిపోకుండా ఉన్న ఆయన మాటలు గుర్తు చేసుకుని మోహాన్ని చెందారు
గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనమ్
శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ
సుకుమారమైన గమనమూ, చూడగానే మనసును మైమరపించే చిరునవ్వుతో కూడిన చూపూ, ఆయన పరిహాస వాక్కులు, ఉత్తమమైన ఉన్నతమైన పరమాత్మ చరితనూ ఆలోచిస్తూ, మళ్ళీ స్వామి కనిపించడేమో అని విరహముతో దీనులైపోయారు
చిన్తయన్త్యో ముకున్దస్య భీతా విరహకాతరాః
సమేతాః సఙ్ఘశః ప్రోచురశ్రుముఖ్యోऽచ్యుతాశయాః
అందరూ గుంపుగా చేరారు. పరమాత్మ యందు మనసు లగ్నం చేసి వారిలో వారు ఇలా అనుకుంటూ ఉన్నారు
శ్రీగోప్య ఊచుః
అహో విధాతస్తవ న క్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః
తాంశ్చాకృతార్థాన్వియునఙ్క్ష్యపార్థకం విక్రీడితం తేऽర్భకచేష్టితం యథా
బ్రహ్మా, నీకు దయ అనేదే లేనట్లు ఉంది కదా. ఎపుడూ ఎక్కడా నీకు దయ అనేదే లేనట్లు ఉన్నది. జీవులనూ మైత్రితో ప్రేమతో కలుపుతావు. అంతలోనే వారిని విడదీస్తావు. ఇదంతా పిల్లలాటలా ఉంది.
యస్త్వం ప్రదర్శ్యాసితకున్తలావృతం
ముకున్దవక్త్రం సుకపోలమున్నసమ్
శోకాపనోదస్మితలేశసున్దరం
కరోషి పారోక్ష్యమసాధు తే కృతమ్
పరమాత్మ యొక్క దివ్యమైన ముఖారవిందాన్ని మాకు చూపెట్టావు. నల్లని ముంగురులు కప్పి ఉన్న ముఖం, చక్కని చెక్కిళ్ళు చక్కని ఎత్తైన ముక్కూ, ఎలాంటి వారి దుఃఖాన్నైన ఇట్టే తొలగించగల చిన్న చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని మాకు చూపించావు. ఇంత తొందరలో ఇంత చక్కని ముఖాన్ని మాకు చూపెట్టి మళ్ళీ అంతలో ఆ ముఖాన్ని చాటు చేస్తున్నావు. నీవు చెడ్డపని చేస్తున్నావు
క్రూరస్త్వమక్రూరసమాఖ్యయా స్మ నశ్
చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్
యేనైకదేశేऽఖిలసర్గసౌష్ఠవం
త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః
లోకములో ఎలాంటి వారు అలాంటి వారితో పని చేయించుకుంటారు. మంచి వాడు మంచివాడినీ కౄరుడు కౄరున్నీ దూతగా పంపుతారు.నీవు కౄరుడవు. కౄరుడవైన నీవు అకౄరున్ని పంపావు. అకౄరుడనే పేరుతో ఇంతకాలం మాకు ఇచ్చిన చక్కని కన్నుని ఎత్తుకు తీసుకుపోతున్నావు. ఒక్క కృష్ణుడిలోనే నీ సృష్టి యొక్క సౌందర్యాన్ని మేము చూసాము. నీ సృష్టిలో చమత్కారాన్ని అందాన్ని కృష్ణుడిలో చూపావు. చూపి వెంటనే అపహరించావు. బ్రహ్మ సృష్టి అంతా ఇంత మధురముగా ఉంటుంది అనుకున్నాము. కానీ అది ఇంత కౄరముగా ఉంటుందనుకోలేదు
న నన్దసూనుః క్షణభఙ్గసౌహృదః
సమీక్షతే నః స్వకృతాతురా బత
విహాయ గేహాన్స్వజనాన్సుతాన్పతీంస్
తద్దాస్యమద్ధోపగతా నవప్రియః
నంద పుత్రుడు కృష్ణుడి ప్రేమ క్షణ కాలమే. కృష్ణ పరమాత్మ లేకుంటే మేమెంత వ్యధ చెందుతామో కృష్ణుడు చూడటం లేదు. మేము మా ఇళ్ళనూ బంధువులనూ మిత్రులనూ అందరినీ విడిచిపెట్టి అతని దాస్యాన్నే కోరి ఎంతగా పరితపిస్తున్నామో అతను తెలుసుకోవడం లేదు.
సుఖం ప్రభాతా రజనీయమాశిషః సత్యా బభూవుః పురయోషితాం ధ్రువమ్
యాః సంప్రవిష్టస్య ముఖం వ్రజస్పతేః పాస్యన్త్యపాఙ్గోత్కలితస్మితాసవమ్
ఇంత వరకూ మాకు అన్ని ప్రాతఃకాలాలూ శుభోదయములే. మంచి ఉదయాలే. లేవగానే అందరం మా కృష్ణయ్య ముఖాలే చూస్తున్నాము. సూర్యాస్తమయం కాగానే ఆయన ముఖాన్ని చూస్తాము. మధ్యాన్నమంతా ఆయనను తలచుకుంటూనే గడుపుతాము. ఆయన దర్శన స్మరణతోనే పొద్దు పొడుస్తుంది పొద్దు గుంకుతుందీ పొద్దు పోతుంది. ఈ పుర స్త్రీల కాలమంతా సుఖముగా గడిచాయి. సాయం కాలమవుతూ ఉంటే కృష్ణ పరమాత్మ ముఖం యొక్క మకరందాన్ని మేము సేవిస్తాము. ఆయన ముఖములో ఉన్న చిరునవ్వు అనే మద్యాన్ని మా కన్నుల దొన్నలతో తాగుతాము. తాగి మత్తిల్లుతాము. హాయిగా సాగే మా దిన చర్యను చెడగొడుతున్నాడు
తాసాం ముకున్దో మధుమఞ్జుభాషితైర్
గృహీతచిత్తః పరవాన్మనస్వ్యపి
కథం పునర్నః ప్రతియాస్యతేऽబలా
గ్రామ్యాః సలజ్జస్మితవిభ్రమైర్భ్రమన్
పరాధీనుడైనా జ్ఞ్యానం కలవాడైనా, మంచి మంచి మాటలతోటి మనసును హరించి, వీళ్ళనిలా మంచి మంచి మాటలతో పరిహాసాలతో వారి మనసును హరించానే నేను లేకపోతే వీరు ఎలా బతుకుతారు అని ఆ కృష్ణుడు ఆలోచించట్లేదు. ఈ నాటినుంచే మధురా నగరిలోనే కళ్ళు అన్నీ తెరుచుకుంటాయి వ్రేపల్లేలో కన్నులు అన్నీ మూసుకుపోతాయి. అక్కడ ఉన్న వారి కన్నులకే పండుగ.
అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే దాశార్హభోజాన్ధకవృష్ణిసాత్వతామ్
మహోత్సవః శ్రీరమణం గుణాస్పదం ద్రక్ష్యన్తి యే చాధ్వని దేవకీసుతమ్
ఇక్కడి నుండీ మధురా నగరం వెళ్ళే దారిలో దేవకీ సుతున్ని ఎవరు చూస్తారో వారి కనులకు పండుగ అవుతుంది. అమ్మవారికే ఆనందం కలిగించేవాడు, సకల గుణములకూ అనంతమైన కళ్యాణ గుణములకు అతను ఆకారం. అటువంటి స్వామిని చూచేవారి కళ్ళకు పెద్ద పండుగ
మైతద్విధస్యాకరుణస్య నామ భూదక్రూర ఇత్యేతదతీవ దారుణః
యోऽసావనాశ్వాస్య సుదుఃఖితమ్జనం ప్రియాత్ప్రియం నేష్యతి పారమధ్వనః
పేరు పెట్టే వారు జాతకం చూసి పెడతారు కదా. ఇంత మంది గోపికలకు బాధ కలిగించే వాడికి, ఇంత దయ లేని వాడికి అకౄరుడని పేరు పెట్టారు. వచ్చీ రాగానే తీసుకు పోతా అని అంటున్నాడు. మాకు ఒక మాటైనా చెప్పకుండా మా మనసుని ఓదార్చకుండా తీసుకు వెళుతున్నాడు.
అనార్ద్రధీరేష సమాస్థితో రథం తమన్వమీ చ త్వరయన్తి దుర్మదాః
గోపా అనోభిః స్థవిరైరుపేక్షితం దైవం చ నోऽద్య ప్రతికూలమీహతే
ఇతనిది పొడి బుద్ధి (దయ లేని వాడు), అతనూ అలాంటి వాడే, అతని వెంట ఉండేవారు కూడా అలాంటివారే. అందరూ తొందర పెడుతున్నారు. అంతా ముసలి వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు. అందుకే ఎవరూ ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ రోజు దైవం కూడా మాకు ప్రతికూలాన్నే కోరుతోంది
నివారయామః సముపేత్య మాధవం కిం నోऽకరిష్యన్కులవృద్ధబాన్ధవాః
ముకున్దసఙ్గాన్నిమిషార్ధదుస్త్యజాద్దైవేన విధ్వంసితదీనచేతసామ్
మనమందరం నివారిద్దాము. కృష్ణున్ని వెళ్ళకుడా ఆపేద్దాము. పరమాత్మ చేతనే మా పరిస్థితి ఇలా దైన్యముగా ఉంది. ఒక అరనిముషముతో పరమాత్మతో స్నేహాన్ని విడిచిపెట్టలేము. దైవమే మాకు ఇలాంటి ప్రేమనూ స్నేహాన్ని చెడగొడుతూ ఉన్నది.
యస్యానురాగలలితస్మితవల్గుమన్త్ర
లీలావలోకపరిరమ్భణరాసగోష్ఠామ్
నీతాః స్మ నః క్షణమివ క్షణదా వినా తం
గోప్యః కథం న్వతితరేమ తమో దురన్తమ్
ఎన్నో రాత్రులు ఒక్క క్షణ కాలములా ఎవరి ప్రేమతో, చక్కని చూపుతో చిరునవ్వుతో ఆలింగనములతో ఎన్నో రాత్రులు క్షణ కాలములా గడచిపోయాయి. అలాంటి స్వామి లేకుండా అంతం కనపడని ఈ దుఃఖాన్ని గోపికలు ఎలా దాటగలరు
యోऽహ్నః క్షయే వ్రజమనన్తసఖః పరీతో
గోపైర్విశన్ఖురరజశ్ఛురితాలకస్రక్
వేణుం క్వణన్స్మితకతాక్షనిరీక్షణేన
చిత్తం క్షిణోత్యముమృతే ను కథం భవేమ
సాయం కాలం కాగానే బలరామునితో కలసి గోపాలకులను తీసుకుని ఆవుల గిట్టల వలన లేచిన దుమ్ము నిండిన పూల మాలలు కల, వేణువు ఊదుతూ చిరునవ్వు నిండిన చూపు ప్రసరింపచేస్తూ అందరి హృదయాలను అపహరించేవాడు. సాయంకాలం అయ్యిందంటే దుమ్ముకొట్టిన ముఖం దుమ్ముకొట్టిన ముంగురులతో దర్శనం ఇచ్చే కృష్ణ పరమాత్మ లేకుండా ఎలా బతుకుతాము.
శ్రీశుక ఉవాచ
ఏవం బ్రువాణా విరహాతురా భృశం వ్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః
విసృజ్య లజ్జాం రురుదుః స్మ సుస్వరం గోవిన్ద దామోదర మాధవేతి
అందరూ ఆలోచించారు. ఏ మార్గమూ దొరకలేదు. విరహాతురలై గోపికా స్త్రీలందరూ కృష్ణ పరమాత్మయందే ఆసక్తి కలవారి సిగ్గును కూడా విడిచిపెట్టి పెద్దగా ఏదిచారు. గోవిందా మధావా దామోదరా అంటూ
స్త్రీణామేవం రుదన్తీనాముదితే సవితర్యథ
అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథమ్
ఇలా వారు ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో తెల్లవారింది. స్నానాది కృత్యములన్నీ పూర్తిచేసుకున్న అకౄరుడు తొందరపెట్టగా
గోపాస్తమన్వసజ్జన్త నన్దాద్యాః శకటైస్తతః
ఆదాయోపాయనం భూరి కుమ్భాన్గోరససమ్భృతాన్
నందాదులందరితో కలసి గోపాలకులందరూ అతని వెంట బయలు దేరి వెళ్ళాడు. కానుకలను తీసుకుని గోపాలురు అందరూ అతని వెంట బయలు దేరారు
గోప్యశ్చ దయితం కృష్ణమనువ్రజ్యానురఞ్జితాః
ప్రత్యాదేశం భగవతః కాఙ్క్షన్త్యశ్చావతస్థిరే
గోపికలు కూడా కృష్ణున్ని విడువలేక అనురాగం నిండి వారి వెంట కొంత దూరం వారి వెంట వెళ్ళారు. స్వామి ఏమి చెబుతాడో అని ఎదురుచూస్తూ, గోపికలందరూ పరితపిస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్వామి
తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వప్రస్థాణే యదూత్తమః
సాన్త్వయామస సప్రేమైరాయాస్య ఇతి దౌత్యకైః
వారిని ఓదార్చడానికి, తొందరగానే వస్తానని చెప్పడానికి దూతను పంపాడు
యావదాలక్ష్యతే కేతుర్యావద్రేణూ రథస్య చ
అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాః
గోపికలు మాత్రం అలాగే అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయారు. రథం కనపడే దాకా చూసారు. తరువాత రథం యొక్క ధ్వజం కనపడేదాకా, రథం వెళుతుంటే వచ్చే ధూళి కనపడే వరకూ చూస్తూనే ఉన్నారు
తా నిరాశా నివవృతుర్గోవిన్దవినివర్తనే
విశోకా అహనీ నిన్యుర్గాయన్త్యః ప్రియచేష్టితమ్
స్వామి తిరిగి వస్తాడన్న ఆశస్ను విడిచి నిరాశులై వెనక్కు వచ్చారు. పగలంతా కృష్ణ పరమాత్మ చేష్టలను గానం చేస్తూ గడిపారు
భగవానపి సమ్ప్రాప్తో రామాక్రూరయుతో నృప
రథేన వాయువేగేన కాలిన్దీమఘనాశినీమ్
బలరామ కృష్ణులతో అకౄరుడు తక్కిన వారందరూ వాయువేగముతో బయలుదేరి వెళ్ళి సకల పాపములు తొలగించే యమునా నదిని చూసారు. నది కనపడగానే అక్కడ ఆగి సంధ్యా వందనం చేయాలి (పితృ తర్పణం పిండ ప్రదానం చేయాలి)
తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభమ్
వృక్షషణ్డముపవ్రజ్య సరామో రథమావిశత్
అక్కడ దిగి వీరు స్నానం చేసి ఆచమనం చేసి నీరు పానం చేసి రథాన్ని రామాదులందరూ ఒక చెట్టు నీడలో ఉంచారు.
అక్రూరస్తావుపామన్త్ర్య నివేశ్య చ రథోపరి
కాలిన్ద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్
సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి, స్నానం చేసి, గాయత్రీ మంత్రాన్ని జపించాడు
నిమజ్జ్య తస్మిన్సలిలే జపన్బ్రహ్మ సనాతనమ్
తావేవ దదృశేऽక్రూరో రామకృష్ణౌ సమన్వితౌ
జపం చేస్తూ ఉంటే కాళిందీ జలములో రామ కృష్ణులు కనపడ్డారు.
తౌ రథస్థౌ కథమిహ సుతావానకదున్దుభేః
తర్హి స్విత్స్యన్దనే న స్త ఇత్యున్మజ్జ్య వ్యచష్ట సః
రథం మీదే ఉన్నారు కదా. అక్కడ ఉన్నవారు ఇక్కడకు ఎలా వచ్చారు. మునగగానే నీటిలో కనపడ్డారు. లేచి చూస్తే ఒడ్డునా కనపడ్డారు
తత్రాపి చ యథాపూర్వమాసీనౌ పునరేవ సః
న్యమజ్జద్దర్శనం యన్మే మృషా కిం సలిలే తయోః
మళ్ళీ నీటిలో మునిగాడు. నీటిలో మళ్ళీ కనపడ్డారు.
భూయస్తత్రాపి సోऽద్రాక్షీత్స్తూయమానమహీశ్వరమ్
సిద్ధచారణగన్ధర్వైరసురైర్నతకన్ధరైః
మళ్ళీ మునిగేసరికి రామ కృష్ణులు కనపడలేదు. ఆది శేషుడు కనపడ్డాడు. సిద్ధ చారణ గంధర్వాదులచే స్తోత్రం చేయబడుతూ, వేయి శిరస్సులూ, వాటి మీద మణులు, నీలాంబర ధారి, తామర తూడులాగ తెల్లని దేహం వాడు. తెల్లటి మహా పర్వతములా ఉన్న ఆదిశేషుడు కనపడ్డాడు. కొంచెం ఆశ్చర్యముగా చూస్తుండగానే ఆదిశేషుని శయ్య మీద ఘనశ్యాముడు పీతాంబరధారి, ఆరు భుజములతో పరమ ప్రశాంతమైన చూపుతో, పద్మ నేత్రాలతో సుందరమైన ప్రసన్నమైన ముఖం కలవాడు చూడగానే అందరి మనసు ఆకట్టుకొనేంతటి చక్కని తీయని చిరునవ్వు కలవాడు, చక్కని కనుబొమ్మలు ఎత్తైన నాసికా మంచి చెవులూ చక్కని చెక్కిళ్ళూ ఎర్రని అధరం
సహస్రశిరసం దేవం సహస్రఫణమౌలినమ్
నీలామ్బరం విసశ్వేతం శృఙ్గైః శ్వేతమివ స్థితమ్
తస్యోత్సఙ్గే ఘనస్యామం పీతకౌశేయవాససమ్
పురుషం చతుర్భుజం శాన్తమ్పద్మపత్రారుణేక్షణమ్
చారుప్రసన్నవదనం చారుహాసనిరీక్షణమ్
సుభ్రూన్నసం చరుకర్ణం సుకపోలారుణాధరమ్
ప్రలమ్బపీవరభుజం తుఙ్గాంసోరఃస్థలశ్రియమ్
కమ్బుకణ్ఠం నిమ్ననాభిం వలిమత్పల్లవోదరమ్
బృహత్కతితతశ్రోణి కరభోరుద్వయాన్వితమ్
చారుజానుయుగం చారు జఙ్ఘాయుగలసంయుతమ్
తుఙ్గగుల్ఫారుణనఖ వ్రాతదీధితిభిర్వృతమ్
నవాఙ్గుల్యఙ్గుష్ఠదలైర్విలసత్పాదపఙ్కజమ్
ఉన్నతమైన వక్షస్థలం కలవాడు. ఉదరం నాభీ ఊరువులూ మోకాళ్ళు పిక్కలు పాదములూ
ఎత్తైన కాలి గోళ్ళ కాంతులతో అన్ని దిక్కులనూ ప్రకాశింపచేస్తున్నవాడు
సుమహార్హమణివ్రాత కిరీటకటకాఙ్గదైః
కటిసూత్రబ్రహ్మసూత్ర హారనూపురకుణ్డలైః
బంగారు మొలతాడు బంగారు యజ్ఞ్యోపవీతమూ హారములూ కుండలములతో
భ్రాజమానం పద్మకరం శఙ్ఖచక్రగదాధరమ్
శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభం వనమాలినమ్
శంఖ చక్ర గద కలవాడు. శ్రీవత్సం అనే పుట్టు మచ్చ గలవాడు కౌస్తుభ మణి గలవాడు, వనమాలి
సునన్దనన్దప్రముఖైః పర్షదైః సనకాదిభిః
సురేశైర్బ్రహ్మరుద్రాద్యైర్నవభిశ్చ ద్విజోత్తమైః
నవ బ్రహ్మలతో ఏకాదశ రుద్రులతో
ప్రహ్రాదనారదవసు ప్రముఖైర్భాగవతోత్తమైః
స్తూయమానం పృథగ్భావైర్వచోభిరమలాత్మభిః
ప్రహ్లాద నారదాది భక్తులతో పరిశుద్ధమైన మనసుగల పరమభక్తులతో స్తోత్రం చేయబడుతూ ఉండగా
శ్రియా పుష్ట్యా గిరా కాన్త్యా కీర్త్యా తుష్ట్యేలయోర్జయా
విద్యయావిద్యయా శక్త్యా మాయయా చ నిషేవితమ్
అష్ట శక్తులూ, పదహారు కళలతో
విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయా యుతః
హృష్యత్తనూరుహో భావ పరిక్లిన్నాత్మలోచనః
ఇలాంటి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరిచుకున్న అకౄరుడు పరమ భక్తి కలవాడై శరీరం పులకించగా, పరిశుద్ధమైన భక్తి భావముతో మనసు కూడా తడిసిపోయింది.
గిరా గద్గదయాస్తౌషీత్సత్త్వమాలమ్బ్య సాత్వతః
ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాఞ్జలిపుటః శనైః
అలాంటి స్వామిని చూచి గద్గద స్వరముతో సాత్వతుడైన అకౄరుడుసత్వ గుణాన్ని స్వీకరించి తల వంచి నమస్కరించి చేతులు జోడించి మెలమెల్లగా స్వామిని స్తోత్రం చేసాడు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు